Huzurabad Bypoll: సీఎం డైరెక్షన్‌లోనే కేంద్ర మంత్రిపై దాడికి యత్నం.. టీఆర్ఎస్‌పై మండిపడిన బండి సంజయ్..
Huzurabad ByElections: టీఆర్ఎస్ నేతలపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ తీవ్రస్థాయిలో ఫైర్ అయ్యారు. హుజూరాబాద్ నియోజకవర్గం పరిధిలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఎన్నికల ప్రచారం చేస్తుండగా..
Huzurabad ByElections: టీఆర్ఎస్ నేతలపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ తీవ్రస్థాయిలో ఫైర్ అయ్యారు. హుజూరాబాద్ నియోజకవర్గం పరిధిలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఎన్నికల ప్రచారం చేస్తుండగా.. టీఆర్ఎస్ నేతలు దాడి చేసి అడ్డుకునే ప్రయత్నం చేశారని, దీనిని తీవ్రంగా ఖండిస్తున్నామని అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ డైరెక్షన్‌లోనే ఈ దాడి జరిగిందని బండి సంజయ్ ఆరోపించారు. వందల, వేల కోట్లు ఖర్చు పెట్టినా హుజూరాబాద్ ప్రజల మనసు మార్చలేరని కేసీఆర్ గ్రహించారని, ఆఖరికి ప్రజా ప్రతినిధులను కొనుగోలు చేసినా ఫలితం లేదని కేసీఆర్‌కు అర్థమైందని వ్యాఖ్యానించారు. ఈ కారణంగానే.. ప్రజలను భయభ్రాంతులకు గురిచేసి శాంతిభద్రతల సమస్యను స్రుష్టించి ఎన్నికలను వాయిదా వేయించేందుకు కేసీఆర్ కుట్ర చేస్తున్నారని సంజయ్ ఆరోపించారు. పోలింగ్ కు ప్రజలు రాకుండా భయభ్రాంతులకు గురిచేసేలా అధికార పార్టీ వ్యవహరిస్తోందని అన్నారు. జీహెచ్ఎంసీ ఎన్నికల సమయంలోనూ టీఆర్ఎస్ రెచ్చగొట్టే ప్రయత్నిం చేసి విఫలమైందని వ్యాఖ్యానించారు.
బీజేపీ దాడులు చేస్తుందని, మత కల్లోలాలు సృష్టించే కుట్ర చేస్తున్నారంటూ ఆనాడు దుష్ప్రచారం చేసి విఫలమయ్యారని బండి సంజయ్ గుర్తు చేశారు. హుజూరాబాద్ ఎన్నికల్లోనూ మళ్లీ ఇదే కుట్రను అమలు చేయబోతున్నారని అన్నారు. కేంద్ర మంత్రి ప్రచారంపై దాడులకు పాల్పడుతున్నా పోలీసులు చూస్తూ ప్రేక్షకపాత్ర పోషించడం దారుణం అని ఫైర్ అయ్యారు. ఓటుకు రూ.20 వేలు పంపిణీ చేయాలని యత్నించి విఫలమవుతుండటంతో ఆ పార్టీ నాయకులతోనే కేసీఆర్ భౌతిక దాడులకు పురిగొల్పుతున్నారని ఆరోపించారు. ప్రజాస్వామ్యబద్దంగా ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు జరగాలన్నదే బీజేపీ అభిమతం అని స్పష్టం చేశారు.
దాడులతో భయపెట్టాలని చూస్తూ ఊరుకునేది లేదని, బీజేపీ జాతీయ పార్టీ అని, త్యాగాలు చేసిన పార్టీ అని సంజయ్ పేర్కొన్నారు. పేదల కోసం, ప్రజలను కాపాడేందుకు దాడులను ఎదుర్కొంటూ ప్రతిఘటించిన చరిత్ర బీజేపీకి ఉందన్నారు. కేసీఆర్.. సపరేట్ బ్యాచ్ లతో దాడులు చేయించాలని కుట్ర చేస్తున్నారని అన్నారు. దుబ్బాక, జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఇలాంటివి చేస్తే బీజేపీ తిప్పికొట్టిన సంఘటనలు మర్చిపోవద్దని టీఆర్ఎస్ శ్రేణులకు హితవుచెప్పారు. హుజూరాబాద్‌లో టీఆర్ఎస్ పార్టీకి డిపాజిట్ వచ్చే అవకాశమే లేదనే భావనతోనే ఇలాంటి దాడులకు కేసీఆర్ పురిగొల్పుతున్నారని బండి సంజయ్ ఆరోపించారు. ఈ ఘటనపై జాతీయ ఎన్నికల కమిషన్ కు ఫిర్యాదు చేశామన్నారు.
టీఆర్ఎస్ పాలన ఉండేది ఇంకా రెండేళ్లలోపే అని, ఈ ప్రభుత్వం ఎప్పుడు కూలిపోతుందో కూడా తెలియదని బండి సంజయ్ వ్యాఖ్యానించారు. దీన్ని దృష్టిలో ఉంచుకుని అధికారులకు, పోలీసులు.. అధికార పార్టీకి కొమ్ముకాయడం మానుకోవాలని సంజయ్ హితవు చెప్పారు. ప్రజల కోసం ఒకనాడు ప్రాణ త్యాగం చేసిన పోలీస్ వ్యవస్థ నేడు.. అధికార పార్టీకి కొమ్ముకాసేలా వ్యవహరించడం దారుణం అన్నారు. తక్షణమే దాడులకు కారకులెవరు? దాడులు చేసిందెవరు? అనే అంశాలపై సమగ్ర దర్యాప్తు జరపాలని డిమాండ్ చేశారు. ఎన్నికల్లో భయానక వాతావరణం సృష్టిస్తున్నారని ఆరోపించారు. పోలీస్ అధికారులను వెంటనే బదిలీ చేయాలని సంజయ్ డిమాండ్ చేశారు.
కేంద్ర కేబినెట్ మంత్రి వస్తే.. కనీస భద్రత ఇవ్వకపోవడం దారుణం అన్నారు. ఇది మంచి పద్దతి కాదని పేర్కొన్నారు. ఎన్నికలు వస్తుంటాయి.. పోతుంటాయి.. ప్రజాస్వామ్యబద్దంగా వ్యవహరించాలే తప్ప భౌతిక దాడులకు పాల్పడితే సహించబోమని బండి సంజయ్ తేల్చి చెప్పారు. దాడులకు నిరసనగా రేపు రాష్ట్రవ్యాప్తంగా బీజేపీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలకు పిలుపునిస్తున్నామని సంజయ్ ప్రకటించారు. ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికలు జరగాలంటే భద్రతా దళాలను పెంచాలని, పోలీసు అధికారులను మార్చాలని డిమాండ్ చేశారు.
Also read:
Viral Video: ‘‘ఏడవకురా.. ఏప్రిల్‌లో వెళ్లిపోతాం లే’’.. హాస్టల్‌లో చిన్నారిని ఓదార్చిన మరో చిన్నారి!
Aliens in Sea: సముద్ర గర్భంలో ఏలియన్స్ రూపాలు.. అవి చూసి అవాక్కయిన శాస్త్రవేత్తలు..