Siddipet: 3 రోజుల క్రితం పాడుబడిన వ్యవసాయ బావిలో పడిన వృద్దుడు.. అరుపులు వినపడడంతో
సిద్దిపేట రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని చిన్న గుండవెల్లి గ్రామ శివారులో ఉన్న పాడుబడిన వ్యవసాయ బావిలో గత మూడు రోజుల క్రితం...
సిద్దిపేట రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని చిన్న గుండవెల్లి గ్రామ శివారులో ఉన్న పాడుబడిన వ్యవసాయ బావిలో గత మూడు రోజుల క్రితం సిద్దిపేట పట్టణం బారా ఇమామ్ కాలనీకి చెందిన పైసా లచ్చయ్య ప్రమాదవశాత్తూ పడిపోయాడు. కూలి పనుల చేస్తూ జీవనం సాగించే లచ్చయ్య వయసు 80 సంవత్సరాలు. పనుల కోసం వెళ్తుండగా అదుపుతప్పి కాలుజారి బావిలో పడిపోయాడు. శుక్రవారం ఉదయం వ్యవసాయ పొలం బావిలో నుండి అరుపులు వినపడటంతో పొరుగు రైతు వెళ్లి చూడగా లచ్చయ్య కనిపించాడు. వెంటనే సిద్దిపేట రూరల్ పోలీసులకు ఫోన్ చేయగా… రూరల్ ఎస్ఐ శంకర్, కానిస్టేబుల్ నర్సింహులు,హోంగార్డ్స్ సయ్యద్, మల్లేశం, ఫైర్ డిపార్ట్మెంట్ వారి సహాయంతో వ్యవసాయ బావిలోకి దిగి తాళ్ళు కట్టి అతనిని సురక్షితంగా పైకి లాగి రక్షించారు. వెంటనే 108 అంబులెన్స్ లో సిద్దిపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స చేయించారు. ప్రస్తుతం అతని ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని డాక్టర్లు తెలిపారు. ఈ విషయాన్ని వారి బంధువులకు తెలపగా వారు ఆస్పత్రికి వచ్చి.. మూడు రోజుల నుంచి లచ్చయ్య కనబడటం లేదని.. పలు చోట్ల వెతుకుతున్నామని తెలిపారు. బావిలో పడిన తన తండ్రిని సురక్షితంగా బయటకు తీసి రక్షించినందుకు సిద్దిపేట రూరల్ పోలీసులకు, ఫైర్ డిపార్ట్మెంట్ వారికి పైసా లచ్చయ్య కుమారుడు నారాయణ కృతజ్ఞతలు తెలిపారు. కాగా బావిలో నీరు లేకపోవడంతో లచ్చయ్య గాయాలతో బయటపడ్డాడు. నీరు, ఆహారం లేకపోయినప్పటికీ వృద్దుడు విధిని ఓడించి గెలిచాడు.