Azadi ka Amrit Mahotsav: 75 ఏళ్ల స్వాతంత్ర్య చరిత్రలో ఎన్నో అచీవ్‌మెంట్స్.. భారత్ సాధించిన ఘనతలివే..!

Azadi ka Amrit Mahotsav: ఎందరో త్యాగధనులు అనేక సంవత్సరాలు పోరాటం చేసిన తర్వాత భారతదేశానికి 15 ఆగస్టు 1947న స్వాతంత్ర్యం వచ్చింది.

Azadi ka Amrit Mahotsav: 75 ఏళ్ల స్వాతంత్ర్య చరిత్రలో ఎన్నో అచీవ్‌మెంట్స్.. భారత్ సాధించిన ఘనతలివే..!
India Independence
Follow us
Shiva Prajapati

|

Updated on: Aug 02, 2022 | 9:25 PM

Azadi ka Amrit Mahotsav: ఎందరో త్యాగధనులు అనేక సంవత్సరాలు పోరాటం చేసిన తర్వాత భారతదేశానికి 15 ఆగస్టు 1947న స్వాతంత్ర్యం వచ్చింది. సుమారు 200 ఏళ్లకు పైగా బ్రిటిష్ పాలనలో భారతదేశం చాలా కోల్పోయింది. చరిత్రలో ఎంతో గొప్ప ప్రాముఖ్యత కలిగిన భారత్.. వాస్తవంలో మాత్రం చాలా వెనుకబాటుకు గురైంది. బ్రిటీష్ సామ్రాజ్యాధినేతలు మన దేశాన్ని సర్వం దోచుకున్నారు. అందినకాడికి ఎత్తుకెళ్లారు. అయినప్పటికీ మనవాళ్లు ఏమాత్రం కుంగిపోలేదు. స్వాతంత్ర్యానంతరం దేశాన్ని ఉన్నత స్థాయిలో నిలబెట్టేందుకు తీవ్రంగా శ్రమించారు. మెట్టు మెట్టు ఎక్కుతూ.. ప్రపంచ దేశాల్లో అగ్రగామిగా నిలిపారు. రాజ్యాంగం రచించుకోలేరు అంటూ అవహేళన చేసిన వారికి చెంపపెట్టులా సమాధానం ఇస్తూ.. ప్రపంచ దేశాల్లోనే అత్యున్నమైన రాజ్యాంగ రచన చేసి చూపించాం. ఆ రాజ్యాంగాన్ని అమలు చేసుకుంటూ.. గొప్ప ప్రజాస్వామ్యాన్ని సృష్టించుకున్నాం. ప్రపంచంలో ఏ దేశంలో లేని స్వేచ్ఛ సమానత్వపు హక్కులను మన భారతదేశ పౌరులు అనుభవిస్తున్నారంటే అది నాటి మేధావులు, స్వాతంత్ర్యోద్యమకారుల కృషి ఫలితమనే చెప్పాలి. మొత్తానికి ఫీనిక్స్ వలె ఇండియా పైకి లేచి.. ప్రపంచంలోనే శక్తివంతమైన, అభివృద్ధి చెందుతున్న దేశంగా తన స్థానాన్ని సుస్థిరం చేసుకుంది.

మరో 13 రోజులు గడిస్తే.. భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చి 75 సంవత్సరాలు పూర్తవుతుంది. దీనిని పురస్కరించుకుని భారత ప్రభుత్వం ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ ఉత్సవాలను నిర్వహిస్తుంది. దేశ స్వాతంత్ర్యోద్యమంలో పాల్గొన్న ప్రముఖులను జ్ఞప్తికి చేసుకుంటూ వారికి ప్రత్యేక గౌరవాన్ని ఇస్తుంది. అయితే, స్వాతంత్ర్యం వచ్చిన 75 ఏళ్లలో భారత్ ఎన్నో మైలు రాళ్లు సాధించింది. విద్యా, శాస్త్ర, సాంకేతిక, వ్యవసాయం, పారిశ్రామిక, వైద్యం, మౌలిక వసతుల కల్పన, రక్షణ, సేవలు, పరిపాలన, ఇలా అన్ని రంగాల్లో ఎనలేని అభివృద్ధి సాధించింది. ప్రతీ రంగంలో ప్రపంచ దేశాలతో పోటీ పడుతూ టాప్‌లో నిలుస్తోంది. 1947 నుంచి భారతదేశం సాధించిన విజయాలు ఏంటో ఇప్పుడు చూద్దాం..

భారత రాజ్యాంగం..

ఇవి కూడా చదవండి

దేశ స్వాతంత్ర్య చరిత్రలో మొట్ట మొదటి విజయం భారత రాజ్యాంగం. భారత రాజ్యాంగం 26 జనవరి 1951 నుంచి అమల్లోకి వచ్చింది. ప్రపంచంలోనే అతి పెద్ద రాజ్యాంగం. ప్రపంచంలో లౌకిక, ప్రస్వామ్య దేశంగా భారత్‌కు గుర్తింపునిచ్చింది.

