AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

TELANGANA CONGRESS: మాటలో వైపు.. చేతలో వైపు.. తెలంగాణ కాంగ్రెస్ నేతల రూటే సెపరేటు.. ఎన్నికలకు ముందు సయోధ్య సాధ్యమేనా?

రేవంత్ రెడ్డిని టీపీసీసీ ప్రెసిడెంటుగా చేస్తారన్న ప్రచారం మొదలైందో అప్పట్నించి తెలంగాణ కాంగ్రెస్‌లో మరోసారి గ్రూపు రాజకీయాలు మొదలయ్యాయి. ఈ గ్రూపు విభేదాలు ఎప్పటికప్పుడు సమసిపోయినట్లు కనిపించినా.. మళ్ళీ ఏదో ఓ రూపంలో పురుడు పోసుకుంటున్నాయి. ప్రస్తుతం పరిస్థితి కూడా అలాగే వుంది.

TELANGANA CONGRESS: మాటలో వైపు.. చేతలో వైపు.. తెలంగాణ కాంగ్రెస్ నేతల రూటే సెపరేటు.. ఎన్నికలకు ముందు సయోధ్య సాధ్యమేనా?
Revanth Reddy, Komatireddy, Venkat Reddy
Rajesh Sharma
| Edited By: |

Updated on: Apr 29, 2022 | 9:10 PM

Share

TELANGANA CONGRESS LEADERS SPLIT ONCE AGAIN TPCC EFFORTS FUTILE: కాంగ్రెస్ పార్టీ అంటేనే ఎవరికి వారే యమునా తీరే అన్నట్లు కనిపిస్తుంది. ఐక్యంగా వున్నామంటూనే ఎవరికి తోచిన మార్గంలో వారు పయనిస్తుంటారు. మొదట్నించి అలాగే వున్నా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌(Andhra Pradesh)లో వైఎస్ రాజశేఖర్ రెడ్డి(Ys Rajasekhar Reddy) హయాంలో పార్టీలో మార్పు వచ్చింది ఒక్క తాటిపై వున్నట్లు కనిపించింది. ఒకరిద్దరికి వైఎస్ఆర్ అంటే ఇష్టం లేకపోయినా పైకి పెద్దగా అసమ్మతి, అసంతృప్తిని వ్యక్తం చేయకుండా వుండిపోయారు. 2009లో ఆయన మరణం తర్వాత రాష్ట్ర వ్యవహరాలను జాతీయ నాయకత్వమే ఆల్ మోస్ట్ శాసించిన పరిస్థితి. ఇక 2014లో తెలంగాణ రాష్ట్రం సెపరేటయ్యాక ఎక్కువ కాలం టీపీసీసీ ప్రెసిడెంటుగా ఉత్తమ్ కుమార్ రెడ్డి(Uttam Kumar Reddy)నే వ్యవహరించారు. ఆయన హయాంలో వర్కింగ్ ప్రెసిడెంట్లను కొత్తగా నియమించారు. ఇలా నేతలను ఏదోరకంగా యాక్టివ్‌గా వుంచేందుకు, అసమ్మతి రాగాలు వినిపించకుండా వుండేందుకు అధిష్టానం చర్యలు తీసుకుంది. ఎప్పుడైతే పార్టీలో కొత్తగా చేరిన రేవంత్ రెడ్డి(Revanth Reddy)ని టీపీసీసీ ప్రెసిడెంటు(TPCC President)గా చేస్తారన్న ప్రచారం మొదలైందో అప్పట్నించి తెలంగాణ కాంగ్రెస్‌లో మరోసారి గ్రూపు రాజకీయాలు మొదలయ్యాయి. ఈ గ్రూపు విభేదాలు ఎప్పటికప్పుడు సమసిపోయినట్లు కనిపించినా.. మళ్ళీ ఏదో ఓ రూపంలో పురుడు పోసుకుంటున్నాయి. ప్రస్తుతం పరిస్థితి కూడా అలాగే వుంది. పార్టీ శ్రేణుల్లో కొత్త ఉత్సాహం నింపేందుకు తమకు బాగా అచ్చొచ్చిన వరంగల్(Warangal) నుంచే వచ్చే ఎన్నికలకు సమర శంఖారావం పూరించేందుకు తెలంగాణ కాంగ్రెస్ నేతలు సిద్దమైన తరుణంలోనే పార్టీలో లుకలుకలు మళ్ళీ తెరమీదికి వచ్చాయి. ఈ పరిస్థితి రాష్ట్ర స్థాయిలో కనిపిస్తోంది. అదేసమయంలో ఉమ్మడి వరంగల్ జిల్లా నేతల్లోను కనిపిస్తోంది.

