AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana Election: భగ్గుమంటున్న అసమ్మతి సెగలు.. ఇండిపెండెంట్‌ అభ్యర్థులుగా బరిలోకి అశావాహులు!

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నామినేషన్లకు సరిగ్గా ఒకరోజు ముందు కాంగ్రెస్‌, బీజేపీ చివరి జాబితాను విడుదల చేశాయి. దీంతో ఒక్కసారిగా క్షేత్రస్థాయిలో తీవ్ర అసంతృప్తి జ్వాలలు ఎగిసిపడుతున్నాయి. టికెట్ అశించి భంగపడ్డ నేతలు ఇండిపెండెంట్‌ అభ్యర్థులుగా బరిలో దిగేందుకు సిద్ధమవుతున్నారు.

Telangana Election: భగ్గుమంటున్న అసమ్మతి సెగలు.. ఇండిపెండెంట్‌ అభ్యర్థులుగా బరిలోకి అశావాహులు!
Brs, Bjp, Congress Party
Balaraju Goud
|

Updated on: Nov 10, 2023 | 11:52 AM

Share

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నామినేషన్లకు సరిగ్గా ఒకరోజు ముందు కాంగ్రెస్‌, బీజేపీ చివరి జాబితాను విడుదల చేశాయి. దీంతో ఒక్కసారిగా క్షేత్రస్థాయిలో తీవ్ర అసంతృప్తి జ్వాలలు ఎగిసిపడుతున్నాయి. టికెట్ అశించి భంగపడ్డ నేతలు ఇండిపెండెంట్‌ అభ్యర్థులుగా బరిలో దిగేందుకు సిద్ధమవుతున్నారు.

నామినేషన్లకు గడువు ముగుస్తుండటంతో మిర్యాలగూడ, సూర్యాపేట, చార్మినార్‌, తుంగతుర్తి, పటాన్‌చెరు స్థానాలకు గురువారం రాత్రి కాంగ్రెస్ అధిష్ఠానం అభ్యర్థులను ఖరారు చేసింది. అయితే అంతకుముందే ఆశావహులు ఎవరికి వారు నామినేషన్లు వేయడంతో కార్యకర్తల్లో గందరగోళం నెలకొంది. సూర్యాపేట నుంచి మాజీ మంత్రి రాంరెడ్డి దామోదర్‌రెడ్డి, పటేల్‌ రమేశ్‌రెడ్డి నామినేషన్లు వేశారు. సూర్యాపేట టికెట్‌ వ్యవహారం కాంగ్రెస్‌కు తలనొప్పిగా మారింది.

సూర్యాపేట కాంగ్రెస్‌లో ముదిరిన ముసలం

సూర్యాపేట టికెట్ కేటాయించకపోవడంతో రమేష్ రెడ్డి వర్గం తీవ్ర ఆగ్రహంతో ఉంది. ఈ నేపథ్యంలోనే కీలక వ్యాఖ్యలు చేశారు పటేల్ రమేష్ రెడ్డి. కార్యకర్తలు, అనుచరుల ఒత్తిడి మేరకు ఇండిపెండెంట్‌గా బరిలో ఉంటున్నట్లు ప్రకటించారు. టికెట్ కేటాయింపులో అన్యాయం జరిగిందని, కుట్ర పూరితంగా టికెట్ రాలేదని ఆవేదన వ్యక్తం చేశారు. మంత్రిని గెలిపించాలనే లక్ష్యంగా కాంగ్రెస్ నేతలే, టికెట్ రాకుండా చేశారని రమేష్ రెడ్డి ఆరోపించారు. ఇంట్లో కూర్చుంటే గెలిచే పరిస్థితి ఉన్నా టికెట్ రావడంలేదన్న ఆయన, రాజకీయంగా బలపడటం ఇష్టంలేక అడ్డుకున్నారని మండిపడ్డారు. కుట్ర వెనకాల ఎవరి హస్తం ఉందో త్వరలో వెల్లడిస్తానన్నారు. రెండు రోజుల్లో భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తానని తెలిపారు పటేల్ రమేష్ రెడ్డి.

ఆసక్తికరంగా మారిన పటాన్‌చెరు రాజకీయం..

