AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

New Scam: అమాయక ప్రజలే వారి టార్గెట్‌.. ఖరీదైన, గిఫ్ట్‌లు, లాటరీ పేరుతో టోకరా.. ఆటో డ్రైవర్‌ నుంచి ఏకంగా..

సాధారణంగా సైబర్ నేరగాళ్లు బాగా డబ్బులున్న వారిని, ధనవంతులనే టార్గెట్ చేస్తారనే అపోహ ఉంది. కానీ నిరుపేదల ఆశలు, అమాయకత్వాన్నీ ఆసరాగా చేసుకుని బహుమతులంటూ సైబర్ కేటుగాళ్లు టోకరా వేస్తున్నారు. బంగారం, ఐఫోన్ వంటి గిఫ్ట్ ప్యాక్ పేరుతో ఎరవేసి పేదల డబ్బులను కేటుగాళ్లు కొట్టేస్తున్నారు. అమాయకుల ఆశల పునాదులపై కేటుగాళ్ళు మోసపు సౌదాలు నిర్మించుకుని సొమ్ము చేసుకుంటున్నారు. బంగారం, ఐఫోన్ వంటి బహుమతుల ఆశ చూపడంతో సైబర్ కేటుగాళ్ల వలలో చిక్కి ఉన్నదంతా పోగొట్టుకోవడమే కాకుండా అప్పుల పాలవుతున్నారు

New Scam: అమాయక ప్రజలే వారి టార్గెట్‌.. ఖరీదైన, గిఫ్ట్‌లు, లాటరీ పేరుతో టోకరా.. ఆటో డ్రైవర్‌ నుంచి ఏకంగా..
News Sam
M Revan Reddy
| Edited By: Anand T|

Updated on: Jul 11, 2025 | 6:29 PM

Share

మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ మండలం మన్నెగూడ సమీపంలోని సీత్ల తండాకు చెందిన అంగోతు లచ్చు ఉపాధి కోసం సూర్యాపేటకు పదేళ్ల క్రితం వచ్చాడు. సూర్యాపేటలోని చర్చి కాంపౌండ్‌లో ఆటో నడుపుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ఈ ఏడాది మే 19న అమెరికా నుంచి మాట్లాడుతున్నానని చెప్పుకున్న ఓ మహిళ లచ్చు నాయక్‌కు ఫోన్ చేసింది. చర్చికి వెళ్లే అలవాటున్న లచ్చు కుటుంబానికి తమ మిషనరీ తరపున “బహుమానం” పంపిస్తున్నామని నమ్మబలికింది. కలలో కూడా ఊహించని బహుమతి వస్తుందని తెలవడంతో లచ్చు ఆశలకు రెక్కలొచ్చాయి. బహుమతి వస్తుందని సంబురపడుతుండగానే మరుసటి రోజు, ఢిల్లీ నుంచి మాట్లాడుతున్నామని అమెరికా నుంచి వచ్చిన బహుమానం పొందాలంటే ఎయిర్‌పోర్టులో రూ. 20 వేలు చెల్లించాలని బ్యాంక్ అకౌంట్ నెంబర్‌ను మరో కేటుగాడు ఇచ్చాడు. దీంతో ఇది నిజమేనని నమ్మిన లచ్చు .. ఉన్న కొద్దిపాటి డబ్బును వారి ఖాతాలో వేశాడు. లచ్చు తమ వలలో చిక్కాడని భావించిన సైబర్ గ్యాంగ్ ఆ తర్వాత అసలు నాటకం మొదలైట్టారు.

