Telangana: విద్యార్థులకు అలెర్ట్.. శనివారం స్కూళ్లు, కాలేజీలు బంద్.. వరసగా 3 రోజులు
రాష్ట్రంలోని బీసీ వర్గాలకు 42% రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేస్తూ వివిధ వెనుకబడిన తరగతుల (బీసీ) సంఘాలు బంద్‌కు పిలుపునిచ్చాయి. ఈ బంద్ వల్ల పాఠశాలలు, కళాశాలలు, అనేక కార్యాలయాలు మూత పడనున్నాయి. దీంతో విద్యార్థులకు వరసగా 3 రోజులు సెలవులు రానున్నాయి.

బీసీ వర్గాల హక్కుల సాధన కోసం, 42 శాతం రిజర్వేషన్ల చట్టబద్ధత డిమాండ్‌తో ఈనెల 18న (శనివారం) రాష్ట్ర బంద్‌కు బీసీ సంఘాలు పిలుపునిచ్చాయి. అందరూ సహకరించి.. ఈ బంద్‌ను విజయంగా మార్చాలని బీసీ సంఘాల ఐక్య కార్యాచరణ కమిటీ పిలుపునిచ్చింది. బంద్‌కు సంపూర్ణ మద్దతు కూడగట్టేందుకు బీసీ సంఘాల ప్రతినిధులు చురుగ్గా వ్యవహరించారు. చాంబర్ ఆఫ్ కామర్స్, కిరాణా వర్తక సంఘం వంటి వ్యాపార సంస్థల ప్రతినిధులను కలిసి.. స్వచ్ఛందంగా బంద్ పాటించాలని కోరారు. విద్యాసంస్థలను కూడా మూసివేయాలని సూచించారు. వ్యాపార, వాణిజ్య సంస్థలు, విద్యా సంస్థలు తప్పకుండా బంద్ పాటించి.. బీసీల గళానికి బలం చేకూర్చాలని విజ్ఞప్తి చేశారు.
ఎంపీ ఆర్. కృష్ణయ్య నాయకత్వంలో బీసీ జాయింట్ యాక్షన్ కమిటీ నేతృత్వంలో పిలుపునిచ్చిన బంద్‌కు కాంగ్రెస్, భారత రాష్ట్ర సమితి, భారతీయ జనతా పార్టీ , కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (సీపీఐ) సహా అనేక ఇతర సంస్థలు మద్దతు ఇవ్వడంతో ఊపందుకుంది.
బంద్ తెలంగాణ అంతటా విస్తృత ప్రభావాన్ని చూపుతుందని భావిస్తున్నారు. పాఠశాలలు, కళాశాలలు అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ విద్యాసంస్థలు మూతపడతాయి. ప్రజా రవాణా, ఆర్టీసీ బస్సు సర్వీసులు, ఇతర రవాణా విధానాలపై బంద్ ప్రభావం ఉండవచ్చు. దుకాణాలు, కార్యాలయాలు అనేక వ్యాపార సంస్థలు, మార్కెట్లు, ప్రైవేట్ కార్యాలయాలు స్వచ్ఛందంగా మూసివేసే అవకాశం ఉంది. అవసరమైన సేవలు మినహా చాలా ప్రభుత్వ కార్యాలయాల్లో హాజరు తక్కువగా ఉండవచ్చు.
