AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Revanth Reddy: అంతా సమాన బాధ్యతలు తీసుకోండి.. మంత్రులతో సీఎం రేవంత్ రెడ్డి కీలక చర్చ..

అటు రాజకీయపరమైన అంశాలు.. ఇటు పరిపాలనపరమైన విషయాలు. త్వరలో జరగబోయే తెలంగాణ కేబినెట్ భేటీ కీలకం కాబోతోందా ? విపక్షాల విమర్శలకు చెక్ చెప్పే అంశంలో మంత్రులకు సీఎం రేవంత్ రెడ్డి చేసిన సూచనలు ఏంటి? భవిష్యత్తు ప్రణాళికలపై ఏం చెప్పారు.. అనేది చర్చనీయాంశంగా మారింది.

Revanth Reddy: అంతా సమాన బాధ్యతలు తీసుకోండి.. మంత్రులతో సీఎం రేవంత్ రెడ్డి కీలక చర్చ..
Cm Revanth Reddy
Shaik Madar Saheb
|

Updated on: Jun 02, 2025 | 8:51 AM

Share

మంత్రులతో సమావేశమైన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పలు కీలక అంశాలపై చర్చించారు. ఈ నెల 5న తెలంగాణ కేబినెట్‌ సమావేశం నిర్వహించాలని ఈ భేటీలో నిర్ణయించారు. ఇంటిగ్రేటేడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్‌లో మంత్రులతో సమావేశమైన సీఎం రేవంత్.. వివిధ అంశాలపై సమాలోచనలు జరిపారు. కాళేశ్వరంపై NDSA ఇచ్చిన నివేదికను సమావేశంలో ఆమోదించాలని ఈ సమావేశంలో ఓ నిర్ణయానికి వచ్చారు. అదే సమయంలో ఎల్‌అండ్‌టీపై చర్యలకు సిఫార్సు చేయనున్నారు. ఇక ఫోన్ ట్యాపింగ్‌ అంశంపైనా ఇందులో చర్చించారు. మరోవైపు బనకచర్లపై ఏపీ ప్రభుత్వం తీరును నిరసించాలని ఈ భేటీలో నిర్ణయించారు. నీటి కేటాయింపుల విషయంలో రాజీపడేది లేదన్న సీఎం రేవంత్ స్పష్టం చేశారు. కవిత అంశంపైనా మంత్రుల సమావేశంలో చర్చ జరిగింది. ఆమె వ్యాఖ్యలతో బీజేపీ, బీఆర్‌ఎస్‌ ఒక్కటే అనే విషయం ప్రజల్లోకి బలంగా వెళ్లిందని మంత్రులు అభిప్రాయపడ్డారు. ఇక గత ప్రభుత్వ హయాంలో ధరణి పేరిట భూములు కాజేసిన బడాబాబుల పేర్లను బహిర్గతం చేయాలని పలువురు మంత్రులు తెలిపారు. పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంలో మరింతగా పని చేయాలని.. ప్రతిపక్షాల విమర్శలను తిప్పికొట్టలేకపోతున్నామన్న సీఎం రేవంత్ అభిప్రాయపడ్డారు. ఈ అంశంలో అంతా సమాన బాధ్యతలు తీసుకోవాలని సూచించారు.

4న సీఎం రేవంత్ ఢిల్లీ వెళ్లే అవకాశం.. మంత్రివర్గ విస్తరణపై చర్చలు

ఇక ఈనెల 4న సీఎం రేవంత్ ఢిల్లీ వెళ్లే అవకాశం ఉన్నట్టు సమాచారం. మంత్రి వర్గ విస్తరణపై ఢిల్లీ పెద్దలతో చర్చించనున్నారు. పలువురి శాఖల మార్పుపై చర్చించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. మంత్రుల తొలగింపుపై హైకమాండ్ నిర్ణయం తీసుకోలేదని.. అయినా కొందరు తమ పనితీరు మెరుగుపరుచుకోవాలని మంత్రులకు సూచించారు. అయినా ఈ అంశంలో అధిష్ఠానం నిర్ణయమే ఫైనల్‌ అని మంత్రులకు స్పష్టం చేశారు. ఈ సమావేశంలోనే రాష్ట్ర అవతరణ వేడుకలు, ఇందిరమ్మ ఇండ్లు, రెవెన్యూ సదస్సులు, వాన కాలం పంటల సాగు సన్నద్ధత, రాజీవ్ యువ వికాసం అంశాలపై మంత్రులు అందించిన నివేదికపై చర్చించారు. మే 29, 30 తేదీలలో పలు జిల్లాల్లో పర్యటించిన మంత్రులు ఈ నాలుగు అంశాలపై అధికారులతో సమీక్షలు నిర్వహించారు.

రాజీవ్ యువ వికాసంపై మంత్రుల మధ్య చర్చ

ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల తుది జాబితాలు, రెవిన్యూ సదస్సుల నిర్వహణ ఏర్పాట్లపై జిల్లాల వారీగా తయారు చేసిన నివేదికలపై ఈ సమావేశంలో వివరించారు. రాజీవ్ యువ వికాసానికి ఊహించినదానికంటే ఎక్కువ సంఖ్యలో దరఖాస్తులు వచ్చాయని, అనర్హులకు యువ వికాసం అందకుండా చూడాలని పెద్ద ఎత్తున ఫిర్యాదులు వచ్చాయని సీఎం దృష్టికి తీసుకొచ్చారు మంత్రులు. పెద్ద సంఖ్యలో వచ్చిన దరఖాస్తుల స్క్రీనింగ్ ప్రక్రియ కొనసాగుతున్న నేపథ్యంలో పూర్తి స్థాయి పరిశీలన తరువాతే అర్హుల జాబితాలను ప్రకటించాలని నిర్ణయించారు. మరింత లోతుగా విశ్లేషించి లబ్దిదారులను గుర్తించాలని నిర్ణయించాలన్నారు. ఒక్క అనర్హుడికి కూడా రాజీవ్ యువ వికాసం ద్వారా లబ్ధి చేకూరవద్దన్నారు. ఈ అంశంపై కేబినెట్ లో చర్చించి నిర్ణయం తీసుకోనున్నారు. ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియను సమర్ధవంతంగా నిర్వహించేలా చర్యలు తీసుకున్నందుకు మంత్రి ఉత్తమ్‌ను సీఎం రేవంత్, ఇతర మంత్రులు అభినందించారు. ఇక ఉద్యోగుల సమస్యలపై నియమించిన కమిటీకి సంబంధించి అధికారులు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కకు ఇప్పటికే నివేదిక అందించారు. ఆ నివేదికపై ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క సీఎం రేవంత్, మంత్రులకు వివరించారు. దీనిపై కేబినెట్‌లో చర్చించి సమస్యల పరిష్కారంపై ఎలా ముందుకెళ్లాలో నిర్ణయం తీసుకోనున్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..