ఆర్టీసీ ప్రయాణికులకు అదిరిపోయే శుభవార్త.. పండుగల వేళ టికెట్ ధరలు తగ్గింపు..
TGSRTC: క్రిస్మస్, న్యూ ఇయర్ క్రమంలో ప్రయాణికులకు టీజీఎస్ఆర్టీసీ గుడ్‌న్యూస్ తెలిపింది. ఆ టికెట్ ధరలను తగ్గించింది. దీని వల్ల ప్రజలకు ఛార్జీల భారం తగ్గనుంది. డిసెంబర్ 31వ తేదీ వరకు మాత్రమే ఈ డిస్కౌంట్ అమల్లోకి ఉండనుంది. ఆ వివరాలు ఏంటో ఇప్పుడు చూద్దాం.

తెలంగాణ ఆర్టీసీ ప్రయాణికులను ఆకట్టుకునేందుకు ప్రయత్నిస్తోంది. అందులో భాగంగా అనేక కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాలు అందించేందుకు కొత్త బస్సులను తీసుకురావడంతో పాటు బస్లాండ్లను ఆధునీకరిస్తోంది. ఇదే కాకుండా ప్రజలకు మరింత చేరువయ్యేందుకు టీజీఎస్‌ఆర్టీసీ డిస్కౌంట్స్, ఆఫర్లు కూడా భారీగా ప్రకటిస్తోంది. పండుగల సమయంలో అయితే ప్రైవేట్ ఆపరేటర్లుగా పోటీగా బంపర్ ఆఫర్లు ప్రవేశపెడుతోంది. త్వరలో క్రిస్మస్, న్యూఇయర్, సంక్రాంతి వస్తున్న క్రమంలో ప్రయాణికులకు ఆర్టీసీ అదిరిపోయే శుభవార్త అందించింది.
T24 టికెట్ ధరలు తగ్గింపు
త్వరలో పండుగల క్రమంలో ప్రయాణికుల రద్దీ విపరీతంగా ఉండనుంది. ఈ క్రమంలో ట్రావెల్ యూజ్ యు లైక్( టీ24) టికెట్ల ధరలను తగ్గించింది. గతంలో దీని ధర పెద్దలకు రూ.150గా ఉండగా.. మహిళలు, సీనియర్ సిటిజన్లకు రూ.120గా ఉంది. ఇక పిల్లలకు రూ.100గా ఉంది. ఇప్పుడు ఆ టికెట్ల ధరలను తగ్గించిన ఆర్టీసీ.. పెద్దలకు రూ.130, మహిళలు, సీనియర్ సిటిజన్లకు రూ.110, పిల్లలకు రూ.90గా నిర్ణయించింది. డిసెంబర్ 31వ తేదీ వరకు ఈ ఆఫర్ అందుబాటులో ఉంటుందని, ప్రయాణికులు ఉపయోగించుకోవాలని ఆర్టీసీ అధికారులు తెలిపారు. డిసెంబర్ 31 తర్వాత యాధావిధిగా పాత రేట్లు అమల్లో ఉంటాయని స్పష్టం చేశారు. పండుగల సమయంలో ప్రయాణికుల రాకపోకలు ఎక్కువగా ఉంటాయి గనుక ప్రజలకు ఉపయోగపడేందుకు ఈ ఆఫర్ తెచ్చినట్లు పేర్కొన్నారు.
సిటీలో ఎక్కడికైనా..
T24 టికెట్‌తో హైదరాబాద్ సిటీలో ఎక్కడికైనా 24 గంటల పాటు ప్రయాణించవచ్చు. సిటీ ఆర్డినరీ, మెట్రో ఎక్స్‌ప్రెస్, డీలక్స్ బస్సుల్లో ఈ టికెట్ వర్తిస్తుంది. పండుగల సమయంలో ఎక్కువమంది బయటకు వెళ్లడం లేదా బంధువులు, స్నేహితుల ఇంటికి వెళ్లడం లాంటివి చేస్తుంటారు. దీంతో ప్రయాణికులపై ఛార్జీల భారాన్ని తగ్గించేందుకు టీజీఎస్ఆర్టీసీ ఈ డిస్కౌంట్ ప్రకటించింది. దీని వల్ల ఆర్టీసీలో ఎక్కువమంది ప్రయాణిస్తారని అధికారులు అంచనా వేస్తున్నారు.




