AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana Govt: గుడ్ న్యూస్ చెప్పిన తెలంగాణ మంత్రి.. వారికిచ్చే పెన్షన్ రూ. 1500 నుంచి రూ.3016 కి పెంపు..!

Telangana Govt: తెలంగాణకు చెందిన వృద్ధ కళాకారులకు రాష్ట్ర మంత్రి వి. శ్రీనివాస్ గౌడ్ శుభవార్త చెప్పారు. వృద్ధ కళాకారులకు ఇచ్చే రూ. 1500 పెన్షన్‌ను రూ. 3,016కి పెంచాలని..

Telangana Govt: గుడ్ న్యూస్ చెప్పిన తెలంగాణ మంత్రి.. వారికిచ్చే పెన్షన్ రూ. 1500 నుంచి రూ.3016 కి పెంపు..!
Minister Srinivas Goud
Shiva Prajapati
|

Updated on: May 27, 2021 | 9:50 PM

Share

Telangana Govt: తెలంగాణకు చెందిన వృద్ధ కళాకారులకు రాష్ట్ర మంత్రి వి. శ్రీనివాస్ గౌడ్ శుభవార్త చెప్పారు. వృద్ధ కళాకారులకు ఇచ్చే రూ. 1500 పెన్షన్‌ను రూ. 3,016కి పెంచాలని ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయించారు. తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా జూన్ 2వ తేదీ నుంచి పెంచిన పెన్షన్‌ను అమలు చేస్తారని తెలిపారు. గురువారం నాడు రవీంద్రభారతిలోని తన కార్యాలయంలో సాంస్కృతిక శాఖపై మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో మాట్లాడిన మంత్రి.. పెంచిన వృద్ధ కళాకారుల పెన్షన్లను తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జూన్ 2, 2021 నుండి వర్తింపజేయాలని ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. పెంచిన వృద్ధాప్య పెన్షన్ల వల్ల 2,661 మంది వృద్ధ కళాకారులకు ప్రయోజనం చేకూరుతుందన్నారు. కళాకారుల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని పెన్షన్ పెంచినందుకు ముఖ్యమంత్రి కేసీఆర్‌కు మంత్రి శ్రీనివాస్ గౌడ్ కృతజ్ఞతలు తెలిపారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ కళా ప్రియుడు అని, కళాకారులంటే ఎంతో గౌరవం ఉన్న నాయకుడు అని కొనియాడారు. ఆ కారణంగానే వృద్ధ కళాకారుల పెన్షన్‌ను పెంచుతూ నిర్ణయం తీసుకున్నారని అన్నారు.

కళలకు కాణాచి తెలంగాణ అని, సకల కళల ఖజానా గా రాష్ట్రాన్ని అభివర్ణించారు మంత్రి శ్రీనివాస్ గౌడ్. ఎంతో మంది జానపద, గ్రామీణ గిరిజన కళాకారులకు కొలువైన నేల తెలంగాణ అని పేర్కొన్నారు. ఉమ్మడి రాష్ట్ర పాలనలో తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలు, కళలు, సాహిత్యం, భాష వంటివి నిర్లక్ష్యానికి గురయ్యాయని అన్నారు. రాష్ట్ర అవతరణ అనంతరం వీటి అభివృద్ధి కోసం భాషా సాంస్కృతిక శాఖ ద్వారా ఎన్నెన్నో సాంస్కృతిక, సాహిత్య, కళాకార్యక్రమాలను రూపొందించి నిర్వహిస్తూ కళాకారులలో ఆత్మవిశ్వాసాన్ని పెంచుతున్నామన్నారు. జానపద జాతర, రాష్ట్ర అవతరణ వేడుకలు వంటి ఉత్సవాల ద్వారా వేలాదిమంది కళాకారులకు కళాప్రదర్శనలకు అవకాశమిస్తూ కళాకారులలో కొత్త ఉత్సాహాన్ని తీసుకురావడం జరిగిందన్నారు. జీవితాంతం కళాప్రదర్శనలోనే గడిపి, తమ జీవితాన్ని అంకితం చేసి, వృద్ధులు అయిన తర్వాత వారి సంక్షేమం కోసం వృద్ధ కళాకారుల పెన్షన్ ను ప్రభుత్వం అందిస్తుందని మంత్రి చెప్పుకొచ్చారు. తెలంగాణ ఏర్పడక ముందు ఈ పెన్షన్ మొత్తం కేవలం రూ. 500 మాత్రమే ఉండేదన్నారు.

తెలంగాణ రాష్ట్రం ఏర్పడగానే గౌరవ ముఖ్యమంత్రి కే. చంద్రశేఖరరావుగారు కళాకారుల పెన్షన్ ను రూ. 500 నుంచి రూ.1500 లకు పెంచామన్నారు. 2014 అక్టోబర్ నెల నుండి రాష్ట్రంలోని వృద్ధ కళాకారులకు అందిస్తున్నామని మంత్రి చెప్పుకొచ్చారు. మొత్తంగా 2,661 మంది వృద్ధ కళాకారులకు నెలకు 39.90 లక్షల చొప్పున సంవత్సరానికి 4 కోట్ల 78 లక్షల 80 వేల రూపాయలను అందిస్తున్నామని వెల్లడించారు. ఇప్పుడు వీరికిచ్చే పెన్షన్ పెంచడం వల్ల రాష్ట్ర వ్యాప్తంగా 2,661 మంది లబ్ది పొందుతారని, ప్రభుత్వం వీరి కోసం నెలకు రూ. 80 లక్షల చొప్పున సంవత్సరానికి 9 కోట్ల 62 లక్షల 71 వేల రూపాయలను ఖర్చు చేస్తుందన్నారు.

Also read:

NMDC Recruitment 2021: హైద‌రాబాద్ ఎన్ఎండీసీలో అంప్రెటిస్ ఖాళీలు.. మార్కుల ఆధారంగా ఎంపిక‌..

Instagram Reels: ఇకపై ఇన్‌స్టాగ్రమ్‌లో రీల్స్‌ను ఇలా డౌన్‌లోడ్ చేసుకోండి.. ఆఫ్‌లైన్‌లోనూ వీడియోలను ఆస్వాధించండి..