Khammam: 30రోజుల్లో 10వేల కిలోమీటర్లు.. బైక్‌పై ఖమ్మం యువకుడి ఆధ్యాత్మిక యాత్ర
ప్రస్తుత ఆధునిక యుగంలో పుణ్యక్షేత్రాలపై అందరికీ అవగాహన కల్పించాలని ఖమ్మం జిల్లాకు చెందిన ఓ యువకుడు సాహస యాత్ర చేశాడు. బుల్లెట్ బైక్‌పై 30రోజుల్లో 10వేల కిలోమీటర్ల యాత్ర చేశాడు. ఈ సాహస యాత్రలో 16 రాష్ట్రాల్లోని ఆలయాలు తిరిగి.. ఎన్నో విషయాలు తెలుసుకున్నట్లు ఆ యువకుడు చెబుతున్నాడు.
యువతకు పుణ్య క్షేత్రాలపై అవగాహన పెంచడం, మన పూర్వీకుల గొప్పతనం తెలుసుకోవడంతో పాటు యువతకు తెలియజేయాలని ఓ యువకుడు నిశ్చయించుకున్నాడు. అనుకున్న ఆలస్యం వెంటనే యాత్రకు శ్రీకారం చుట్టాడు. పదివేల కిలోమీటర్ల ఆధ్యాత్మిక యాత్రను బుల్లెట్ బైకుపై 30 రోజుల్లో పూర్తి చేశాడు. యువతకు దేశంలోని పుణ్యక్షేత్రాలపై అవగాహన పెంచాలనే ఉద్దేశంతో బడా చార్ ధామ్ యాత్ర పూర్తి చేశాడు.
బుల్లెట్ బండిపై ఆధ్యాత్మిక యాత్రను ఖమ్మం జిల్లా సత్తుపల్లికి చెందిన యువ పురోహితుడు ఉప్పల ప్రవీణ్ కుమార్ శాస్త్రి పూర్తి చేశాడు. కేదార్‌నాథ్, బద్రీనాథ్, యమునోత్రి, గంగోత్రి, రామేశ్వరం జ్యోతిర్లింగం, శక్తి పీఠాలను దర్శనం చేసుకుంటూ 10 వేల కిలోమీటర్లతో యాత్రను విజయవంతంగా పూర్తి చేశారు. 16 రాష్ట్రాలను చుట్టి, మహా పుణ్య క్షేత్రాలను దర్శించుకుని, పంచ భూతాల సాక్షిగా ముడిపడిన ప్రకృతి రమణీయ దృశ్యాలను ఆస్వాదిస్తూ తన్మయత్వం పొందానని ప్రవీణ్ శాస్త్రి తెలిపాడు. ఆధ్యాత్మిక యాత్రను బుల్లెట్‌పై తిరిగి క్షేమంగా సత్తుపల్లి కి చేరుకోవడంతో స్థానికులు అభినందనలు తెలిపారు.