‘‘భారత ప్రజలమైన మేము, భారతదేశాన్ని సర్వసత్తాక సామ్యవాద లౌకిక ప్రజాస్వామ్య గణతంత్ర రాజ్యంగా నిర్మించుకోవడానికి, పౌరులందరికీ: సాంఘిక, ఆర్థిక, రాజకీయ న్యాయాన్ని; ఆలోచన, భావప్రకటన, విశ్వాసం, ధర్మం, ఆరాధనల స్వాతంత్ర్యాన్ని ; అంతస్తుల్లోనూ, అవకాశాల్లోనూ, సమానత్వాన్ని చేకూర్చడానికి;, వారందరిలో వ్యక్తిత్వ గౌరవాన్ని, జాతీయ సమైక్యతను సంరక్షిస్తూ సౌభ్రాతృత్వాన్ని పెంపొందించడానికి; మన ఈ రాజ్యాంగ పరిషత్ లో 1949, నవంబర్ 26వ తేదీన ఎంపిక చేసుకొని, శాసనంగా రూపొందించుకున్న ఈ రాజ్యాంగాన్ని మాకు మేము సమర్పించుకుంటున్నాము.’’ అని పీఠికలో పేర్కొనడం జరిగింది.

హరిత విప్లవం..

హరిత విప్లవం 1967 సంవత్సరంలో తీసుకువచ్చారు. వ్యవసాయాధార దేశమైనప్పటికీ.. మన దేశంలో ఆహార కొరత చాలా ఉంది. అదే సమయంలో జనాభా ఎక్కువగా ఉంది. ఫలితంగా ఆహార ధాన్యాల దిగుమతులపై ఆధారపడాల్సిన పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలోనే నాటి ప్రభుత్వాలు హరిత విప్లవాన్ని తీసుకువచ్చింది. దాని ఫలితంగా నేడు భారతదేశ స్వరూపమే మారిపోయింది. భారత్ స్వయం సమృద్ధి గల దేశంగా మారింది. ఈ హరిత విప్లవం ఫలితంగా భారత్ నేడు.. బియ్యం, గోధుమలు, చెరకు, పప్పు ధాన్యాల ఉత్పత్తిలో, ఎగుమతిలో అగ్రగామిగా నిలిచింది.

పోలియో నిర్మూలన..

1994లో ప్రపంచంలోని పోలియో కేసుల్లో 60% భారతదేశంలోనే నమోదయ్యాయి. అయితే రెండు దశాబ్దాలలోనే భారతదేశం 2014లో ప్రపంచ ఆరోగ్య సంస్థ నుండి పోలియో రహిత దేశంగా గుర్తింపు పొందింది. పోలియోను నిరోధించడానికి చేసిన ప్రయత్నాలు.. దేశంలో ప్రజల ఆయుర్ధాయంను పెరిగేలా చేసింది.

సైన్స్ అండ్ టెక్నాలజీ(స్పేస్)..

భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో)ను 1969 ఆగస్టు 15న స్థాపించడం జరిగింది. ఇది భారతదేశంలో అంతరిక్ష పరిశోధనలకు కొత్త ఉత్సాహాన్ని అందించింది. 1975లో భారతదేశం తన మొదటి అంతరిక్ష ఉపగ్రహం ‘ఆర్యభట్ట’ ను ప్రయోగించింది. నాటి నుంచి ఇక వెనక్కి తిరిగి చూసుకోలేదు. రాకేష్ శర్మ 1986లో అంతరిక్షంలోకి వెళ్లిన మొదటి భారతీయుడిగా నిలిచారు. ప్రస్తుతం మేక్ ఇన్ ఇండియా కార్యక్రమంలో భాగంగా అత్యుత్తమ స్వదేశీ సాంకేతికత ఆధారిత ప్రయోగ వాహనాలు తయారు చేస్తున్నారు. 2008లో, భారతదేశం PSLV-C9 ద్వారా ఒకే మిషన్‌లో 10 ఉపగ్రహాలను కక్ష్యలోకి పంపి ప్రపంచ రికార్డు సృష్టించింది. చంద్రునిపైకి చంద్రయాన్ వంటి ఉపగ్రహాలను విజయవంతంగా ప్రయోగించడం జరిగింది. మంగళయాన్ మొదటి ప్రయత్నంలోనే అంగారక గ్రహాన్ని చేరుకున్న మొదటి దేశంగా భారత్ నిలిచింది.

విద్యా హక్కు..

