Jagga Reddy: రాజకీయాల నుంచి సినిమాల్లోకి జగ్గారెడ్డి.. ప్రేమకథలో ఆయన పాత్రేంటో తెలుసా?
నిద్ర లేచింది మొదలు రాత్రి పడుకునేవరకు.. అనునిత్యం రాజకీయాల్లో మునిగితేలే జగ్గారెడ్డి అకస్మాత్తుగా సినిమా ప్రంపంచంలోకి ఎందుకు అడుగు పెట్టాలనుకున్నారు? రాజకీయాలు విసుగుపుట్టి ఆ నిర్ణయం తీసుకున్నారా? లేక సినిమాలపై ఆసక్తి కలిగి అడుగుపెడుతున్నారా? దేశ రాజధాని హస్తిన వేదికగా ఆయన ఈ ప్రకటన చేయడం వెనుక మతలబేంటి?

అసలు పేరు ‘తూర్పు జయప్రకాశ్ రెడ్డి’ కంటే ‘జగ్గారెడ్డి’గా జనానికి సుపరిచితుడైన నేత ఆయన. తెలంగాణ రాజకీయాల్లో సంచలనాలకు కేరాఫ్ అడ్రస్. ఇప్పుడు సరికొత్త సంచలనానికి ఆయన శ్రీకారం చుట్టారు. రాజకీయాలకు స్వల్ప విరామం ప్రకటించి సినిమా రంగంలోకి అడుగుపెడుతున్నారు. సినిమా అంటే నిర్మాతగానో.. దర్శకుడిగానో అనుకునేరు. కాదు.. ఆయన నటనలోకి అడుగుపెట్టి.. తన నిజజీవిత పాత్రను తానే పోషించబోతున్నారు. కేవలం తెలుగులోనే కాదు.. హిందీలోనూ ఆ సినిమాను విడుదల చేసి ‘పాన్ ఇండియా’ స్థాయిలో తన ప్రతిభ చాటేందుకు సిద్ధమయ్యారు.
నో కెమేరా.. నో మైక్.. ————– ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా ‘జెట్టి కుసుమ కుమార్’ పేరును ప్రతిపాదిస్తూ.. ఇదే విషయంపై ఏఐసీసీ అగ్రనాయకత్వంలో మంతనాలు జరిపేందుకు ఢిల్లీ పర్యటన చేపట్టిన తెలంగాణ పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి.. సోమవారం ఓ సంచలన ప్రకటన చేశారు. ఎమ్మెల్సీ అభ్యర్థుల జాబితాను చూసి ఖంగు తిన్న ఆయనకు రాజకీయాలపై విసుగు పుట్టింది. కొన్నాళ్లు నోరు విప్పకుండా.. మౌనంగా ఉండాలని నిర్ణయించుకున్నారు. రాజకీయాల్లో గొంతు విప్పకపోయినా.. తన గొంతును మరోలా వినిపించేందుకు వ్యూహాత్మకంగా పావులు కదిపారు. నేరుగా కెమేరాల ముందు మాట్లాడి.. అధిష్టానం దృష్టిలో ధిక్కారస్వరాన్ని వినిపించిన నేతగా చెడ్డపేరు తెచ్చుకునే కంటే.. తన అసంతృప్తి, అసమ్మతిని పిచ్చాపాటి సంభాషణలు (చిట్ చాట్) రూపంలో బహిర్గతం చేశారు. దీనికి ఎలాంటి ఆధారం ఉండదు. తానంటే గిట్టనివారు ఆ వీడియోలు తీసుకెళ్లి అధిష్టానం పెద్దలకు చూపించి పితూరీలు, ఫిర్యాదులు చేసే అవకాశం కూడా ఉండదు. కానీ తాను చెప్పదల్చుకున్న సమాచారం సమాజంలో చేరాల్సిన అందరికీ చేరుతుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మాజీ సీఎం కేసీఆర్ సహా పలువురు రాజకీయ నేతలు ఈ మధ్యకాలంలో ఈ విధానాన్ని అనుసరిస్తూ తాము చెప్పదల్చుకున్న సమాచారాన్ని కెమేరాలు, మైకులు లేకుండానే జనంలోకి చేర్చుతున్నారు. జగ్గారెడ్డి కూడా అదే బాటలో పయనిస్తూ.. సంచలన విషయాలు వెల్లడించారు.
