AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana Congress: ఇప్పటికైతే ఓకే..! నిరాశలో సీనియర్లు.. ఢిల్లీకి సీఎం రేవంత్ రెడ్డి..

ఒకవైపు సంతోషం, మరోవైపు అసంతృప్తి.. ఇంకోవైపు బుజ్జగింపులు.. వెరసి రోజంతా హైడ్రామా నడిచింది. ఎవరు ప్రెస్‌మీట్‌ పెట్టి ఏం బాంబులు పేలుస్తారో అనుకున్నా, మీనాక్షి, మహేష్ చర్చలు ఫలించి అంతా సైలెంట్ అయ్యారు. మరి మంత్రిపదవి ఆశించిన వారికి ఏం హామీలిచ్చారు?. అసంతృప్తులు ఏం చెప్తున్నారు?. ఆ ముగ్గురికి ఎలాంటి శాఖలు దక్కబోతున్నాయ్.. అనేది ఆసక్తికరంగా మారింది.

Telangana Congress: ఇప్పటికైతే ఓకే..! నిరాశలో సీనియర్లు.. ఢిల్లీకి సీఎం రేవంత్ రెడ్డి..
Telangana Congress
Shaik Madar Saheb
|

Updated on: Jun 09, 2025 | 8:53 AM

Share

ఎన్నో నెలల ఎదురుచూపుల తర్వాత.. తెలంగాణ కేబినెట్‌ విస్తరణ ముగిసింది. బలహీన వర్గాలకు ప్రాధాన్యత ఇస్తూ ముగ్గురికి అవకాశం ఇచ్చారు. ఊహించని విధంగా.. మంత్రి పదవులు వరించిన వారు ఫుల్ ఖుషీలో ఉన్నారు. గడ్డం వివేక్‌ (చెన్నూరు), అడ్లూరి లక్ష్మణ్‌(ధర్మపురి), వాకిటి శ్రీహరి ముదిరాజ్‌ (మక్తల్‌) మంత్రి పదవులు దక్కించుకున్నారు. ఏడాదిన్నరపాటు నాన్చి.. నాన్చి.. చివరకు ముగ్గురిని మంత్రివర్గంలోకి తీసుకున్నారు. ఎవ్వరినీ నొప్పించకుండా, ఇంకెవ్వరూ మాట్లాడకుండా.. సామాజిక సమీకరణలకు ప్రాధాన్యం ఇస్తూ.. వివేక్, అడ్లూరి లక్ష్మణ్, శ్రీహరిని అమాత్యులుగా చేశారు. కేబినెట్ విస్తరణలో సోషల్ కార్డును వాడారు. బీసీ, ఎస్సీలకు పెద్ద పీట వేశారు. దీంతో మంత్రి పదవులు దక్కించుకున్న వారితో గవర్నర్ ప్రమాణం చేయించారు. అయితే.. మంత్రివర్గ విస్తరణ జరిగినా.. కాంగ్రెస్‌ పార్టీలో రోజంతా టెన్షన్ కొనసాగింది. మంత్రి పదవులు ఆశించిన సీనియర్లకు నిరాశ ఎదురవ్వడంతో బుజ్జగింపులకు దిగారు కాంగ్రెస్ ముఖ్య నేతలు. కొందరికి పార్టీ పదవుల ఆఫర్‌తో పాటు.. మరో మూడు బెర్త్‌లు ఖాళీ ఉండటంతో.. అందులో అవకాశం ఇస్తామని చెప్పినట్లు తెలుస్తోంది.

సుదర్శన్ రెడ్డి ఇంటికెళ్లి బుజ్జగించిన మీనాక్షి

కొత్త మంత్రుల పేర్లు అనౌన్స్ కాగానే.. రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌ఛార్జ్ మీనాక్షి నటరాజన్ రంగంలోకి దిగారు. రాజీనామా చేస్తానని కార్యకర్తల దగ్గర చర్చించిన.. బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి ఇంటికెళ్లి బుజ్జగించారు మీనాక్షి నటరాజన్. మీ సేవలను పార్టీ గుర్తిస్తుందని మీనాక్షి నచ్చజెప్పడంతో అలక వీడారు. పార్టీకి విధేయుడిగా ఉంటానని.. హైకమాండ్‌ నిర్ణయమే ఫైనల్‌ అన్నారు సుదర్శన్‌రెడ్డి. మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్‌రావును సైతం కన్విన్స్ చేశారు మీనాక్షి నటరాజన్. రాబోయే రోజుల్లో అవకాశం దక్కుతుందని చెప్పడంతో అసంతృప్తి వీడారు. MLA రాజగోపాల్‌రెడ్డితోనూ మీనాక్షి నటరాజన్ భేటీ అయ్యారు. మీనాక్షి నటరాజన్‌, మంత్రి వివేక్ రాజగోపాల్‌ రెడ్డిని బుజ్జగించారు.

హైదరాబాద్-రంగారెడ్డి జిల్లాల నుంచి మంత్రులు ఎవ్వరూ లేకపోవడంతో.. ఈసారి మంత్రివర్గంలో పక్కాగా చోటు దక్కుతుందనుకున్న మల్ రెడ్డి రంగారెడ్డి తీవ్ర నిరాశకు గురయ్యాడు. అనుచరులతో చర్చించి.. మీడియా ముందుకు వచ్చేందుకు రెడీ అవ్వగా.. పీసీసీ చీఫ్‌ మహేశ్‌కుమార్ గౌడ్, మంత్రి పొన్నం ఆయన ఇంటికి వెళ్లి బుజ్జగించారు. మీనాక్షి నటరాజన్‌ మల్‌రెడ్డితో ఫోన్‌లో మాట్లాడి నచ్చ జెప్పారు. పార్టీని కాపాడుకోవాలన్నదే తమ తాపత్రయం అన్నారు మల్ రెడ్డి. కాంగ్రెస్ అంటేనే ప్రజాస్వామ్యం ఎక్కువ.. మంత్రివర్గంపై భారీ ఆశలు పెట్టుకున్న సీనియర్లు.. ప్రస్తుత బుజ్జగింపులకు ఓకే అన్నా.. మున్ముందు ఎలా రియాక్ట్ అవుతారన్నది చూడాలి.

ఢిల్లీకి సీఎం రేవంత్ రెడ్డి..

ముగ్గురికి మంత్రి పదవులు దక్కడం.. వివేక్, అడ్లూరి లక్ష్మణ్‌, వాకిటి శ్రీహరికి ఏ శాఖలు ఇవ్వబోతున్నారు?.. అనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. సీఎం దగ్గర శాఖలు కేటాయిస్తారా?. ఇతర మంత్రులకు తగ్గించి.. ఈ ముగ్గురికి కేటాయిస్తారా అన్నది సస్పెన్స్‌గా మారింది.. దీనికి మరికొన్ని గంటల్లో తెరపడే అవకాశం ఉంది. దీనిపై చర్చించేందుకు సీఎం రేవంత్ రెడ్డి ఇవాళ ఢిల్లీకి వెళ్లనున్నారు. మంత్రుల శాఖలు, పార్టీ పదవుల పై చర్చించనున్నారు. మొత్తంగా హైకమాండ్ నిర్ణయం ఎలా ఉండబోతుంది?. ఎవరికి ఏ శాఖలు దక్కబోతున్నాయి అనేది ఇంకొన్ని గంటలు ఎదురు చూడాల్సిందే..

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..