Video: అమృత ప్రణయ్ కేసు తీర్పు! కోర్టు వద్ద ఉద్రిక్తత.. శ్రవణ్ కుటుంబ సభ్యుల ఆందోళన
2018లో సంభవించిన ప్రణయ్ పరువు హత్య కేసులో నల్గొండ కోర్టు తీర్పు వెలువరించింది. ఒక నిందితుడికి ఉరిశిక్ష, మిగిలిన ఆరుగురికి జీవిత ఖైదు విధించబడింది. ప్రణయ్ తల్లిదండ్రులు సంతోషం వ్యక్తం చేయగా, శిక్ష పొందిన వారి కుటుంబాలు ఆవేదన వ్యక్తం చేశారు. కోర్టు ఆవరణలో ఉద్రిక్తతలు చోటుచేసుకున్నాయి. ఈ తీర్పుతో పరువు హత్యలకు అడ్డుకట్ట పడాలని ఆశిస్తున్నారు.

2018లో సంచలనం సృష్టించిన ప్రణయ్ పరువు హత్య కేసులో ఈ రోజు నల్గొండ కోర్టు తీర్పు ఇచ్చిన విషయం తెలిసిందే. ఏ2కు ఉరిశిక్ష, మిగిలిన ఆరుగురికి యావజ్జీవ కారాగార శిక్ష విధించింది కోర్టు. ఈ క్రమంలో కోర్టు ఆవరణలో అమృత బాబాయ్ శ్రవణ్ కుటుంబ సభ్యుల ఆందోళనకు దిగారు. ప్రణయ్ హత్య కేసులో అమృత బాబాయ్ అయిన శ్రవణ్‌కు జీవిత ఖైదు విధించారు. ఈ కేసులో ఆయన A6 గా ఉన్నారు. అయితే అమృత వల్లనే ఇదంతా జరిగిందని శ్రవణ్ కుటుంబ సభ్యుల ఆరోపించారు. మా నాన్న ఏం తప్పు చేయలేదని, పోలీసులు తెల్లకాగితం సంతకం చేయించుకొని తప్పు ఒప్పుకున్నట్లు కేసు నమోదు చేశారని, అన్యాయంగా మా నాన్న శిక్ష విధించారంటూ శ్రవణ్ కూతురు కోర్టు ఆవరణలో పోలీసులతో వాగ్వాదానికి దిగారు. దీంతో పోలీసులు ఆమెను, ఆమె తల్లిని అక్కడి నుంచి పంపించేశారు.
ఈ క్రమంలో శ్రవణ్ భార్య, కూతురు కన్నీరు మున్నీరుగా విలపించారు. శ్రవణ్‌కు జీవిత ఖైదు పడడంతో తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. మరోవైపు కోర్టుకు రాని ప్రణయ్ తల్లిదండ్రులు, తీర్పు వెలువడిన నేపథ్యంలో ప్రణయ్ సమాధిని సందర్శించారు. ప్రణయ్ సమాధి వద్ద నివాళులర్పించి, కన్నీటి పర్యంతం అయ్యారు. ఈ సందర్భంగా ప్రణయ్ తండ్రి పెరుమాల బాలస్వామి మీడియాతో మాట్లాడారు. ఈ రోజు న్యాయస్థానం ఇచ్చిన తీర్పుతో పరువు హత్యలు ఆగిపోవాలని.. ఇలాంటి పనులు చేసే వారికి కనువిప్పు కలగాలని అన్నారు. తన కుమారుడు ప్రణయ్ హత్య తర్వాత తాము చాలా కోల్పోయామన్నారు.
అమృతకు భర్త లేడని, తనకు కొడుకు, నా మనవడికి తండ్రి లేడని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కేసు విచారణలో సహకరించిన డీఎస్పీకి ధన్యవాదాలు తెలిపారు. వంద మంది సాక్షులు, 1600 పేజీల ఛార్జ్ షీట్ తో అప్పటి ఎస్పీ రంగనాథ్ నిందితులకు శిక్ష పడేలా నిక్కచ్చిగా వ్యవహరించారని కొనియాడారు. న్యాయవాది దర్శనం నరసింహ ఎలాంటి ప్రలోభాలకు లొంగకుండా న్యాయ పోరాటం చేశారన్నారు. ఇక ఈ కేసులో మరణశిక్ష పడిన A2 నిందితుడు సుభాష్ శర్మను పోలీసులు చర్లపల్లి జైలుకు తరలించారు. A3 నిందితుడు అస్గర్ అలీని గుజరాత్ సబర్మతి జైలుకు, మిగిలిన ఐదుగురు నిందితులను నల్లగొండ జైలుకు తరలించారు.
Amrutha Pranay Case Verdict : కోర్టు ప్రాంగణంలో A6 శ్రవణ్ భార్యాపిల్లలు కన్నీరు – TV9 #tv9telugu #AmruthaPranay #nalgonda #telangana pic.twitter.com/XEO3Wd0aqO
— TV9 Telugu (@TV9Telugu) March 10, 2025
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.