గిఫ్ట్ ప్యాక్‌లో ఏకంగా రూ. కోటి విలువైన డాలర్లు ఉన్నాయని, వాటిని భారత కరెన్సీలోకి మార్చాలంటే రూ. లక్ష ఖర్చవుతుందని చెప్పారు. కోటి రూపాయల విలువైన డాలర్లు వస్తున్నాయనే ఆశతో లచ్చు అప్పు చేసి మరి ఆ లక్ష రూపాయలనూ మోసగాళ్ల ఖాతాలో జమ చేశాడు. కానీ ఇక్కడితో ఆ గ్యాంగ్ ఆగకుండా జూన్ 4న మరోసారి ఫోన్ చేసి గిఫ్ట్ ప్యాక్‌కు ఇన్‌కమ్ ట్యాక్స్, బీమా చెల్లించాలని దీనికి రూ. 3.35 లక్షలు అవుతుందని నమ్మించారు. కోటి డాలర్ల ముందు ఇదెంత అనుకోని ఏమీ ఆలోచించకుండా లచ్చు కుటుంబం సమీప బంధువుల బంగారు నగలను తాకట్టు పెట్టి మరీ ఆ మొత్తాన్ని వారి ఖాతాలో వేశాడు. మొత్తంగా రూ. 4.45 లక్షల రూపాయలు పోగొట్టుకున్నాడు.

ఇంత డబ్బు దోచినా ఆ నేరగాళ్ళ ఆశ చావలేదు ఇంకా దోచుకోవాలనే ఆశతో గత జూన్ 5న మరో రూ. 10 లక్షలు కావాలని సైబర్ కేటుగాళ్లు ఫోన్ చేయడంతో లచ్చుకు అనుమానం వచ్చింది. అప్పటివరకు తన బహుమతి సంగతి ఎవ్వరికీ చెప్పని లచ్చు 10 లక్షలు అడిగిన పిదప మోసపోయానని గ్రహించి ఇరుగు పొరుగు వారికి విషయం చెప్పాడు. వెంటనే జూన్ 7న సైబర్ సెల్ నంబర్ 1930కు ఫిర్యాదు చేశాడు. సైబర్ సెల్ సిబ్బంది వెంటనే స్పందించి డబ్బు జమయిన ఖాతాను ట్రాక్ చేసి రూ. 70 వేలను హోల్డ్ చేశారు. ఇది కొంత ఊరటనిచ్చే విషయమైనా మిగిలిన మొత్తాన్ని రికవరీ చేయడం సవాల్ గా మారనుంది.

అయితే లచ్చు ఆధార్ కార్డులో మహబూబాబాద్ జిల్లా చిరునామా ఉండటంతో, అక్కడే కేసు పెట్టాలని సూర్యాపేట జిల్లా పోలీసులు సూచించడంతో బాధితుడు మరింత గందరగోళానికి లోనైయ్యాడు. ఇరు జిల్లాల పోలీసుల కోసం తిరగలేక విసిగివేసారిన లచ్చు సూర్యాపేట జిల్లా ఎస్పీ నరసింహను కలిశాడు. ఎస్పీ సూచన మేరకు పట్టణ ఠాణాలో ఫిర్యాదు నమోదు చేయబడింది.

సైబర్ నేరగాళ్లు ఎంతటి టెక్నాలజీ పరిజ్ఞానం లేని నిరుపేదలనైనా ఎలా లక్ష్యంగా చేసుకుంటున్నారో ఈ సంఘటన హెచ్చరిక చేస్తుంది. బహుమతులు, లాటరీల పేరుతో వచ్చే అపరిచిత ఫోన్ కాల్స్, మెసేజ్‌ల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ తమ వ్యక్తిగత ఆర్థిక వివరాలను అపరిచితులతో పంచుకోకూడదు. డబ్బులు కోరితే అసలు నమ్మకుండా పోలీసులకు ఫిర్యాదు చేయాలి. ఎవరైనా సైబర్ నేరానికి గురైతే వెంటనే 1930 నంబర్‌కు లేదా సైబర్ క్రైమ్ పోర్టల్ www.cybercrime.gov.in ద్వారా ఫిర్యాదు చేయాలని పోలీసులు కోరుతున్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.