Telangana Election: స్వతంత్ర అభ్యర్థి నామినేషన్ చూసి ఎన్నికల అధికారుల షాక్.. ఎందుకో తెలుసా..?
తెలంగాణ రాష్ట్రంలో నామినేషన్ల పర్వం చివరి దశకు చేరుకుంది. సాధారణంగా అభ్యర్థులు భారీ ర్యాలీలు హంగామాతో నామినేషన్లు వేస్తుంటారు. స్వతంత్ర అభ్యర్థులు కూడా తమ నామినేషన్ దాఖలు చేస్తుంటారు. కానీ నామినేషన్ దాఖలు చేసేందుకు వచ్చిన ఓ స్వతంత్ర అభ్యర్థిని చూసి ఎన్నికల అధికారులు షాక్ తిన్నారు.
తెలంగాణ రాష్ట్రంలో నామినేషన్ల పర్వం చివరి దశకు చేరుకుంది. సాధారణంగా అభ్యర్థులు భారీ ర్యాలీలు హంగామాతో నామినేషన్లు వేస్తుంటారు. స్వతంత్ర అభ్యర్థులు కూడా తమ నామినేషన్ దాఖలు చేస్తుంటారు. కానీ నామినేషన్ దాఖలు చేసేందుకు వచ్చిన ఓ స్వతంత్ర అభ్యర్థిని చూసి ఎన్నికల అధికారులు షాక్ తిన్నారు. స్వతంత్ర అభ్యర్థి పోటీకి విశేషమేంటి..? ఎన్నికల అధికారులు ఎందుకు అవాక్కయ్యారో తెలుసు కోవాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే..!
యాదాద్రి జిల్లా యాదగిరిగుట్ట మండలం గౌరాయిపల్లి గ్రామానికి చెందిన గుజ్జా రాంచంద్రా రెడ్డి సామాజిక కార్యకర్త. ప్రజాస్వామ్యం పట్ల ప్రజలకు అవగాహన కల్పిస్తూ చైతన్యవంతులు చేస్తూ ఉంటాడు. ప్రజాస్వామ్య ఔన్నత్యాన్ని ప్రజలకు తెలియజేసేందుకు ప్రతి ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తుంటారు. ఈ క్రమంలోనే రామచంద్రారెడ్డి ఆలేరు అసెంబ్లీ స్థానానికి స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు. స్వతంత్ర అభ్యర్థిగా ఆయన పోటీ చేయడంలో ఎలాంటి విశేషం కూడా లేదు.
అసెంబ్లీ ఎన్నికల్లో నామినేషన్ దాఖలు చేసేందుకు పదివేల రూపాయల డిపాజిట్ చెల్లించాల్సి ఉంటుంది. సాధారణంగా అభ్యర్థులు ఎవరైనా ఈ డిపాజిట్‌ను చెల్లిస్తుంటారు. కానీ ఈయన మాత్రం ప్రజల నుంచి ఒక్కో రూపాయి నాణెలను విరాళంగా సేకరించారు. ఇలా పదివేల నాణెలు పోగు చేసిన మూటతో నామినేషన్ వేసేందుకు రిటర్నింగ్ అధికారి కార్యాలయానికి వచ్చాడు. నాణెల మూటను చూసి ఎన్నికల అధికారులు ఒక్కసారిగా అవాక్కయ్యారు. పదివేల రూపాయల నాణాలను లెక్కించడానికి ఎన్నికల అధికారులకు రెండు గంటల సమయం పట్టింది.
రామచంద్రారెడ్డి ఇలా 2009 నుంచి ఇప్పటివరకు వరసగా నాలుగు సార్లు అసెంబ్లీ ఎన్నికల్లో నామినేషన్ దాఖలు చేశారు. ప్రతిసారి ప్రజల నుంచి విరాళంగా రూపాయి కాయిన్స్ సేకరించి డిపాజిట్ చెల్లిస్తుంటాడు. ప్రస్తుతం.. ప్రజాస్వామ్యం ధనస్వామ్యంగా మారిందని, ఇందులో ఓటర్లు పావులుగా మారారని రామచంద్రారెడ్డి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సేవా రంగంగా ఉండాల్సిన రాజకీయ రంగాన్ని పార్టీలు వ్యాపారంగా మార్చి వేశాయని ఆయన విమర్శించారు. ఓటుకు నోటు ప్రజాస్వామ్యానికి చేటని ఆయన అంటున్నారు. ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం ప్రజల నుంచి ఒక్కో రూపాయను విరాళంగా సేకరించి ఎన్నికల్లో డిపాజిట్ చెల్లిస్తుంటానని ఆయన తెలిపారు. ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం ఇక్కడి నుంచే శ్రీకారం చుట్టినట్లు తెలిపిన ఆయన. ఆలేరు నియోజకవర్గ నుంచే స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగుతున్నట్లు స్పష్టం చేశారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…