Contract Lecturers : కాంట్రాక్ట్ లెక్చరర్ల కళ్లల్లో ఆనందం.. కేసీఆర్ సర్కారు జీతాలు పెంచడంతో పరవశం
శ్రమకు తగ్గ ఫలితం దక్కడం లేదన్న నిరుత్సాహంలో కొట్టుమిట్టాడుతోన్న తెలంగాణ కాంట్రాక్ట్ లెక్చరర్లకు కేసీఆర్ ప్రభుత్వం తీపి కబురు చెప్పడంతో ఆ వర్గం పరవశించిపోతోంది.
Contract Lecturer faculty happy : శ్రమకు తగ్గ ఫలితం దక్కడం లేదన్న నిరుత్సాహంలో కొట్టుమిట్టాడుతోన్న తెలంగాణ కాంట్రాక్ట్ లెక్చరర్లకు కేసీఆర్ ప్రభుత్వం తీపి కబురు చెప్పడంతో ఆ వర్గం పరవశించిపోతోంది. రెగ్యులర్ ప్రభుత్వ లెక్చరర్లతో సమానంగా కాంట్రాక్టు లెక్చరర్ల వేతనాలు కూడా పెంచింది తెలంగాణ ప్రభుత్వం. దీంతో ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా 320 మందికి వేతనాలు పెరగాయి. దీంతో వారంతా ఆనందంలో మునిగి తేలుతున్నారు. టీఆర్‌ఎస్ పార్టీ మొదటిసారి ఎన్నికల్లో పోటీ చేసిన సందర్భంలో తాము అధికారంలోకి వస్తే కాంట్రాక్ట్ ఉద్యోగులను రెగ్యులర్ చేస్తామని హామీ ఇచ్చిన నేపథ్యంలో సీఎం కేసీఆర్ ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు.
అందులో భాగంగానే అధికారంలోకి వచ్చిన తర్వాత రెగ్యులర్ చేస్తూ జీఓ 16ను విడుదల చేసింది. అయితే, ఆ సమస్య కోర్టులో పడడంతో రెగ్యులర్ ఉద్యోగులతో సమానంగా మూల వేతనాన్ని కాంట్రాక్ట్ ఉద్యోగులకు అమలు చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. 10వ పీఆర్‌సీ ప్రకారం వేతనాలు ఇవ్వడంతో అప్పటివరకు రూ.18 వేలకు పనిచేసిన కాంట్రాక్ట్ అధ్యాపకుల వేతనం రూ.37,100కు పెరిగింది. ఫలితంగా రెగ్యులర్ ఉద్యోగులతో సమానమైన వేతనం పొందుతూ వచ్చారు.
అయితే, గురువారం ప్రభుత్వం 11వ పీఆర్‌సీ ప్రకారం వేతనాలు పెంచుతూ జీఓ105 ద్వారా వేతనాలను పెంచుతూ నిర్ణయం తీసుకుంది. దీంతో ఒక్కో ఉద్యోగికి ప్రస్తుతం వేతనం రూ.54,220కు పెరిగింది. దీంతో కాంట్రాక్టు లెక్చరర్లు తమ ఆనందాన్ని వ్యక్తం చేస్తూ సీఎం కేసీఆర్ కు ధన్యవాదాలు చెబుతున్నారు.