Telangana BJP: కేసులు లేకుంటే వేస్ట్.. లీడర్ అన్నాకా.. ఓ పది కేసులైనా ఉండాలి!
తెలంగాణ బీజేపీ సమావేశంలో, రాష్ట్ర ఇన్‌ఛార్జ్ అభయ్ పాటిల్ చేసిన సంచలన వ్యాఖ్యలు రాజకీయ వర్గాలలో చర్చనీయాంశమయ్యాయి. నాయకులకు కేసులు ఉండటం అవసరమని, ప్రజా ఉద్యమాల ద్వారా వచ్చే నాయకులకే నిజమైన నాయకత్వ లక్షణాలు ఉంటాయని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ వ్యాఖ్యలు పార్టీ శ్రేణులలో విభిన్న చర్చలకు దారితీశాయి.

ప్రజా ఉద్యమాల నుంచి పుట్టుకొచ్చే నాయకులు కొంతమందైతే.. కాలం కలిసి వస్తే నాయకుల అయ్యేవారు మరికొంత మంది. నాయకుడిగా పార్టీలో దేన్ని ప్రామాణికంగా తీసుకుంటారంటే? అందుకు సమాధానాలు ఎన్నెన్నో. ధన బలం, జనాదారణ ప్రాధానమైనవి. వీటికి తోడు మరొకటి ఉండాలంటున్నారంట బీజేపీ రాష్ట్ర ఇన్ ఛార్జ్ అభయ్ పాటిల్. తెలంగాణ బీజేపీ సోమవారం నిర్వహించిన ఆఫీసర్ బేరర్స్, జిల్లా అధ్యక్షుల సమావేశంలో ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి నేతృత్వంలో జరిగిన ఈ భేటీకి కేంద్రమంత్రి బండి సంజయ్, పలువురు ఎంపీలు ఎమ్మెల్యేలతో పాటు పార్టీ రాష్ట్ర ఇన్ చార్జ్ గా ఉన్న అభయ్ పాటిల్ కూడా హాజరయ్యారు.
కిషన్ రెడ్డి, అభయ్ పాటిల్ కొత్తగా ఎంపికైన జిల్లా అధ్యక్షులకు పలు అంశాలపై దిశానిర్దేశం చేశారు. ప్రజా సమస్యలపై గ్రౌండ్ లెవెల్ లో ఉధృతంగా పోరాటం చేయాలని కిషన్ రెడ్డి సూచించారు. ఇక తన టైం వచ్చే సరికి అభయ్ పాటిల్ ఆఫీస్ బేరర్స్, జిల్లా అధ్యక్షులను ఓ వింతైన ప్రశ్న అడిగారు. ఎవరిపై ఎక్కువ కేసులు ఉన్నాయ్ అంటూ ప్రశ్న సంధించగా.. కేసులు ఉన్నవాళ్లు నిలబడ్డారు. అసలు కేసులు లేని వారు ఎంతమంది అంటే ఇంకొందరు నిలుచున్నారు. కేసులు లేకుండా ఉంటే నాయకుడు ఎలా అవుతారంటూ నేతలకు అభయ్ పాటిల్ వ్యాఖ్యానించారు.
ప్రజా సమస్యలపై ఉద్యమాలు, పోరాటలు చేసి జైలు, కేసులు ఉంటేనే నాయకుడు అవుతారంటూ పాటిల్ చేసిన కామెంట్స్ అందరిని ఆలోచనలో పడేశాయి, పార్టీ బలోపేతంలో భాగంగా ప్రజా ఉద్యమాలు గట్టిగా చేయాలని.. కేసులు పెడతారని వెనక్కి తగ్గొద్దని జిల్లా అధ్యక్షులకు నేతలకు ఆయన సూచించారు. నాయకుడు అంటే కేసులు లేకుంటే వేస్ట్.. అంటూ అభయ్ పాటిల్ కామెంట్స్ పై పార్టీలో జోరుగా చర్చ జరుగుతోంది. నిజమే కదా… లీడర్ అంటే ప్రజల కోసం ఫైట్ చేసి కేసులను లెక్క చేయొద్దంటూ పార్టీ శ్రేణులు ఆసక్తికరంగా చర్చించుకుంటున్నారు. అవినీతి కేసులు కాదు.. అన్యాయంపై పోరాడిన కేసులు ఉండాలంటూ ఇతర పార్టీలనుద్దేశించి మరికొంతమంది కామెంట్స్ చేస్తున్నారు. మొత్తంగా లీడర్ అంటే కేసులు ఉండాల్సిందేనన్న అభయ్ పాటిల్ కామెంట్స్ కాస్త వైరల్ గా మారాయి.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..