భారతదేశ అభివృద్ధి విద్య కీలక పాత్ర పోషించిందనే చెప్పాలి. ఇదే విద్యను కీలకంగానూ మార్చింది. విద్యా హక్కు చట్టం – 2010 ద్వారా అందరికీ ఉచిత, నిర్బంధ ప్రాథమిక విద్యను అందిస్తున్నారు. విద్యను పొందడం ప్రతి ఒక్కరి హక్కుగా ఈ చట్టం ధృవీకరిస్తుంది.

శక్తివంతమైన రక్షణ వ్యవస్థ..

స్వాతంత్య్రానంతరం, చరిత్ర పునరావృతం కాకుండా భారతదేశం తన రక్షణ వ్యవస్థను బలోపేతం చేసింది. 1954లో, భారతదేశం అటామిక్ ఎనర్జీ ప్రోగ్రామ్‌ను ప్రారంభించింది. అలా చేసిన మొదటి దేశంగా భారత్ అవతరించింది. 1974లో భారతదేశం తన మొదటి అణు పరీక్ష ‘స్మైలింగ్ బుద్ధ’ను నిర్వహించి.. ఐదు అణుశక్తి దేశాల జాబితాలో చోటు సంపాదించుకుంది. ఇది 1947 నుండి భారతదేశం సాధించిన అతిపెద్ద విజయాలలో ఒకటి. నేడు, భారతదేశం ప్రపంచంలో 2వ అతిపెద్ద సైనిక శక్తిని కలిగి ఉంది.

లింగ సమానత్వం..

లింగ సమానత్వాన్ని ప్రోత్సహించేందుకు భారతదేశం ప్రగతిశీల చర్యలు చేపట్టింది. వరకట్న నిషేధ చట్టం-1961, గృహ హింస చట్టం-2005, సాంఘిక దురాచారాల నిర్మూలన వంటి కార్యక్రమాలు చేపట్టింది. బేటీ బచావో బేటీ పఢావో వంటి అనేక ప్రభుత్వ కార్యక్రమాలు దేశంలో లింగ వివక్షను తొలగించడంలో కీలక పాత్ర పోషించాయి.

అతిపెద్ద రవాణా వ్యవస్థ..

ప్రంపచంలోనే అతిపెద్ద రవాణా వ్యవస్థ కలిగిన దేశంగా భారత్ నిలిచింది. రోడ్డు సదుపాయాలతో పాటు, రైల్వే లైన్లు, విమానయానం, నౌకాయానం ఇలా అన్నింటిలోనూ ప్రపంచ అగ్రదేశాలతో సమానంగా నిలుస్తోంది.

వైద్య రంగంలో..

వైద్య సేవల్లో ప్రపంచమే అశ్చర్యపోయే స్థాయికి భారత్ చేరింది. భారత్‌‌కు చెందిన అనేక మెడిసిన్ కంపెనీలు ప్రపంచ దేశాల్లో సేవలు అందిస్తున్నాయి. కొన్ని వ్యాధులకు ఇండియాలోనే మెడిసిన్ కనిపెట్టడం జరిగింది. కరోనా మహమ్మారి విధ్వంసం సృష్టించిన సమయంలో.. భారత శాస్త్రవేత్తలు అమోఘమైన కృష్టితో మందు కనిపెట్టారు. కరోనా మందు కనిపెట్టి యావత్ దేశ ప్రజలకు టీకా ఇవ్వడంతో పాటు.. ప్రపంచ దేశాలకు సైతం ఎగుమతి చేసి ఔరా అనిపించుకుంది భారత్.

బ్యాంకింగ్ రంగంలో..

ఆర్థిక పరమైన అంశాల్లో భారత్ శరవేగంగా అభివృద్ధి సాధిస్తోంది. ప్రపంచంలో టాప్ 4 ఆర్థిక శక్తిగా ఇండియా నిలిచింది. దేశంలో బ్యాంకింగ్ వ్యవస్థ దినదినాభివృద్ధి చెందుతోంది. ముఖ్యంగా గడిచిన కాలంలో బ్యాంకింగ్ సెక్టార్‌లో సాంకేతిక అభివృద్ధి ఎక్కువగా ఉంది. ప్రపంచంలో ఏ దేశంలో లేని విధంగా డిజిటల్ పేమెంట్స్ మన దేశంలో జరుగుతున్నాయి.

1947 నుండి సాధించిన విజయాలు మన దేశ సామర్థ్యానికి నిదర్శనాలు. పైన పేర్కొన్నవే కాకుండా సాంకేతిక రంగంలో, పరిశ్రామికంగా, సేవల రంగంలో క్రీడా రంగంలో, సినిమా రంగంలో, అందాల పోటీల్లో, రవాణా వ్యవస్థలో, ఇలా చెప్పుకుంటూ పోతే చాలా అంశాల్లో భారతదేశం రికార్డులు బద్దలుకొడుతూ.. తన చరిత్రను తానే తిరగ రాస్తోంది.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..