Liquor sales: రికార్డులు కొత్తేంకాదుగా.. లెక్కల్ని మార్చేసిన కిక్కు.. తెలంగాణలో ఎంత మద్యం తాగారో తెలిస్తే!
న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ సందర్భంగా తెలంగాణలో మద్యం అమ్మకాలు రికార్డు స్థాయికి చేరాయి. కేవలం మూడు రోజుల్లోనే దాదాపు వెయ్యి కోట్ల రూపాయల విలువైన మద్యం విక్రయాలు జరిగాయని ఎక్సైజ్ శాఖ అధికారిక లెక్కలు చెబుతున్నాయి. పండుగ వాతావరణం, సెలబ్రేషన్ల ప్రభావంతో రాష్ట్రవ్యాప్తంగా మద్యం దుకాణాలు, బార్‌లు, పబ్‌లు కిటకిటలాడాయి.

అబ్కారీ శాఖ వివరాల ప్రకారం.. 2024 డిసెంబర్ చివరి మూడు రోజుల్లో రూ.736 కోట్ల విలువైన మద్యం అమ్మకాలు జరగగా, 2025 డిసెంబర్ చివరి మూడు రోజుల్లో ఈ సంఖ్య మరింత పెరిగి రూ.980 కోట్లను దాటింది. కొత్త మద్యం విధానం అమల్లోకి రావడంతో డిసెంబర్ నుంచి కొత్తగా లైసెన్స్‌లు పొందినవారు మద్యం విక్రయాల్లోకి దిగారు. దీని ప్రభావం అమ్మకాలపై స్పష్టంగా కనిపించింది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 3,620 మద్యం షాపులు, దాదాపు 1,100 బార్‌లు, పబ్‌లు, క్లబ్‌లు కలిసి డిసెంబర్ నెల మొత్తం మీద డిపోల నుంచి రూ.4,920 కోట్ల విలువైన మద్యాన్ని కొనుగోలు చేసినట్లు అధికారులు తెలిపారు.
డిసెంబర్ 25 నుంచి 31 వరకు ఒక్క వారంలోనే మద్యం విక్రయాల విలువ రూ.1,350 కోట్లకు పైగా ఉండడం గమనార్హం. ప్రత్యేకంగా చివరి మూడు రోజుల్లో అమ్మకాలు భారీగా నమోదయ్యాయి. డిసెంబర్ 29న రూ.280 కోట్లకు పైగా, 30న రూ.380 కోట్లకుపైగా, 31న రూ.315 కోట్లకు మించి మద్యం అమ్మకాలు జరిగాయి.
ఈ మూడు రోజుల్లోనే దాదాపు రూ.వెయ్యి కోట్ల విలువైన మద్యం విక్రయాలు జరగడం రాష్ట్ర చరిత్రలోనే అరుదైన విషయంగా అబ్కారీ శాఖ చెబుతోంది. అమ్మకాల పరంగా చూస్తే.. ఈ 3 రోజుల్లో మొత్తం 8.30 లక్షల కేసుల లిక్కర్, 7.78 లక్షల కేసుల బీరు సేల్ అయ్యాయి. న్యూ ఇయర్ వేడుకలు, వీకెండ్, కొత్త మద్యం పాలసీ కలసి తెలంగాణలో మద్యం విక్రయాలను ఓ రేంజ్‌కు చేర్చాయన్నది అధికారులు వెర్షన్.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
