AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

సీఎం కేసీఆర్ సంచలన నిర్ణయం.. ప్రభుత్వ ఉద్యోగులు, ప్రజాప్రతినిధుల జీతం నుంచి ఆ పథకానికి నిధులు..!

CM KCR on Telangana Green Fund: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంటోంది. రాష్ట్ర వ్యాప్తంగా అంతరించిపోతున్న వృక్ష సంపదను రక్షించేందుకు మరో ముందడుగు పడనుంది.

సీఎం కేసీఆర్ సంచలన నిర్ణయం.. ప్రభుత్వ ఉద్యోగులు, ప్రజాప్రతినిధుల జీతం నుంచి ఆ పథకానికి నిధులు..!
Cm Kcr In Assembly
Balaraju Goud
|

Updated on: Oct 01, 2021 | 6:10 PM

Share

Telangana Green Fund: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంటోంది. రాష్ట్ర వ్యాప్తంగా అంతరించిపోతున్న వృక్ష సంపదను రక్షించేందుకు మరో ముందడుగు పడనుంది. పచ్చదనంలో భాగంగా ఇప్పటికే విజ‌య‌వంతంగా కొన‌సాగుతోన్న హ‌రిత హారానికి తోడుగా తెలంగాణ హ‌రిత నిధి (తెలంగాణ గ్రీన్ ఫండ్‌) ప్రతిపాదననను శాస‌న‌స‌భ వేదికగా ముఖ్యమంత్రి కేసీఆర్ తీసుకువచ్చారు. నిరంత‌రంగా హ‌రిత ఉద్యమాన్ని కొన‌సాగించ‌డానికి ఈ ప్రతిపాద‌న‌ను ముందుకు తీసుకొచ్చామ‌ని సీఎం తెలిపారు. హ‌రిత‌హారంపై శాస‌న‌స‌భ‌లో స్వల్పకాలిక చ‌ర్చ చేప‌ట్టిన సంద‌ర్భంగా సీఎం కేసీఆర్ హ‌రిత నిధిపై కీలక ప్రక‌ట‌న చేశారు.

హ‌రిత నిధికి విరాళాలు అందించేందుకు ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు సైతం ముందుకు వస్తున్నారని. ప్రతి ఒక్కరూ తమ నెల జీతం నుంచి రూ. 100 ఇస్తామ‌ని ఒప్పుకున్నారని ముఖ్యమంత్రి తెలియజేశారు. న్యాక్ ద్వారా (ఆర్ అండ్ బీ) 0.1 శాతం ఇవ్వాల‌ని ప్రతిపాదిస్తున్నట్లు సీఎం కేసీఆర్ తెలిపారు. రాష్ట్రంలో ప‌ని చేసే ప్రభుత్వ ఉద్యోగులు కూడా ప్రతి నెల రూ. 25ల చొప్పున ఇచ్చేందుకు ముందుకొచ్చారన్నారు. అలాగే, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు ప్రతి నెల రూ. 500 హ‌రిత నిధికి ఇవ్వాల‌ని కోరామని. టీఆర్ఎస్ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అంగీక‌రించారు. మిగ‌తా ప్రజా ప్రతనిధులు సైతం పర్యావరణ పరిరక్షణకు తమ వంతు సాయంగా కొంత సొమ్మును ప్రతి నెల అందించాలని సీఎం కేసీఆర్ కోరారు.

