Congress: భట్టి పాదయాత్ర ముగింపు సభకు రాహుల్‌తో పాటు ప్రియాంక కూడా..
తెలంగాణ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో రాజకీయం మరింతగా జోరందుకుంది. ఇప్పటి నుంచి ఆయా పార్టీల నేతలు పావులు కదుపుతున్నారు. ఎవరికి వారు ముందస్తుగానే అంచనాలు వేసుకుంటున్నారు. ఇక..

తెలంగాణ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో రాజకీయం మరింతగా జోరందుకుంది. ఇప్పటి నుంచి ఆయా పార్టీల నేతలు పావులు కదుపుతున్నారు. ఎవరికి వారు ముందస్తుగానే అంచనాలు వేసుకుంటున్నారు. ఇక ఇటీవల జరిగిన కర్ణాటక ఎన్నికలు ఆయా రాష్ట్రాల్లో మరింత ఊపునిస్తున్నాయి. అక్కడ అసెంబ్లీ ఎన్నికల విజయంతో కాంగ్రెస్ పార్టీ మరిన్ని రాష్ట్రాలపై ప్రత్యేక దృష్టి సారిస్తోంది. రానున్న ఎన్నికల్లో తెలంగాణలో సైతం పాలన పగ్గాలు చేపట్టాలని ప్రణాళికలు రచిస్తోంది. ఇప్పటి నుంచి తన శాయశక్తులా ప్రయత్నిస్తోంది కాంగ్రెస్. ఇక రాహుల్ గాంధీ చేపట్టిన ‘భారత్ జోడో యాత్ర’ కాంగ్రెస్ శ్రేణుల్లో ఉత్సవాహాన్ని నింపింది. ఈ యాత్ర కర్ణాటక ఎన్నికల్లో చాలా కలిసి వచ్చింది.
రాజకీయాల్లో పాదయాత్రలకు చాలా ప్రాధాన్యత:
ఇక దేశ రాజకీయాల్లో పాదయాత్ర అనేది కీలకంగా మారుతోంది. విజయం సాధించేందుకు ఈ పాదయాత్రలు కలిసి వస్తున్నాయి. గతంలో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి పాదయాత్రలు, వైఎస్ జగన్ పరామర్శలు, రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రలు సక్సెస్ అయ్యాయి. ఈ పాదయాత్ర ద్వారా కాంగ్రెస్ పార్టీ ప్రజలకు మరింతగా దగ్గరైందనే చెప్పాలి. ఈ నేపథ్యంలో దీనిని దృష్టిలో ఉంచుకుని రాహుల్ చేపట్టిన భారత్ జోడో యాత్రతో ఎంతో ప్రేరణ పొంది హాథ్ సే హాథ్ జోడోను తెలంగాణ కాంగ్రెస్ పార్టీ మొదలు పెట్టింది. ఇందులో భాగంగా సీఎల్పీ నేత, ఎమ్మెల్యే భట్టి విక్రమార్క పీపుల్స్ మార్చ్‌ను ప్రారంభించారు.
ప్రజలకు చేరువయ్యేందుకే ‘భట్టి’ యాత్ర
ప్రజలకు మరింతగా చేరువయ్యేందుకు భట్టి తలపెట్టిన ఈ పాదయాత్ర తనదైన శైలిలో ముందుకు వెళ్తున్నారు. రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజల సమస్యలను తెలుసుకుంటూ ముందుకు సాగుతున్నారు. ప్రజలతో ముఖా ముఖి మాట్లాడుతూ, సభలను నిర్వహిస్తూ మరింతగా చేరువవుతున్నారు. మార్చి 16న ఆదిలాబాద్‌లోని పిప్పిని గ్రామంలో ప్రారంభమైన ఈ పాదయాత్ర.. 25వ తేదీన సుమారు 101 రోజుల తర్వాత ఖమ్మంలో ముగియనుంది. ఈ పాదయాత్రలో ప్రజల సమస్యలు ఎన్నో తెలుసుకున్నారు. వారి సమస్యలను తీర్చే విధంగా భరోసానిస్తూ ముందుకు కదిలారు. ఈ పీపుల్స్ మార్చ్ ముగింపు సభ ఖమ్మంలో నిర్వహిస్తోంది టీ కాంగ్రెస్. ఈ సభలో రాహుల్ గాంధీ హాజరు కానున్నారని తెలుస్తోంది. అంతేకాకుండా ప్రియాంక గాంధీ కూడా వస్తున్నట్లు కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు.
పీపుల్స్ మార్చ్‌పై రాహుల్ గాంధీ ఆరా..
ఇక పీపుల్స్ మార్చ్ పాదయాత్ర కొనసాగుతున్న వేళ రాహుల్‌గాంధీ పాదయాత్ర గురించి ఆరా తీశారు. స్వయంగా ఫోన్‌లు చేసి వివరాలు తెలుసుకున్నారు. పాదయాత్ర సందర్భంగా ప్రజల స్పందన ఎలాం ఉందనేదానిపై రాహుల్ ఫోన్‌లో అడిగి తెలుసుకున్నట్లు తెలుస్తోంది. రాహుల్ గాంధే కాకుండా కర్ణాటక ఉప ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ కూడా ఈ యాత్ర గురించి తెలుసుకున్నారట.
డీకే శివకుమార్‌కు తెలంగాణ రాష్ట్ర అబ్జర్వర్‌గా బాధ్యతలు
ఇక తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలోడీకే శివకుమార్‌కు కాంగ్రెస్ అధిష్టానం తెలంగాణ రాష్ట్ర అబ్జర్వర్‌గా బాధ్యతలను అప్పగించనున్నట్లు సమాచారం. వచ్చే ఎన్నికల్లో ఎలాగైన తమ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలనే కుతుహాలంతో కాంగ్రెస్ పార్టీ అడుగులు వేస్తోంది. అందుకే తెలంగాణ రాష్ట్రపై కాంగ్రెస్ అధిష్టానం ఫోకస్ పెట్టింది. వచ్చేది తమ ప్రభుత్వమేనని బలంగా చెబుతోంది. మరి కాంగ్రెస్ వేస్తున్న ఎత్తుగడలు ఏ మేరకు ఫలిస్తాయో వేచి చూడాలి.



