Donkey Milk: గాడిద పేరు చెప్పి రూ. 100 కోట్లు కొట్టేశారు.. దిమ్మతిరిగే షాక్‌..

డబ్బు కోసం నేరగాళ్లు రకరకాల మార్గాలను ఎంచుకుంటున్నారు. ఒకప్పడిలా దోపిడిలు కాకుండా ప్రొఫెషనల్‌గా డబ్బులు కాజేస్తున్నారు. ప్రజల్లో అత్యాశను ఆసరగా చేసుకొని నిండా ముంచేస్తున్నారు. తాజాగా ఇలాంటి ఓ మోసమే వెలుగులోకి వచ్చింది. గాడిదల పేరుతో వ్యాపారం అంటూ ఏకంగా రూ. 100 కోట్లే నొక్కేశారు..

Donkey Milk: గాడిద పేరు చెప్పి రూ. 100 కోట్లు కొట్టేశారు.. దిమ్మతిరిగే షాక్‌..
The Donkey Palace
Follow us
Narender Vaitla

|

Updated on: Nov 16, 2024 | 8:12 AM

సమాజంలో రోజురోజుకీ మోసాలు పెరిగిపోతూనే ఉన్నాయి. ఈజీ మనీ కోసం కొంగొత్త మార్గాలను ఎంచుకుంటున్నారు. తాజాగా తమిళనాడుకు చెందిన ఓ సంస్థ ఇలాంటి మోసానికే పాల్పడింది. గాడిదల పెంపకం పేరుతో ఏకంగా రూ. 100 కోట్లేశారు. దీంతో ఇప్పుడీ అంశం మూడు రాష్ట్రాల్లో చర్చగా మారింది. ఇంతకీ ఏం జరిగిందో తెలియాలంటే ఈ స్టోరీలోకి వెళ్లాల్సిందే..

ప్రస్తుతం గాడిద పాల వ్యాపారం బాగా జరుగుతోంది. గాడిద పాలను రకరకాల మందుల్లో, కాస్మొటిక్‌ తయారీలో ఉపయోగిస్తుండడంతో వీటికి మార్కెట్లో డిమాండ్ పెరిగింది. దీంతో చాలా మంది ఔత్సాహికులు గాడిదలను పెంచుతూ లాభాలను ఆర్జిస్తున్నారు. ఇదిగో దీనిని పెట్టుబడిగా పెట్టి తమిళనాడుకు చెందిన ఓ సంస్థ మోసానికి పాల్పడింది. తమిళనాడు రాష్ట్రం తిరునల్వేలి జిల్లా ముక్కడల్ గ్రామంలో డాంకీ ప్యాలస్‌ పేరుతో ఓ సంస్థను ఏర్పాటు చేశారు.

గాడిదలను పెంచుతూ, పాల వ్యాపారం చేస్తారు. అయితే ఫ్రాంచైజీలను ఇస్తున్నామని, తామే గాడిదలను ఇచ్చి పాలను సేకరిస్తామని యూట్యూబ్‌లో పెద్ద ఎత్తున ప్రచారం చేపట్టారు. దీంతో ఆకర్షితులైన కొందరు రైతులు పెట్టుబడి పెట్టారు. ఫ్రాంచైజీ కోసం రూ. 5 నుంచి రూ. 6 లక్షల వరకు పెట్టుబడి పెట్టారు. గుజరాత్‌ నుంచి గాడిదలను తెప్పించేందుకు అదనంగా మరింత వసూలు చేశారు. ఆ తర్వాత లీటర్ గాడిదల పాలకు రూ. 1600 ఇస్తామని డాంకీ ప్యాలెస్‌ ప్రతినిధులు నమ్మించారు.

చెప్పిన విధంగానే ప్రారంభంలో కొంతమందికి సక్రమంగానే డబ్బులు ఇచ్చారు. ఇక ఆ తర్వాతే అసలు కథ మొదలైంది. డబ్బులు చెల్లించకుండా ఇబ్బందులు పెట్టడం ప్రారంభించారు. నిలదీసిన రైతులను బెదిరించారు. తమకు రాజకీయంగా పలుకుబడి ఉందంటూ చంపేస్తామని బెదిరించారు. మూడు రాష్ట్రాలకు చెందిన సుమారు 400 మందికిపైగా ఇందులో పెట్టుబడి పెట్టారు. సుమారు ఒక్కొక్కరి నుంచి రూ. 20 లక్షల వరకు వసూలు చేశారు. ఇలా ఏకంగా రూ. 100 కోట్ల వరకు రాబట్టారు.

ఎంతకు డబ్బులు చెల్లించకపోవడంతో మోసపోయామని తెలుసుకున్నా రైతులు లబోదిబోమంటున్నారు. కొంతమంది బాధితులు శుక్రవారం హైదరాబాద్‌లోని సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో విలేకరుల సమావేశంలో తాము మోసపోయిన విధానాన్ని చెప్పుకొచ్చారు. తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు రేవంత్‌రెడ్డి, చంద్రబాబు, తమిళనాడు సీఎం స్టాలిన్‌లు తమకు న్యాయం చేయాలని బాధితులు కోరారు. మరి డాంకీ ప్యాలెస్‌పై ప్రభుత్వాలు ఎలాంటి చర్యలు తీసుకుంటాయో చూడాలి.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి..