Khammam: అమ్మ చెంతన రాత్రి డాబాపై పడుకున్న చిన్నారి.. తెల్లారేసరికి విగతజీవి..
ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలంలో విషాదం చోటుచేసుకుంది. ఇంట్లో నిద్రిస్తున్న ఐదేళ్ల చిన్నారి, ఆమె తల్లిని కట్లపాము కాటేసింది. చికిత్స పొందుతూ చిన్నారి మృతి చెందగా, తల్లి పరిస్థితి విషమంగా మారింది. వర్షాకాలంలో పాములు ఇళ్లలోకి చొరబడే ఘటనలు పెరుగుతున్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వైద్యులు హెచ్చరిస్తున్నారు.

వినాయకచవితి రోజు… ఆటపాటలతో సందడి చేసిన చిన్నారి.. రాత్రి పడుకుని… ఆ నిద్రలోనే ఈ లోకాన్ని వీడింది. మాయదారి కట్ల పాము బాలిక ప్రాణాన్ని బలిగొంది. ఈ చిట్టితల్లి ఒక్కసారిగా పాము కాటు బారిన పడి బలి కావడంతో ఆ కుటుంబంలోనే కాదు.. గ్రామమంతా విషాదం అలుముకుంది.
ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలం చిన్నపాకలగూడెం గ్రామంలో జరిగిన ఈ ఘటన అందరినీ కలచివేసింది. గోపి–మౌనిక దంపతులు తమ పిల్లలతో కలిసి ఇంటి మేడపై నిద్రిస్తుండగా తెల్లవారుజామున ఇంట్లోకి చొరబడ్డ కట్లపాము, మౌనికతో పాటు ఆమె ఏడేళ్ల చిన్నారి లోహితకు కాటు వేసింది. వెంటనే అప్రమత్తమైన తండ్రి పామును చంపి తల్లి–కూతురిని సత్తుపల్లి ప్రభుత్వాసుపత్రికి తరలించాడు. కానీ చిన్నారి చికిత్స పొందుతూ కన్నుమూసింది. తల్లి మౌనిక పరిస్థితి విషమంగా ఉండటంతో ఖమ్మం ఆసుపత్రికి తరలించారు. ఐదేళ్ల చిన్నారి అకాల మరణం గ్రామాన్ని విషాదంలో ముంచేసింది.
ప్రస్తుతం వర్షాకాలం కావడంతో పాములు ఇళ్లలోకి చొరబడుతున్న ఘటనలు ఎక్కువగా జరుగుతున్నాయి. ముఖ్యంగా కట్లపాము రాత్రి సమయంలో నిశ్శబ్దంగా దాడి చేసి ప్రాణాంతకం అవుతుంది. కాబట్టి ఈ సీజన్‌లో ఇంటి చుట్టుపక్కల పొదలు, చెత్త దిబ్బలు శుభ్రంగా ఉంచాలి. నేలపై నిద్రించడం తగ్గించుకోవాలి.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి.




