Bharat Biotech CMD: తెలంగాణ సీఎస్ భారత్ బయోటెక్ సీఎండీ భేటీ.. రాష్ట్రానికి సరిపడా టీకాలు ఇస్తామన్న కృష్ణ ఎల్ల
తెలంగాణ ప్రభుత్వ విజ్ఞప్తి మేరకు రాష్ట్ర ప్రజలకు సరిపడా కోవిడ్ టీకాలు ఇస్తామని భారత్ బయోటెక్ సీఎండీ కృష్ణ ఎల్ల స్పష్టం చేశారు.
ts cs meets bharat biotech cmd: తెలంగాణ ప్రభుత్వ విజ్ఞప్తి మేరకు రాష్ట్ర ప్రజలకు సరిపడా కోవిడ్ టీకాలు ఇస్తామని భారత్ బయోటెక్ సీఎండీ కృష్ణ ఎల్ల స్పష్టం చేశారు. బీఆర్కే భవన్‌లో ప్రభుత్వ ప్రధాన కార్యదర్ధి సోమేశ్ కుమార్‌తో భారత్ బయోటెక్ సీఎండీ కృష్ణ ఎల్ల సమావేశం అయ్యారు. ఈ సమావేశంలో కొవాగ్జిన్ టీకాల సరఫరాపై చర్చించారు. ఈ సందర్భంగా సీఎస్ సోమేశ్ కుమార్ మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు భారత్ బయోటెక్ ఎండీతో భేటీ అయ్యానని తెలిపారు. అందరికీ ఉచితంగా టీకా ఇవ్వాలని సీఎం నిర్ణయించినట్లు తెలిపిన సీఎస్.. వీలైనన్నీ ఎక్కువ డోసులు రాష్ర్టానికి ఇవ్వాలని కృష్ణ ఎల్లకు సీఎస్ విజ్ఞప్తి చేశారు. ఇందుకు భారత్ బయోటెక్ ఎండీ సానుకూలంగా స్పందించినట్ల ఆయన తెలిపారు. రాష్ర్టానికి ఎక్కువ టీకాలు ఇస్తామని కృష్ణ ఎల్ల భరోసా ఇచ్చినట్లు వెల్లడించారు.
దేశంలో కరోనా వైరస్ మళ్లీ పంజా విసురుతున్న తరుణంలో భారత వైద్య మండలి కీలక సూచన చేసింది. 18 ఏళ్లు పైబడిన వారందరికీ కొవిడ్ వ్యాక్సిన్ వేయాలని కేంద్ర ప్రభుత్వానికి సూచించింది. వ్యాక్సిన్లు వైరస్ తీవ్రతను తగ్గించడంలో కీలక పాత్ర పోషిస్తాయని, హెర్డ్ ఇమ్యూనిటీకి దోహదం చేస్తాయని ఐఎంఏ పేర్కొంది. ప్రభుత్వ సిబ్బందితో పాటు ప్రైవేట్ సెక్టార్‌ను వ్యాక్సినేషన్ డ్రైవ్‌లో మరింత భాగస్వామ్యం చేయాలని సూచించింది.
ఈ నేపథ్యంలోనే మే 1 నుంచి రాష్ర్ట వ్యాప్తంగా 18 ఏండ్లు నిండిన ప్రతి ఒక్కరికీ కరోనా టీకా ఉచితంగా ఇస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించిన విషయం తెలిసిందే. ప్రజల ప్రాణాలను కాపాడేందుకు వ్యాక్సినేషన్ కోసం దాదాపు రూ. 2,500 కోట్లు ఖర్చు అవుతుందని అంచనా వేశారు. వ్యాక్సినేషన్ కోసం ఇప్పటికే అధికారులను ఆదేశించామని సీఎం తెలిపారు. ఇప్పటికే భారత్ బయోటెక్ వాక్సినేషన్ తయారీ చేస్తున్నదని, రెడ్డీ ల్యాబ్స్ తో సహా మరికొన్ని సంస్థలు వాక్సినేషన్ తయారీకి ముందుకు వచ్చాయని, రాష్ట్రంలో వాక్సినేషన్ విషయంలో ఎలాంటి ఇబ్బంది వుండబోదని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు.