Telangana: అది నోరా.. మోరీనా.. కేంద్ర మంత్రి షెకావత్‌పై ఫైర్ అయిన హరీష్ రావు..

Telangana: కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్‌పై రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు ఓ రేంజ్‌లో ఫైర్ అయ్యారు.

Telangana: అది నోరా.. మోరీనా.. కేంద్ర మంత్రి షెకావత్‌పై ఫైర్ అయిన హరీష్ రావు..
Minister Harish Rao
Follow us

|

Updated on: Aug 03, 2022 | 8:45 PM

Telangana: కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్‌పై రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు ఓ రేంజ్‌లో ఫైర్ అయ్యారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై అవినీతి ఆరోపణలు చేసిన నేపథ్యంలో స్పందించిన హరీష్ రావు.. తీవ్ర వ్యాఖ్యలతో విరుచుకుపడ్డారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై ఢిల్లీలో ఓ మాట.. పార్లమెంట్‌లో ఓ మాట.. గల్లీలో ఓ మాటతో ఇష్టం వచ్చినట్లు కామెంట్స్ చేస్తున్నారని ఫైర్ అయ్యారు. బుధవారం నాడు మేడ్చల్‌లో ఓ అభివృద్ధి కార్యక్రమంలో మాట్లాడిన హరీష్ రావు.. కేంద్ర మంత్రి తీరును తప్పుపట్టారు. కాళేశ్వరం ప్రాజెక్టు అక్రమ కట్టడం అంటూ చేసిన ఆరోపణలు తిప్పికొట్టారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు కేంద్రం అన్ని అనుమతులు ఇచ్చిందని స్పష్టం చేశారు.

‘‘అది నోరా.. మోరీనా.. గల్లీలో ఓ మాట.. ఢిల్లీలో ఓ మాట. పార్లమెంట్‌లో ఓ మాట.. ప్రజా క్షేత్రంలో ఓ మాట. కాళేశ్వరం ప్రాజెక్టు తెలంగాణకు లైఫ్ లైన్. తెలంగాణకు గొప్ప ప్రాజెక్టు. మేడ్చల్ నియోజకవర్గంలో, శామిర్ పేట చెరువులో రెండు మూడు నెలల్లో నీళ్లు పడతాయి. రావల్ కోల్ కేనాల్ ద్వారా మెడ్చెల్ కు కాళేశ్వరం నీరు వస్తుంది. కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా నీరు వస్తుంటే వారి కళ్లు మండుతున్నాయి. కేంద్ర మంత్రి మూడు నెలల కిందట శంషాబాద్ వచ్చారు. నాడు.. కాళేశ్వరం ప్రాజెక్టు తెలంగాణకు గ్రోత్ ఇంజన్, తెలంగాణ సస్య శ్యామలం అవుతుందని అన్నారు. ఇప్పుడు రాజకీయంగా లబ్ధి పొందాలనే ఉద్ధేశ్యంతో నాటి మాటలను మర్చిపోయి నేడు తెలంగాణకు వచ్చి పచ్చి అబద్ధాలు చెబుతున్నారు. కాళేశ్వరంలో అవినీతి అని, ప్రాజెక్టుకు అనుమతులు లేవని ఇప్పుడు పచ్చి అబద్ధాలు చెబుతున్నారు. ఫారెస్ట్ అనుమతులు లేవంటారు, పర్యావరణ అనుమతులు లేవంటారు, అవినీతి జరిగిందంటారు. ఐదు నెలల క్రితమే పార్లమెంట్‌లో ఏం చెప్పారు? ఇప్పుడు ఏం చెబుతున్నారు?. వెయ్యి అబద్ధాలాడి అయినా ఒక్క పెళ్లి చెయ్యాలన్నారు పెద్దలు. కానీ, బీజేపీ వాళ్ల కథ వెయ్యి అబద్ధాలు చెప్పి అయినా అధికారంలోకి రావాలనే ఆలోచనతో ఉన్నారు.’’ అని మంత్రి హరీష్ తీవ్రంగా విమర్శించారు.

ఈ ఏడాది జనవరి నెలలోనే కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి అన్ని అనుమతులను కేంద్రం ఇచ్చిందని మంత్రి హరీష్ రావు తెలిపారు. 18 లక్షల కొత్త ఆయకట్టు, మరో పద్దెనిమిదన్నర లక్షల ఎకరాలకు స్థిరీకరణ చేసే ప్రాజెక్టు అని, కాళేశ్వరం ప్రాజెక్టులో ఎలాంటి అవినీతి జరగలేదని పార్లమెంట్ సాక్షిగా కేంద్ర మంత్రి చెప్పారని గుర్తు చేశారు. పార్లమెంట్ సాక్షిగా చెప్పిన విషయాలను మరిచి.. నేడు పచ్చి అబద్ధాలను వల్లెవేస్తున్నారని ధ్వజమెత్తారు. కాళేశ్వరం ప్రాజెక్టు అనుమతులకు సంబంధించిన అన్ని కాగితాలు తమ వద్ద ఉన్నాయన్న మంత్రి హరీష్ రావు.. సెంట్రల్ వాటర్ కమిషన్ అన్ని అనుమతులు ఇచ్చిందన్నారు. ఎన్విరాన్‌మెంట్ క్లియరెన్స్ 22 డిసెంబర్ 2017లోనే ఇచ్చిందన్నారు. అలాగే అటవీశాఖ అనుమతులు 24 నవంబర్ 2017లో వచ్చిందని తెలిపారు. ఢిల్లీలో అనుమతి ఇచ్చామనేది వారే.. గల్లీలో అనుమతులు లేవనేది వారే.. అంటూ కేంద్ర మంత్రి తీరుపై నిప్పులు చెరిగారు హరీష్ రావు.

ఇవి కూడా చదవండి

ఉచితాలు వద్దంటూనే వారికి 12 లక్షల కోట్లు మాఫీ చేశారు.. ప్రధాని మోదీ ఉచితాలు వద్దంటూనే.. బడా పారిశ్రామికవేత్తలకు రూ. 12 లక్షల కోట్ల రుణాలు మాఫీ చేశారని మంత్రి హరీష్ రావు అన్నారు. రైతులకు 24 గంటల ఉచిత విద్యుత్, రైతులకు రూ. 5 లక్షల బీమా, పేద మహిళలకు ఆసరా పెన్షన్, కళ్యాణ లక్ష్మి లా పేలకు ప్రభుత్వ పథకాలు ఇవ్వొద్దని కేంద్రం భావిస్తోందన్నారు. కానీ, బడా కంపెనీలకు మాత్రం లక్షల కోట్లు ఉచితంగా దారాదత్తం చేయొచ్చట అని కేంద్రం తీరును తూర్పారబట్టారు మంత్రి హరీష్ రావు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..