Telangana CM KCR: ప్రగతి భవన్‌లో నేడు ముఖ్యమంత్రి కేసీఆర్ సమీక్ష.. పలు కీలక అంశాలపై చర్చ..!
Telangana CM KCR: తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పల్లెప్రగతి, పట్టణ ప్రగతి పనుల పురోగతి, అధికారుల పనితీరు నిధుల వినియోగం తదితర అంశాలపై..
Telangana CM KCR: తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పల్లెప్రగతి, పట్టణ ప్రగతి పనుల పురోగతి, అధికారుల పనితీరు నిధుల వినియోగం తదితర అంశాలపై ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదివారం ఉదయం 11.30 గంటల వరకు ప్రగతి భవన్‌లో సమీక్ష నిర్వహించనున్నారు. ఈ సమావేశానికి జిల్లా కలెక్టర్లు, జిల్లా పంచాయతీ అధికారులు హాజరు కానున్నారు. సమావేశంలో పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి లక్ష్యాలు, సాధించిన విజయాలు, ఇంకా చేయాల్సిన పనులు, పట్టణ, గ్రామీణ స్థానిక సంస్థలకు విడుదల చేస్తున్న నిధులు, ఖర్చులు, హరితహారం, శ్మశానవాటికలకు, పల్లెప్రకృతి వనాలు, ఇంటిగ్రేటెడ్ మార్కెట నిర్మాణం తదితర అంశాలపై కేసీఆర్ సమీక్షించనున్నారు. అలాగే ఈ నెల 19 తర్వాత ఆకస్మికంగా తనిఖీచేస్తానని సీఎం ప్రకటించిన విషయం తెలిసిందే. ఎక్కడైనా పనులు జరగకుంటే అధికారులపై కఠిన చర్యలు తీసుకుంటామని కూడా హెచ్చరించారు. స్థానికసంస్థల అదనపు కలెక్టర్ల పనితీరుపై సీఎం కేసీఆర్ అసంతృప్తి వ్యక్తం చేశారు.
పల్లె ప్రగతి, పట్టణప్రగతిలో పనులు పెండింగ్‌లో ఉన్నాయని, ఐఏఎస్ అధికారులు, పంచాయతీరాజ్ కమిషనర్లు, సీడీఎంఏ కూడా జిల్లాల్లో పర్యటించి పనులతీరును పరిశీలించాలని సూచించారు. వీటన్నింటిపై ముఖ్యమంత్రి కేసీఆర్ దిశానిర్దేశం చేయనున్నారు. అలాగే సమావేశంలో మున్సిపల్‌శాఖ మంత్రి కే తారకరామారావు, పంచాయతీరాజ్‌శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు తదితరులు హాజరు కానున్నారు.