ఓరుగల్లు గడ్డ కాంగ్రెస్‌ అడ్డ అని కాంగ్రెస్ నేతలు ఒకప్పుడు గట్టిగా చెప్పుకునే వారు. ఏ ఎన్నికలు జరిగినా మూడు రంగుల జెండా రెపరెపలాడిందక్కడ. అయితే, తెలంగాణ రాష్ట్రం ఏర్పాటయ్యాక పరిస్థితి మారిపోయింది. రాజకీయ సమీకరణాలు పూర్తిగా మారిపోయాయి. ఇప్పుడు ఓరుగల్లు గడ్డ గులాబీ అడ్డాగా మారింది. అయితే వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో అన్ని నియోజకవర్గాల్లో తిరిగి హస్తం జెండా ఎగిరేసి పూర్వ వైభవం తీసుకురావాలని రాష్ట్ర నాయకత్వం తలపెట్టింది. అందుకోసం పార్టీ అధినేత రాహుల్ గాంధీ హాజరయ్యేలా వరంగల్ వేదికగా భారీ బహిరంగ సభను ప్లాన్ చేసింది. మొదటి నుంచి తమకు సెంటిమెంటు ప్లేసుగా భావిస్తున్న వరంగల్‌ నుంచి ఏ కార్యం తలపెట్టినా విజయమేనన్న ధీమా టీ.కాంగ్రెస్ నేతల్లో వుంది. అగ్రనేత రాహుల్‌ సభకు అదే సిటీని ఎంపిక చేసుకుంది. అధినేత వస్తున్నాడంటేనే పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం రావాలి. కానీ ఉమ్మడి వరంగల్ జిల్లా కాంగ్రెస్ నేతల్లో పరిస్థితి గందరగోళంగా వుంది. హస్తం నేతల అస్తవ్యవస్థమైన వైఖరి ఇప్పుడు టీపీసీసీకి తలనొప్పిగా మారిందట. ఏకంగా టీపీసీసీ ప్రెసిడెంట్ ముందే జిల్లానేతలు కుమ్ములాటకు దిగడం రచ్చకు కారణమైంది. వరంగల్ సభకు జనసమీకరణ కోసం టీపీసీసీ పెద్ద కసరత్తే చేస్తోంది. ఒక రకంగా చెప్పాలంటే.. ఈ సభ సక్సెస్ అయితే.. 2023లో తెలంగాణలో అధికారంలోకి రావడం ఖాయమనే ధీమాతో ఉంది టీ.కాంగ్రెస్‌. ఓరుగల్లు సెంటిమెంట్‌ కథ బాగానే ఉంది కానీ పార్టీ నేతల మధ్య సయోధ్య లేకపోవడం టీపీసీసీకి నెత్తినొప్పి తెప్పిస్తోందని గాంధీభవన్ వర్గాలంటున్నాయి. నేతల మధ్య ఆధిపత్యపోరు క్యాడర్‌ను కూడా పరేషాన్ చేస్తోంది. ఒకరు ఇంచార్జ్ గా బాధ్యతలు నిర్వహిస్తున్న జిల్లాలో మరోనేత పెత్తనం చెలాయించడం గందరగోళంగా మారింది. జనగామ జిల్లా అధ్యక్షుడు జంగా రాఘవరెడ్డి వ్యవహారం కాంగ్రెస్ పార్టీలో హాట్ టాపిక్ గా మారింది. పాలకుర్తి నియోజకవర్గానికి ఇంచార్జ్ గా ఉన్న రాఘవరెడ్డి జనగామలో పాగవేసేందుకు ప్రయత్నాలు చేయడం.. రాజకీయ దుమారానికి కారణమైంది. ఈ అంశానికి సంబంధించి పీసీసీ మాజీ చీఫ్ పొన్నాల లక్ష్మయ్య, రాఘవరెడ్డి మధ్య మాటల యుద్దమే నడిచింది. సీన్‌ కట్‌ చేస్తే.. ఇప్పుడు జంగా కన్ను హన్మకొండపై పడింది. అక్కడ పోటీకి అన్ని ఏర్పాట్లు చేసుకుంటూ.. తన వర్గంతో అండర్ గ్రౌండ్ ఆపరేషన్ నడిపిస్తున్నారు జంగా రాఘవరెడ్డి. ఇన్నాళ్ళు హన్మకొండ సీటుపై ఆశలు పెట్టుకున్న జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు నాయిని రాజేందర్ రెడ్డికి జంగా చర్యలు ఆగ్రహం తెప్పిస్తున్నాయి. జంగా రాఘవరెడ్డి.. టీఆర్‌ఎస్‌ పార్టీకి కోవర్టుగా మారారంటూ నాయిని బహిరంగంగానే ఆరోపణలు చేశారు. టీపీసీసీకి ఫిర్యాదు కూడా చేశారు. దీంతో ఇద్దరు డీసీసీ అధ్యక్షుల మధ్య వార్‌ ముదిరి పాకాన పడింది.