అంతేకాకుండా లైసెన్సెస్ రెన్యూవ‌ల్ చేసే స‌మ‌యంలో వ్యాపారులు, బార్లు, మద్య దుకాణాలు ప్రతి ఒక్కరి నుంచి రూ. 1000 చొప్పున.. హ‌రిత నిధి కింద జ‌మ చేయాల‌ని కోరుతామన్నారు. అలాగే, భూముల అమ్మకాలు, కొనుగోలు చేసేట‌ప్పుడు ప్రతి రిజిస్ట్రేష‌న్‌కు హ‌రిత నిధి కింద రూ. 50 క‌లెక్ట్ చేయాల‌ని విజ్ఞప్తి చేశారు. విద్యార్థుల పాత్ర కూడా ఇందులో ఉండాల‌ని నిర్ణయించామని, విద్యార్థులు త‌మ పాఠ‌శాల‌లు, కాలేజీల్లో ప్రవేశాలు పొందే స‌మ‌యంలో.. స్కూల్ విద్యార్థులు రూ. 5, హైస్కూల్ విద్యార్థులు రూ. 15, ఇంట‌ర్ విద్యార్థులు రూ. 25, డిగ్రీ విద్యార్థులు రూ. 50, అదే విధంగా ప్రొఫెష‌న‌ల్ కోర్సులు చ‌దివే విద్యార్థులు రూ. 100 ఇస్తే హ‌రిత నిధికి తోడ్పాటు ఉంటుంద‌ని సీఎం కేసీఆర్ న్నారు. హ‌రిత‌హారం కార్యక్రమాన్ని యూఎన్‌వో గుర్తించి ప్రశంసించింది. ఈ గ్రీన్ ఫండ్ ఇత‌ర రాష్ట్రాల‌కు ఆద‌ర్శంగా నిలుస్తుంద‌ని అనుకుంటున్నామని, తెలంగాణ హ‌రిత నిధికి నిరంత‌రం నిధుల కూర్పు జ‌రిగితే అద్భుత ఫ‌లితాలు వ‌స్తాయ‌ని సీఎం కేసీఆర్ ఆశాభావం వ్యక్తం చేశారు.

ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ‘తెలంగాణకు హరితహారం’ కార్యక్రమానికి దేశీయ, అంతర్జాతీయంగా ఎంతో గుర్తింపు, ప్రశంసలు దక్కాయని అటవీ, పర్యావరణ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. హరితహార కార్యక్రమంపై అసెంబ్లీలో మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి మాట్లాడుతూ సీఎం కేసీఆర్ ఆలోచనల నుంచే ఉద్భవించిన మరో మానస పుత్రిక హరితహార కార్యక్రమమని అన్నారు. హరితహారం కార్యక్రమంలో 230 కోట్ల లక్షల మొక్కలు నాటాలని లక్ష్యంగా నిర్దేశించుకోగా, లక్ష్యాన్ని అధిగమించి 239 కోట్ల మొక్కలు నాటమని తెలిపారు. హరితహార కార్యక్రమానికి ఇప్పటివరకు రూ. 6555.97 కోట్లు వెచ్చించామన్నారు.

హరితహార కార్యక్రమం సత్ఫలితాలు ఇస్తుందని, తెలంగాణ రాష్ట్రమంతా 3.67 శాతం పచ్చదనం పెరిగిందని వెల్లడించారు. ఇదే ప్రణాళికతో ముందుకుసాగుతూ 33% శాతం అటవీకరణ సాధిస్తామని తెలిపారు. అడవులు, పల్లెల్లో, పట్టణాల్లో ఎక్కడ చూసినా పచ్చదనం కనపడుతుందని, అటవీ శాఖ మంత్రిగా తాను వ్యక్తిగతంగా ఎంతో గర్వపడుతున్నాను అని అన్నారు. కరోనా వైరస్ వల్ల ప్రజల్లో పర్యావరణం, ఆరోగ్యం అవగాహన పెరగడంతో మొక్కల నాటాలనే స్పృహ వచ్చిందని చెప్పారు. పట్టణ ప్రజలకు ఆహ్లాదకర వాతావరణం కల్పించేందుకు పట్టణ ప్రాంతాల్లో అర్బన్ లంగ్ స్పేస్ కోసం అర్బన్ ఫారెస్ట్ పార్కులను ఏర్పాటు చేసి, చుట్టూ ఫెన్సింగ్ ఏర్పాటు చేసి రక్షణ చర్యలు తీసుకుంటున్నామన్నారు.

Read Also….  ‎aha – OTT: ‘ఆహా’ కోసం వెబ్ సిరీస్ సిద్ధం చేసిన స‌క్సెస్‌ఫుల్ డైరెక్ట‌ర్ మారుతి… ‘త్రీ రోజెస్’ ఫస్ట్ పోస్ట‌ర్‌ విడుదల