KCR Dalita Bandhu: దళిత బంధు దేశానికే ఆదర్శం కానుంది.. రూ. లక్ష కోట్లు ఖర్చు చేయనున్నాం.. స్పష్టం చేసిన కేసీఆర్.
KCR Dalita Bandhu: తెలంగాణ ప్రభుత్వ ఎంతో ప్రతిష్టాత్మకంగా దళిత సంక్షేమం కోసం 'దళిత బంధు' పథకానికి శ్రీకారం చుట్టిన విషయం తెలిసిందే. ఈ పథకాన్ని ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని హుజూరాబాద్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ప్రారంభించేందుకు..
KCR Dalita Bandhu: తెలంగాణ ప్రభుత్వ ఎంతో ప్రతిష్టాత్మకంగా దళిత సంక్షేమం కోసం ‘దళిత బంధు’ పథకానికి శ్రీకారం చుట్టిన విషయం తెలిసిందే. ఈ పథకాన్ని ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని హుజూరాబాద్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ప్రారంభించేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. పైలెట్ ప్రాజెక్టుగా అమలు చేయనున్న ఈ పథకం కోసం హుజూరాబాద్‌లో ఏకంగా రూ. 2 వేల కోట్లను ఖర్చు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. ఈ క్రమంలోనే ఈ నెల 26న సీఎం కేసీఆర్ సారథ్యంలో దళిత బంధు అవగాహన కార్యక్రమం నిర్వహించనున్నారు.
ఇదిలా ఉంటే తాజాగా ఎస్సీ కార్పోరేషన్ చైర్మన్ గా బండా శ్రీనివాస్ ను నియమించిన నేపథ్యంలో సీఎం కేసీఆర్‌కు ధన్యవాదాలు తెలిపేందుకు హుజూరాబాద్ నియోజకవర్గ పరిధిలోని దళిత సంఘాల నేతలు, ప్రజాప్రతినిధులు, మేధావులు, కార్యకర్తలు, శనివారం ప్రగతిభవన్‌కు తరలివచ్చారు. ఈ నేపథ్యంలోనే కేసీఆర్ దళిత బంధు పథకంపై పలు వ్యాఖ్యలు చేశారు. కాళ్లు రెక్కలు మాత్రమే ఆస్తులుగా కలిగిన దళిత కుటుంబాలే మొదటి ప్రాధాన్యతగా దళిత బంధు పథకం రాష్ట్రవ్యాప్తంగా, అర్హులైన దళితులందరికీ అమలు చేస్తామని, దశలవారీగా అమలు చేసే ఈ పథకం కోసం రూ. 80 వేల కోట్ల నుంచి రూ. లక్ష కోట్ల వరకు ఖర్చు చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు స్పష్టం చేశారు. దళితబంధు కేవలం తెలంగాణలో మాత్రమే కాకుండా యావత్ దేశానికి ఆదర్శంగా నిలవనుందన్నారు. దేశంలోని దళితులందరినీ ఆర్ధిక, సామాజిక వివక్షల నుంచి విముక్తులను చేసే పథకంగా మారాలని సీఎం ఆకాంక్షించారు. అందుకు పట్టుదలతో అందరం కలిసి పథకం విజయవంతం అయ్యేందుకు కృషి చేద్దామని, దళిత ప్రజాప్రతినిధులకు, మేధావులకు, సంఘాల నేతలకు కేసీఆర్ పిలుపునిచ్చారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణలో దళితబంధును విజయవంతం చేయడం కోసం ప్రతీ దళితబిడ్డ పట్టుబట్టి పనిచేయాలని, ప్రతి దళితవాడలో ఒక కేసీఆర్ పుట్టాలని పిలుపునిచ్చారు. హుజూరాబాద్‌లో విజయవంతం కావడం ద్వారా ప్రసరించే వెలుగు, తెలంగాణ సహా, దేశవ్యాప్తంగా విస్తరించాలన్నారు. తెలంగాణ దళితుల అభివృద్ధిని కూడా తెలంగాణ ఉద్యమంలా చేపట్టాలన్నారు. తెలంగాణ దళిత బంధు పథకం, కేవలం పథకం మాత్రమే కాదని, తెలంగాణ ఉద్యమం మాదిరి దళితుల అభ్యున్నతి కోసం సాగే ఉద్యమం అని పునరుద్ఘాటించారు. ఒక దీపం ఇంకోదీపాన్ని వెలిగించినట్టు ఒకరి అభివృద్ధి కోసం మరొకరు పాటు పడే యజ్జం అని సీఎం అభిప్రాయపడ్డారు. దళితుల్లో ఆత్మ విశ్వాసాన్ని పెంచి, వారిలో ధీమా పెరిగి తమ అభివృద్ధిని తామే నిర్వచించుకోగలం అనే భరోసాను కలిగించే ప్రయత్నమే దళిత బంధు పథకమని అన్నారు. ఇచ్చిన పైసలు పప్పులు, పుట్నాలకు ఖర్చు చేయకుండా, పైసను పెట్టి పైసను సంపాదించే ఉపాధి వ్యాపార మార్గాలను అన్వేషించాలని సీఎం సూచించారు. ఆర్ధికంగా అభివృద్ది చెందాలి. అందుకు మీరందరూ కృషి చేయాలని సీఎం తెలిపారు. ఇప్పటికే తెలంగాణ ప్రారంభించిన అనేక పథకాలను అన్ని రాష్ట్రాలు ఆదర్శంగా తీసుకున్నాయని దళిత బంధు పథకాన్ని కూడా దేశానికి ఆదర్శంగా మారుతుందన్నారు. ఎక్కడో ఒక దగ్గర ప్రేరణ కావాలి. అది హుజూరాబాద్ అవుతున్నందుకు ఆ గడ్డమీది బిడ్డలుగా మీరందరూ గర్వపడాలన్నారు సీఎం. ఈ సమావేశంలో ఆర్ధిక శాఖ మంత్రి తన్నీరు హరీశ్ రావు, రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బి.వినోద్ కుమార్, రైతు బందు సమితి అధ్యక్షుడు ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి, బీసీ కమిషన్ మాజీ సభ్యుడు వకుళాభరణం కృష్ణమోహన్లతో పాటు పలువురు దళిత నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
యూపీ ఎన్నికల్లో సమాజ్ వాదీ పార్టీతో పొత్తుకు ఎంఐఎం సిద్ధం… అయితే ఓ షరతు.. అసదుద్దీన్ ఒవైసీ
కేంద్రానికి ఎలా గుణపాఠం చెప్పాలో అన్నదాతలకు తెలుసు.. రైతు సంఘం నేత రాకేష్ తికాయత్