తెలుగునాట రాజకీయాలు, సినిమా, మీడియా రంగాలతో పాటు పారిశ్రామిక రంగంలో బలంగా ఉన్న ‘కమ్మ’ సామాజికవర్గానికి, కాంగ్రెస్ పార్టీకి మధ్య ఆ సామాజికవర్గానికి చెందిన నేత జెట్టి కుసుమ కుమార్ అనుసంధానకర్తగా ఉన్నారని జగ్గారెడ్డి తెలిపారు. దశాబ్దాలుగా కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేస్తున్న ఆయనకు ఎమ్మెల్సీగా అవకాశం ఇవ్వాలని రాష్ట్ర నాయకత్వంలో పీసీసీ చీఫ్ మహేశ్ గౌడ్, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి సూచించిన జగ్గారెడ్డి.. ఇదే విషయంపై అధిష్టానం పెద్దలకు చెప్పేందుకు ఢిల్లీ బాట పట్టారు. ఢిల్లీలో ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపిక కసరత్తులో భాగంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, కేసీ వేణుగోపాల్, మీనాక్షి నటరాజన్ వంటి కీలక నేతల సమావేశం జరగాల్సినప్పటికీ.. అనివార్య కారణాలతో అది జరగలేదు. ఈ సమావేశం జరిగితే.. అక్కడే తన గొంతు బలంగా వినిపించి కుసుమ కుమార్‌కు ఎమ్మెల్సీ అవకాశం ఇవ్వాల్సిందిగా ఒత్తిడి చేద్దామనుకున్నారు. కానీ ఏ సమావేశం జరపకుండా ఫోన్ సంప్రదింపులు జరిపిన అధిష్టానం.. ఎమ్మెల్సీ అభ్యర్థుల జాబితా ప్రకటించింది. ఆ జాబితా చూసి తాను ఖంగు తిన్నానని జగ్గారెడ్డి స్వయంగా ఢిల్లీ తెలుగు మీడియాకు చెప్పారు. పిచ్చాపాటిగా మాట్లాడిన ఆయన “నా నిర్ణయాన్ని గౌరవించలేదని భావించడం లేదు. ఏ నేతపైనా నేను వ్యాఖ్యలు చేయదలుచుకోలేదు. కానీ అభ్యర్థుల ఎంపిక చూసి ‘మైండ్ బ్లాంక్’ అయింది. రాజకీయంగా ‘షాక్’లో ఉన్నాను” అని వ్యాఖ్యానించారు. అయితే తాను గెలుపోటములను స్వీకరిస్తానని, అందుకే ఎప్పుడూ సంతోషంగా ఉంటానని చెప్పారు. తాను సింపథీ (సానుభూతి) కోరుకునే రకం కాదని, తాను పోరాడే రకం అని అన్నారు. తనపై ఎవరైనా సానుభూతి చూపడాన్ని కూడా ఇష్టపడనని చెప్పారు. తనను రాజకీయాల్లో ఎవరూ తొక్కలేరని ఆయన వ్యాఖ్యానించారు.
తన పాత్రలో తానే నటిస్తూ… —————- రాజకీయాల్లో రాజీలేని పోరాటం (ఫైట్) చేస్తానని చెబుతున్న జగ్గారెడ్డి.. ఢిల్లీ మీడియాతో జరిపిన చిట్‌చాట్‌లో సినీ రంగ ప్రవేశం గురించి ప్రకటించి అందరినీ ఆశ్చర్యపరిచారు. తన పేరుతోనే “జగ్గారెడ్డి – ఎ వార్ ఆఫ్ లవ్” టైటిల్‌తో సినిమా తీస్తున్నట్టు ఆయన ప్రకటించారు. అదొక ప్రేమ కథ చిత్రమని, అందులో ప్రత్యేక పాత్ర పోషించబోతున్నానని వెల్లడించారు. మాఫియాను ఎదురించి ఆడపిల్ల పెళ్ళి చేసే వ్యక్తిగా తాను సినిమాలో కనిపిస్తానని అన్నారు. ఈ మధ్య వద్ది రామానుజం (సినిమాకు కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం వహిస్తున్న వ్యక్తి) తన దగ్గరకు వచ్చి ఒక కథ ఉంది అని చెప్పారు. ఆ కథలో తన నిజజీవిత పాత్రే ఉందని చెప్పగా.. తానే ఆ పాత్రలో నటిస్తానని చెప్పానని జగ్గారెడ్డి అన్నారు. ఈ ఉగాదికి కథ విని.. వచ్చే ఉగాది నాటికి సినిమా పూర్తి చేస్తామని అన్నారు. రాష్ట్ర నాయకత్వంతో పాటు ముఖ్యమంత్రి అనుమతి తీసుకుని ఈ సినిమాలో నటిస్తానని జగ్గారెడ్డి వెల్లడించారు. తెలుగు, హిందీ భాషల్లో సినిమా నిర్మాణం పూర్తి చేసి దేశవ్యాప్తంగా విడుదల చేయనున్నట్టు తెలిపారు.

Film Of Jagga Reddy