Telangana: హమ్మయ్య.. రోడ్డు ప్రమాదాలలో మరణాల నివారణకు తెలంగాణ సర్కారు కీలక నిర్ణయం..
రాష్ట్రంలో రోడ్డు ప్రమాదాలను తగ్గించేందుకు గాను తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగానే రహదార్ల చెంతనే అత్యవసర వైద్యం అందించేలా చర్యలు చేపట్టింది. సత్వర చికిత్స అందించి, ప్రాణాలు కాపాడేలా చర్యలు చేపట్టారు. రాష్ట్ర వ్యాప్తంగా 55 ట్రామా కేర్ కేంద్రాలను ఏర్పాటు చేయనున్నారు...
రాష్ట్రంలో రోడ్డు ప్రమాదాలను తగ్గించేందుకు గాను తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగానే రహదార్ల చెంతనే అత్యవసర వైద్యం అందించేలా చర్యలు చేపట్టింది. సత్వర చికిత్స అందించి, ప్రాణాలు కాపాడేలా చర్యలు చేపట్టారు. రాష్ట్ర వ్యాప్తంగా 55 ట్రామా కేర్ కేంద్రాలను ఏర్పాటు చేయనున్నారు. ట్రామా, హార్ట్ అటాక్, బ్రెయిన్ స్ట్రోక్స్, మాతా శిశు అత్యవసర సేవలను ప్రారంభించనున్నారు. తెలంగాణ ఎమర్జెన్సీ రెస్పాన్స్ ఇనిషియేషన్ (టెరి)కు ప్రభుత్వం శ్రీకారం చుట్టినట్లు తెలంగాణ వైద్యారోగ్యశాఖ మంత్రి హరీష్ రావు తెలిపారు.
ప్రాణ నష్టాన్ని నివారించడమే లక్ష్యం..
అత్యవసర వైద్య సేవలు మరింత చేరువ చేసేందుకు తెలంగాణ ఎమర్జెన్సీ రెస్పాన్స్ ఇనిషియేషన్ కు ప్రభుత్వం ఏర్పాటు చేయనుంది. రాష్ట్ర వైద్యాధికారులు, తమిళనాడు తరహా విధానంపై క్షేత్రస్థాయిలో అధ్యయనం చేసి, ఇక్కడి అవసరాలకు అనుగుణంగా, రూపొందించిన నూతన నివేదికపై మంత్రి హరీశ్ రావు ఇటీవల సమీక్షించారు. ప్రకృతి విపత్తులు, రోడ్డు ప్రమాదాలు, పని ప్రదేశాల్లో ప్రమాదాలు, అగ్నిప్రమాదాలు సహా హార్ట్ అటాక్, బ్రెయిన్ స్ట్రోక్, మాతా శిశు అత్యవసర సేవలు, మెడికల్, సర్జికల్ ఎమర్జెన్సీస్ వంటి 6 రకాల ప్రమాద బాధితులకు అవసరమైన వైద్యాన్నితక్షణం అందించడం, తద్వారా ప్రాణ నష్టాన్ని సాధ్యమైనంతవరకు నివారించడమే దీని ప్రధాన లక్ష్యం.
ఎమర్జెన్సీ విభాగానికి వచ్చే కేసుల్లో అత్యధికంగా 24శాతం ట్రామా, రోడ్డు ప్రమాద బాధితులు ఉంటున్నారు. ఆసుపత్రిలో చేరకముందు జరుగుతున్న 35 శాతం మరణాలకు, ఆసుపత్రుల్లో చేరిన 24 గంటల లోపు జరిగే 40శాతం ట్రామా మరణాలకు రక్తస్రావం కారణం అవుతుంది. ప్రీ హాస్పిటల్, ఎమర్జెన్సీ సర్వీసెస్, రిహాబిలిటేషన్, సర్జరీ, స్పెషలిస్ట్, ఇన్వెస్టిగేషన్ ఫెసిలిటీస్ మధ్య సమన్వయం లోపం కారణంగా మరణాల రేటు ఎక్కువగా ఉన్నట్లు గుర్తించడం జరిగింది. సకాలంలో స్పందించడం ద్వారా 30 నుంచి 40శాతం హాస్పిటల్ మరణాలను నివారించవచ్చు అని అధ్యయనాలు చెబుతున్నాయి.
ఈ క్రమంలో అన్ని జిల్లాల్లోని ప్రధాన రహదార్లు కలుపుకునేలా 55 ట్రామా సెంటర్లు ఏర్పాటు చేయాలని సర్కారు నిర్ణయించింది. కేంద్రాలు ఏర్పాటు చేసే 55 ఆసుపత్రుల్లో నిమ్స్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి, 17 టీచింగ్ ఆసుపత్రులు, 21 జిల్లా ఆసుపత్రులు, 16 ఏరియా ఆసుపత్రులు ఉన్నాయి. తెలంగాణలోని అన్ని రహదార్లు కవర్ అయ్యేలా దీన్ని రూపొందించారు. ప్రీ హాస్పిటల్ లో భాగంగా ప్రమాద బాధితులను సురక్షితంగా ఆసుపత్రికి చేర్చుతారు. ఇందులో భాగంగా ప్రమాద ఘటన స్థలికి వేగంగా 108 అంబులెన్స్ చేరేలా అత్యాధునిక టెక్నాలజీ వినియోగిస్తారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి..