Congress: ఓరుగల్లుపై కొండంత ఆశపెట్టుకున్న కాంగ్రెస్.. కాకతీయుల అడ్డా కలిసొస్తుందా?
అదేమో సెంటిమెంటు ప్లేసు... అక్కడ ఏది మొదలెట్టినా విజయమేనన్న ధీమా. అందుకే, తెలంగాణ కాంగ్రెస్.. అగ్రనేత రాహుల్ సభకు అదే జాగాను ఫైనల్ చేసింది. కాకపోతే, హస్తం నేతల అస్తవ్యవస్థమైన వైఖరి.. ఇప్పుడు టీపీసీసీకి తలనొప్పిగా మారిందట
Congress Warangal Public Meeting: అదేమో సెంటిమెంటు ప్లేసు… అక్కడ ఏది మొదలెట్టినా విజయమేనన్న ధీమా. అందుకే, తెలంగాణ కాంగ్రెస్.. అగ్రనేత రాహుల్ సభకు అదే జాగాను ఫైనల్ చేసింది. కాకపోతే, హస్తం నేతల అస్తవ్యవస్థమైన వైఖరి.. ఇప్పుడు టీపీసీసీకి తలనొప్పిగా మారిందట. ఏకంగా టీపీసీసీ ప్రెసిడెంట్ ముందే జిల్లానేతలు కుమ్ములాటకు దిగడం… రచ్చకు కారణమైంది. అయితే, ఇంతకుముందో లెక్క- ఇకపై మరో లెక్క అన్నట్టు… ఈ కొట్లాటలకు ఓ నాటు వైద్యం కనిపెట్టిందట పార్టీ నాయకత్వం? ఇంతకీ ఈ వైద్యం పనిచేస్తుందా? సెంటిమెంటు కలిసొస్తుందా?
వరంగల్ గడ్డపై రాజకీయంగా ఏ కార్యక్రమం మొదలెట్టినా విజయం తథ్యమనే సెంటిమెంట్ ఉంది. ఇప్పుడదే సెంటింటిమెంట్‌పై కొండంత ఆశపెట్టుకుంది కాంగ్రెస్ పార్టీ నాయకత్వం. అందుకే, అగ్రనేత రాహుల్ గాంధీ పాల్గొనే భారీ బహిరంగ సభను ఇక్కడ ప్లాన్ చేసింది. ఈ సభకు జనసమీకరణ కోసం.. పెద్ద కసరత్తే చేస్తోంది. ఒక రకంగా చెప్పాలంటే, ఈ సభ సక్సెస్ అయితే.. 2023లో తెలంగాణలో అధికారంలోకి రావడం ఖాయమనే ధీమాతో ఉంది కాంగ్రెస్.
ఈ ఓరుగల్లు సెంటిమెంట్ కథ బాగానే ఉంది, కానీ, కాంగ్రెస్‌లో క్రమశిక్షణారాహిత్యమే… ఆ పార్టీ నాయకత్వానికి తలనొప్పిగా మారింది. నేతల మధ్య ఆధిపత్యపోరు క్యాడర్ ను పరేషాన్ చేస్తోంది. ఒకరు ఇంచార్జ్ గా బాధ్యతలు నిర్వహిస్తున్న జిల్లాలో మరోనేత పెత్తనం చెలాయించడం గందరగోళంగా మారింది. జనగామ జిల్లా అధ్యక్షుడు జంగా రాఘవరెడ్డి వ్యవహారం, కాంగ్రెస్ లో హాట్ టాపిక్ గా మారింది.. పాలకుర్తి నియోజకవర్గానికి ఇంచార్జ్ గా ఉన్న రాఘవరెడ్డి… జనగామ లో పాగవేసేందుకు ప్రయత్నాలు చేయడం.. రాజకీయ దుమారానికి కారణమైంది. ఈ అంశానికి సంబంధించి పీసీసీ మాజీ చీఫ్ పొన్నాల లక్ష్మయ్య, రాఘవరెడ్డి మధ్య మాటల యుద్దమే నడిచింది.
సీన్ కట్ చేస్తే.. ఇప్పుడు జంగా కన్ను హన్మకొండపై పడింది. అక్కడ పోటీకి అన్ని ఏర్పాట్లు చేసుకుంటూ.. తనవర్గంతో అండర్ గ్రౌండ్ ఆపరేషన్ నడిపారు. ఇంకేముంది, ఇన్నాళ్లూ హన్మకొండ సీటుపై ఆశలు పెట్టుకున్న జిల్లా కాంగ్రెస్ అద్యక్షుడు నాయిని రాజేందర్ రెడ్డి భగ్గుమన్నారు. జంగా రాఘవరెడ్డి.. టీఆర్‌ఎస్‌కు కోవర్టుగా మారారంటూ.. బహిరంగఆరోపణలు చేశారు. పీసీసీకి ఫిర్యాదు కూడా చేశారు. దీంతో ఇద్దరు డీసీసీల మధ్య వార్ ముదిరింది.
నర్సంపేటలోనూ సేమ్ సీన్ కనిపిస్తోంది. దొంతి మాధవరెడ్డి తీరుతో అసంతృప్తిగా ఉన్న క్యాడర్… కత్తి వెంకటస్వామి వైపు టర్నయ్యారు. దీంతో, ఇద్దరు నేతల మధ్య విభేదాలు భగ్గుమన్నాయి. ఇద్దరిలో ఎవరికి సపోర్టివ్వాలో తెలియక.. లోకల్ కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు.. అడ్డ కత్తెర్లో పోకచెక్కలా నలిగిపోతున్నారు. స్టేషన్ ఘనపూర్‌లోనూ నేతల తీరు.. ఇందుకు భిన్నంగా ఏం లేదు. ఎవరికివారే, నియోజకవర్గ ఇంచార్జులమంటూ… కార్యకర్తలను కన్ఫ్యూజ్ చేస్తున్నారు నేతలు. మహబూబాబాద్, పరకాల నియోజకవర్గాల్లోనూ నేతలది అదేతీరు. పరకాలలో కొండా సురేఖ వర్సెస్ వెంకట్రామిరెడ్డి మధ్య ఆధిపత్య పోరు… రచ్చకు కారణమవుతోంది.
మే6న రాహుల్ గాంధీ సభకు సన్నాహాలు జరుగుతున్న వేళ… జిల్లా పార్టీనేతలు గల్లాటు పట్టుకోవడం.. కాంగ్రెస్‌ను కలవరపెడుతోంది. ఇటీవల ఏకంగా పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ముందే నేతలు గొడవపడటం దుమారం రేపింది. దీంతో, క్రమశిక్షణ ఉల్లంఘిస్తే వేటు తప్పదని ఘాటుగా హెచ్చరించారట పీసీసీ. ఎవరి జిల్లాల్లో వారు, పార్టీ కార్యక్రమాలు నిర్వహించు కోవాలనీ… పొరుగు జిల్లాలకు వచ్చి కవ్వింపు చర్యలకు దిగొద్దని స్పష్టం చేశారట. లేదంటే, నాటు వైద్యం తప్పదని మందలించారట రేవంత్.
మరోవైపు ఎమ్మెల్యేక్వార్టర్స్‌లో పార్టీ ఇంఛార్జ్ మాణిక్యం ఠాగూర్‌తో డిన్నర్ మీట్ అయ్యారు. రేవంత్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, సీఎల్పీ నేతల భట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్‌రెడ్డి, మధు యాష్కి శ్రీధర్‌బాబులతో పలువురు కీలక నేతలు పాల్గొన్నారు. రాహుల్‌సభ ఏర్పాట్లపై చర్చించారు. అంతే కాకుండా ఉస్మానియాలో రాహుల్ పర్యటనకు అనుమతి ఇవ్వకపోతే ఏం చేయాలనే దానిపై ఫోకస్ పెట్టారు తెలంగాణ కాంగ్రెస్ నేతలు.
అటు రాహుల్ సభను గ్రాండ్ సక్సెస్ చేసి.. ప్రత్యర్థులకు మైండ్ బ్లాంక్ చేయాలని పార్టీ నేతలకు సూచించారట రేవంత్. హన్మకొండ జిల్లాపార్టీ అధ్యక్షుడు నాయిని రాజేందర్ రెడ్డికే.. సభ నిర్వహణ,ఏర్పాట్ల బాధ్యతలు తాత్కాలికంగా అప్పగించారు. సభాసమయానికి ఇంచార్జ్‌లను నియమించి… సభను సక్సెస్ చేసి రాహుల్‌తో శభాష్ అనిపించుకోవాలని టీపీసీసీ చెప్పారట. ఒకవేళ ఆధిపత్య ధోరణితో ఇలాగే గల్లాలు ఎగిరిస్తే కఠిన చర్యలు తప్పవని స్ట్రాంగ్ వార్నింగే ఇచ్చారంట. దెబ్బకు నేతలంతా కామైపోయి.. ఎవరి ఇలాఖాలో వాళ్లు పనిచేసుకుంటున్నట్టే కనిపిస్తోంది. మరి, అగ్రనేత వచ్చేదాకా.. ఇలాగే ఉంటారా? మళ్లీ రచ్చ చేస్తారా? అనేది చూడాలి.
Read Also… Modi vs KCR: ప్రధాని మోదీ వర్సెస్ సీఎం కేసీఆర్.. ఇద్దరి మధ్య గ్యాప్ పెరుగుతుందా..? పెంచుతున్నారా?