Telangana Weather: రాష్ట్రంలో వచ్చే మూడు రోజులు భారీ నుంచి అతి భారీ వర్షాలు
తెలంగాణలోని కొన్ని జిల్లాల్లో రాగల మూడు రోజులు ఉరుములు మెరుపులతో కూడిన భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అంచనా వేసింది. ఈ నెల 9న కుమురం భీం ఆసిఫాబాద్, మంచిర్యాల, జయశంకర్ భూపాలపల్లి, ములుగు జిల్లాల్లో వర్షాలు పడే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం పేర్కొంది.
తెలంగాణలో వర్షాలు ఆగేలా కనిపించడం లేదు. రాష్ట్రవ్యాప్తంగా కొన్ని జిల్లాల్లో.. నేడు(శనివారం) భారీ వర్షాలు పడే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఆదివారం, సోమవారం భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది. వర్షం కురిసే సమయంలో ఉరుములు, మెరుపులతో పాటు గంటకు గంటకు 30 నుంచి 40 కిలో మీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని తెలిపింది. ఉత్తర బంగాళాఖాతంలో కొనసాగుతున్న అల్పపీడన ప్రాంతం ఉత్తర దిశగా కదులుతూ వాయువ్య పరిసర మధ్య బంగాళాఖాతంలో.. పూర్తి స్థాయి అల్పపీడనంగా ఏర్పడిందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. దీనికి అనుబంధ ఆవర్తనం సగటు సముద్రమట్టం నుంచి 7.6 కిలోమీటర్ల ఎత్తు వరకు విస్తరించి ఇంకా ఎత్తుకు వెళ్లే కొలదీ నైరుతి దిశకు వంగి ఉందని వెల్లడించారు. ఇది ఉత్తర దిశగా కదులుతూ బలపడి ఉత్తర ఒడిశా, పశ్చిమ బెంగాల్ తీరంలోని వాయువ్య బంగాళాఖాతం వద్ద ఆదివారం వాయుగుండంగా మారే చాన్స్ ఉందట. తరువాత ఇది పశ్చిమ-వాయువ్య దిశగా కదులుతూ వచ్చే మూడు రోజులలో గంగేటిక్ పశ్చిమ బెంగాల్, ఉత్తర ఒడిశా, ఝార్ఖండ్ పరిసర ఉత్తర ఛత్తీస్‌గఢ్ మీదుగా కొనసాగే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది.
మరో వైపు ఈ నెల 9న మంచిర్యాల, జయశంకర్ భూపాలపల్లి, కుమురం భీం ఆసిఫాబాద్, ములుగు జిల్లాల్లో వర్షాలు పడే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలపింది. కరీంనగర్, పెద్దపల్లి, ఆదిలాబాద్, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లోనూ అక్కడక్కడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది.
ఇప్పటికే భారీ వర్షాలు, వరదలతో రాష్ట్రం అతలాకుతలం అయిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే వాతావరణ శాఖ తాజా హెచ్చరికలతో ప్రజలు భయకంపితులు అవతున్నారు. ప్రభుత్వం అధికార యంత్రాగాన్ని అప్రమత్తం చేసింది.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..