ఇక పటాన్‌చెరులో ఇప్పటికే అభ్యర్థిగా ప్రకటించిన నీలం మధు ముదిరాజ్‌ను కాదని కాట శ్రీనివాస్‌గౌడ్‌కు టికెట్‌ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ. కాటాకు టికెట్ ఇవ్వాల్సిందేనంటూ మాజీ ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ వర్గీయులు పెద్ద ఎత్తున ఆందోళన చేయడంతో అధిష్టానం వెనక్కు తగ్గింది. నీలం మధుకు మద్దతుగా సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి నిలిచినా, అధిష్టానం చివరి క్షణంలో మనసు మార్చుకుంది. దీంతో కాంగ్రెస్ పార్టీ తీరుపై నీలం మధు వర్గం తీవ్రస్థాయిలో అసహనం వ్యక్తం చేసింది. అధిష్టానం ఆగ్రహంతో అర్ధరాత్రి సోనియా, రాహుల్ గాంధీ దిష్టిబొమ్మల దహనం చేశారు నీలం మధు అనుచరులు. ఈ నేపథ్యంలోనే స్వతంత్ర అభ్యర్థిగా బరిలో దిగుతున్నట్లు నీలం మధు ప్రకటించారు. ఇవాళ పోటాపోటీగా నామినేషన్లు వేసేందుకు సిద్ధమవుతున్నారు కాటా శ్రీనివాస్ గౌడ్, నీలం మధు. దీంతో పటాన్ చెరులో టెన్షన్ వాతావరణం నెలకొంది.

వేములవాడ కమలం పార్టీలో వీడని టికెట్ మిస్టరీ!

ఇక భారతీయ జనతా పార్టీలో అదే తంతూ కొనసాగుతోంది. వేములవాడలో మహారాష్ట్ర మాజీ గవర్నర్ విద్యాసాగర్ రావు తనయుడు వికాస్ రావు టికెట్ వస్తుందని అంతా ఊహించారు. పెద్దగా ఇబ్బంది ఉండకపోవచ్చనే చర్చ సాగింది. కానీ ఈటెల రాజేందర్ తన అనుచరులు తుల ఉమకు టికెట్ ఇవ్వాలని పట్టుబట్టారు. దీంతో చివరి నిమిషంలో తుల ఉమకు టికెట్ కేటాయించి బీజేపీ అధిష్టానం. వికాస్ రావుకు టికెట్ ఇవ్వకపోవడంతో ఆయన అనుచరులు హైకమాండ్ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అభ్యర్థిని మార్చాలని హైదరాబాద్ పార్టీ కార్యాలయంలో ఆందోళనకు దిగారు. పార్టీ తీరుపై కినుక వహించిన వికాస్ రావు, ఇవాళ వేములవాడలో ఇండిపెండెంట్ అభ్యర్థిగా నామినేషన్ వేసేందుకు సిద్ధమవుతున్నారు. మరోవైపు ఈ రోజే తుల ఉమా సైతం బీజేపీ తరుఫున నామినేషన్ వేసేందుకు రెఢి అయ్యారు. అయితే పార్టీ మాత్రం బి ఫామ్ ఎవరికి ఇవ్వకుండా పెండింగ్‌లో పెట్టింది. దీంతో వేములవాడలో హైటెన్షన్ కొనసాగుతూనే ఉంది.

ఇండిపెండెంట్‌గా నామినేషన్ వేయనున్న జలగం

అటు అధికార పార్టీ బీఆర్ఎస్‌లోనూ అసమ్మతి సెగలు బయటపడుతున్నాయి. బీఆర్ఎస్ టికెట్ అశించి భంగపడ్డ జలగం వెంకటరావు భద్రాద్రి జిల్లా కొత్తగూడెం నియోజకవర్గం నుంచి మరోసారి ఎన్నికల బరిలోకి దిగేందుకు సిద్ధం అయ్యారు. ఈసారి ఇండిపెండెంట్‌గానే తన అదృష్ట్యాన్ని పరీక్షించుకోనున్నారు. ఇవాళ నామినేషన్‌ దాఖలు చేసేందుకు రెఢి అయ్యారు. మాజీ ముఖ్యమంత్రి జలగం వెంగళరావు చిన్న కుమారుడే ఈ జలగం వెంకటరావు. 2004లో తొలిసారిగా ఖమ్మం సత్తుపల్లి నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ తరపున విజయం సాధించారు. ఆ తర్వాత 2014 ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ తరపున పోటీ చేసి కొత్తగూడెం ఎమ్మెల్యేగా గెలుపొందారు. అప్పట్లో టీఆర్‌ఎస్‌ తరఫున ఉమ్మడి ఖమ్మం జిల్లా నుంచి గెలిచిన ఏకైక ఎమ్మెల్యే ఆయనే కావడం విశేషం. కానీ, ఆ తర్వాత రాజకీయ పరిస్థితులు మారడంతో.. ఆయన బీఆర్ఎస్‌ నుంచి టికెట్‌ దక్కలేదు. దీంతో.. ఇండిపెండెంట్‌గా బరిలోకి దిగేందుకు సిద్ధం అయ్యారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…