అటు నర్సంపేటలోనూ సేమ్ సీన్ కనిపిస్తోంది. దొంతి మాధవరెడ్డి తీరుతో అసంతృప్తిగా ఉన్న క్యాడర్‌ కత్తి వెంకటస్వామి వైపు టర్నయ్యారు. దీంతో ఇద్దరు నేతల మధ్య విభేదాలు భగ్గుమన్నాయి. ఇద్దరిలో ఎవరికి సపోర్టివ్వాలో తెలియక లోకల్‌ కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు అడ్డ కత్తెరలో పోకచెక్కలా నలిగిపోతున్నారు. స్టేషన్ ఘనపూర్‌లోనూ నేతల తీరు ఇందుకు భిన్నంగా ఏం లేదు. ఎవరికివారే నియోజకవర్గ ఇంఛార్జీలమంటూ కార్యకర్తలను కన్ఫ్యూజ్‌ చేస్తున్నారు. మహబూబాబాద్, పరకాల నియోజకవర్గాల్లోనూ నేతలది అదేతీరు. పరకాలలో కొండా సురేఖ, వెంకట్రామిరెడ్డి మధ్య ఆధిపత్య పోరు కొనసాగుతూ రచ్చకు దారితీస్తోంది. మే 6వ తేదీన రాహుల్ గాంధీ సభకు సన్నాహాలు జరుగుతున్న వేళ జిల్లా పార్టీ నేతలు గల్లాలు పట్టుకోవడం.. కాంగ్రెస్‌ రాష్ట్ర నాయకత్వాన్ని కలవరపెడుతోంది. ఇటీవల ఏకంగా పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ముందే నేతలు గొడవ పడటం దుమారం రేపింది. దీంతో క్రమశిక్షణ ఉల్లంఘిస్తే వేటు తప్పదని ఘాటుగా హెచ్చరించారు రేవంత్ రెడ్డి. ఎవరి జిల్లాల్లో వారు పార్టీ కార్యక్రమాలు నిర్వహించుకోవాలని, పొరుగు జిల్లాలకు వచ్చి కవ్వింపు చర్యలకు దిగొద్దని రేవంత్ రెడ్డి వార్నింగ్ ఇచ్చినట్లు సమాచారం.రాహుల్‌ సభను గ్రాండ్‌ సక్సెస్‌ చేసి ప్రత్యర్థులకు మైండ్ బ్లాంక్‌ చేయాలని రేవంత్‌ భావిస్తుంటే.. పార్టీ నాయకులు, శ్రేణులు ఇలా వర్గాలుగా విడిపోవడంతో ఆయనకు ఏమీ పాలుపోవడం లేదని చెప్పుకుంటున్నారు. హన్మకొండ జిల్లా అధ్యక్షుడు నాయిని రాజేందర్ రెడ్డికి ఓరుగల్లు సభ నిర్వహణ, ఏర్పాట్ల బాధ్యతలు తాత్కాలికంగా అప్పగించారు. సభాసమయానికి ఇంచార్జ్‌లను నియమించి సభను సక్సెస్ చేసి రాహుల్‌తో శభాష్‌ అనిపించుకోవాలని నాయినికి రేవంత్ రెడ్డి సూచించినట్లు తెలుస్తోంది. ఒకవేళ ఆధిపత్య ధోరణితో ఇలాగే గల్లాలు ఎగిరేస్తే కఠిన చర్యలు తప్పవని స్ట్రాంగ్‌ వార్నింగే ఇచ్చారట టీపీసీసీ చీఫ్‌. దెబ్బకు నేతలంతా సైలెంటయినట్లు తెలుస్తుండగా ఈ సైలెన్స్ ఎంతకాలమో అన్న చర్చలు మొదలయ్యాయి.

