Minister Srinivas Goud: శ్రీశైలంలో విద్యుత్ ఉత్పత్తి ఆపే ప్రసక్తే లేదు.. గత జీవోలకు అనుగుణంగానే ప్రాజెక్టుల నిర్మాణంః మంత్రి శ్రీనివాస్ గౌడ్
శ్రీశైలంలో జల విద్యుత్ ఉత్పత్తి ఎట్టి పరిస్థితుల్లోనూ ఆపే ప్రసక్తే లేదని మంత్రి శ్రీనివాస్ గౌడ్ స్పష్టం చేశారు. శ్రీశైలం ప్రాజెక్టు కట్టిందే విద్యుత్ ఉత్పత్తి కోసమే అని తేల్చి చెప్పారు.
Minister Srinivas Goud: తెలుగు రాష్ట్రాల మధ్య జల జగడం ప్రాజెక్ట్‌ల దగ్గర హైటెన్షన్‌ను క్రియేట్ చేస్తోంది. తెలంగాణ, ఏపీ పోలీసులు ప్రాజెక్ట్‌ల దగ్గర బందోబస్తును పెంచడం ఉద్రిక్తతకు దారితీస్తోంది. సాగర్ పవర్ ప్రాజెక్టులో విద్యుత్ ఉత్పత్తిని నిలిపి వేయాలంటూ వినతి పత్రం ఇచ్చేందుకు వచ్చిన ఏపీ అధికారులను తెలంగాణ సరిహద్దు దగ్గరే ఆపేశారు పోలీసులు. ఏపీ అధికారుల వినతి పత్రాన్ని తీసుకునేందుకు నిరాకరించారు తెలంగాణ జెన్‌కో అధికారులు. తాజాగా ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తెలంగాణలో విద్యుత్ ఉత్పత్తి ఆపాలంటూ ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ రాయడంపై తెలంగాణ మంత్రి శ్రీనివాస్ గౌడ్ తీవ్రస్థాయిలో ఫైర్ అయ్యారు. టీవీ9 కు ఇచ్చిన ఇంటర్య్వూలో ఆయన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ తీరును తప్పుబట్టారు.
శ్రీశైలంలో జల విద్యుత్ ఉత్పత్తి ఎట్టి పరిస్థితుల్లోనూ ఆపే ప్రసక్తే లేదని మంత్రి శ్రీనివాస్ గౌడ్ స్పష్టం చేశారు. శ్రీశైలం ప్రాజెక్టు కట్టిందే విద్యుత్ ఉత్పత్తి కోసమే అని తేల్చి చెప్పారు. తమ పోరాటం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంపైనే కానీ, ఆ రాష్ట్ర ప్రజలపై కాదన్నారు మంత్రి శ్రీనివాస్‌గౌడ్. అక్రమంగా ప్రాజెక్ట్‌లు కట్టడమే కాకుండా జల విద్యుత్ ఆపాలని డిమాండ్ చేయడం ఏంటని నిలదీశారు. తెలంగాణ వచ్చాక సీమాంధ్ర ప్రజలకు ఏ చిన్న ఇబ్బంది అయినా వచ్చిందా అని ప్రశ్నించారు మంత్రి శ్రీనివాస్‌గౌడ్.
హుజూరాబాద్ చిన్న ఉప ఎన్నిక దానికోసం మాకు ఇంత రాజకీయం చేయాల్సిన అవసరం మాకులేదని మంత్రి తెలిపారు. ఇక్కడున్న ప్రజలంతా తెలంగాణ వారేనని.. ఆంధ్ర ప్రజలను మావాళ్లే అని మేము భావిస్తుంటే.. ఏపీ నేతలు వారిని సెటిలర్స్ అని సంబోధిస్తున్నారన్నారు. గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రులుగా పనిచేసిన వైయస్సార్, కిరణ్ కుమార్ రెడ్డి, చంద్రబాబు ఉ ఇచ్చిన జీవోలనే అమలు చేస్తున్నామన్నారు. ఆనాటి జీవోల ప్రకారమే ప్రాజెక్టులు నిర్మించామని పేర్కొన్నారు. ఆ జీవోలు తప్పంటే తెలంగాణ ప్రజలను మోసగించడానికి ఇచ్చిన జీవోలని ఒప్పుకోవాలని శ్రీనివాస్ ధ్వజమెత్తారు.
కేంద్ర ప్రభుత్వంతో మీకు దగ్గరి సంబంధాలు ఉన్నాయని చట్ట ఉల్లంఘనలకు పాల్పడితే సహించేదీ లేదన్నారు మంత్రి. ప్రధానితో ఉన్న సంబంధాలను ఆసరగా చేసుకుని ప్రాజెక్టులను కేంద్రం ఆధీనంలోకి తేవాలని లేఖ రాయడం విడ్డూరమన్నారు. బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ తీర్పు రాకుండానే కేఆర్‌బీఎంకు అధికారాలు ఎలా ఇస్తారని మంత్రి శ్రీనివాస్ గౌడ్ ప్రశ్నించారు.