మరోవైపు నాగార్జున సాగర్‌లో టీపిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి నిర్వహించిన సన్నాహక సమావేశంతో నల్లగొండ జిల్లా కాంగ్రెస్‌లోని నేతల మధ్య పట్టుదలలు మరోసారి బయట పడ్డాయి. సమావేశానికి ఉమ్మడి నల్గొండ జిల్లా కాంగ్రెస్ సీనియర్ నాయకులంతా హాజరు కాగా రేవంత్ నల్గొండ జిల్లా పర్యటనపై మొదటి నుంచి అభ్యంతరం వ్యక్తం చేస్తున్న కోమటిరెడ్డి బ్రదర్స్ గైర్హాజరు కావడం పార్టీలో కొత్త చర్చకు దారి తీసింది. సన్నాహక సమావేశానికి ఉమ్మడి జిల్లాలోని డీసీసీ అధ్యక్షులు శంకర్ నాయక్, చెవిటి వెంకన్న, కుంభం అనిల్, జిల్లాలు, మండలాల కాంగ్రెస్ నాయకులు హాజరయ్యారు. అయితే మొదటి నుంచి రేవంత్ రెడ్డిపై అసంతృప్తితో ఉన్న కోమటిరెడ్డి వెంకటరెడ్డి నల్గొండ జిల్లా నుంచి సమావేశానికి రాలేదు. జిల్లాకు తొలిసారి టీపీసీసీ అధ్యక్షుడి హోదాలో వచ్చిన రేవంత్ రెడ్డికి కోమటిరెడ్డి బ్రదర్స్ స్వాగతం పలకకపోవడంపై రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇంచార్జి మాణికం ఠాగూర్ సీరియస్ అయినట్లు తెలుస్తోంది.కోమటిరెడ్డి వెంకటరెడ్డి గైర్హాజరుతో కాంగ్రెస్ పార్టీలోని వర్గ విభేదాలపై మళ్ళీ చర్చ మొదలయ్యాయి. గ్రూపు రాజకీయాలకు పెట్టింది పేరు కాంగ్రెస్ పార్టీ. రాష్ట్ర కాంగ్రెస్‌లో ఉద్దండులుగా ఉన్న నేతలంతా ఉమ్మడి నల్గొండ జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. హేమా హేమీలైన ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి బ్రదర్స్, జానారెడ్డి, మాజీ మంత్రి దామోదర్ రెడ్డి ఎవరికి వారే వర్గాలుగా విడిపోయి ఉన్నారు. టీపిసిసి అధ్యక్షుడిగా రేవంత్‌ రెడ్డి బాధ్యతలు చేపట్టి ఏడాది గడిచిన తర్వాత అధికారికంగా సంయుక్త సన్నాహక సమావేశానికి వచ్చారు. వరంగల్‌లో జరిగే రాహుల్‌ సభ పేరిట వచ్చేందుకు రేవంత్ ప్రణాళిక సిద్ధం చేసుకోగా అది కాస్తా వివాదాస్పదంగా మారింది. జన సమీకరణ బాధ్యతను తామే చూసుకుంటామని గీతారెడ్డి, రేవంత్‌ రెడ్డి తమ జిల్లాకు రావాల్సిన అవసరం లేదంటూ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి బహిరంగంగా కామెంట్ చేశారు. దీంతో ముందుగా నిర్ణయించిన ఏప్రిల్ 27 భేటీని వాయిదా వేయాల్సి వచ్చింది. తిరిగి ఏప్రిల్ 29న సీనియర్ నేత జానారెడ్డి సమన్వయంతో నాగార్జునసాగర్ లో జరిగిన సన్నాహక సమావేశానికి కోమటిరెడ్డి బ్రదర్స్ మినహా సీనియర్ నేతలు అంతా హాజరయ్యారు. అయితే ఇటీవల ఎన్నికల ప్రచార సారథిగా నియమితులైన కోమటిరెడ్డి వెంకట రెడ్డి ఈ కీలక సమావేశానికి రాకపోవడం చర్చనీయాంశమైంది. సన్నాహక సమావేశానికి రాకపోవడంతో పాటు నల్లగొండ జిల్లాకు రేవంత్ రెడ్డి పర్యటన అవసరం లేదంటూ కోమటిరెడ్డి వ్యాఖ్యానించడం సరికాదని రాష్ట్ర కాంగ్రెస్ నేతలు అంటున్నారు. ఈ నేపథ్యంలోనే ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిపై కొందరు నేతలు మాణిక్కం ఠాగూర్‌కు ఫిర్యాదు కూడా చేశారు. కోమటిరెడ్డి బదర్స్ గైర్హాజరిలో జరిగిన సన్నాహక సమావేశంలో కీలక నేతలంతా వరంగల్ బహిరంగ సభను భారీ ఎత్తున నిర్వహించాలని తీర్మానించారు. మరి గ్రూపు విభేదాల మధ్య రాహుల్ సభ ఎలా జరుగుతందన్నది ఆసక్తిరేపుతోంది.