SLBC Tunnel Rescue Operation: ఆఖరి పోరాటం.. సిల్‌క్యారా టు శ్రీశైలం.. సొరంగాలు.. విషాదాలు..
శ్రీశైలం డ్యామ్ దగ్గర ఎస్ఎల్‌బీసీ టన్నెల్.. అప్పటిదాకా ఆగిన నిర్మాణ పనులు మొదలై నాలుగైదు రోజులే ఐంది. ఇన్‌లెట్ 13 కిలోమీటర్ల మార్క్ దగ్గర 22వ తేదీ శనివారం ఉదయం సొరంగం పైనుంచి కుంగుబాటుకు గురైంది. ఒక్కసారిగా నీళ్లు బురద చిమ్మడం మొదలవడంతో లోపలున్న 60 మందిలో 52 మంది ప్రాణాలు అరచేత బట్టుకుని పరుగెత్తుకుంటూ బైటికొచ్చారు. ఎనిమిది మంది మాత్రం బైటపడే మార్గం లేక లోపలుండిపోయారు. ఇదీ జరిగింది.

2023 నవంబర్ ఆఖరివారం.. దేశం గర్వించిన ఒక సాహసోపేత గెలుపు కథ అది.. గుర్తుందా..? 400 గంటల పాటు శ్రమించి.. 57 మీటర్ల లోపల రెస్క్యూ ఆపరేషన్‌తో 41 మంది జీవితాల్లో ఆఖరిశ్వాసల్ని ఊదిన వీరోచిత పోరాటం గాధ అది. ఉత్తర కాశీలోని సిల్‌క్యారా బెండ్-బార్‌కోట్ టన్నెల్ కుప్పకూలి.. అందులో చిక్కుకున్న 41 మంది కార్మికుల ప్రాణాలు గాల్లో దీపాలయ్యాయి. వాళ్లను క్షేమంగా ప్రాణాలతో బైటికి తీసుకురావడానికి 17 రోజుల పాటు జరిగిన ‘ఆపరేషన్ జిందగీ’ సుఖాంతమైంది. నేషనల్, స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ టీమ్స్. ఉత్తరాఖండ్ పోలీసులు, ఇండియన్ ఆర్మీ కోర్ ఆఫ్ ఇంజనీర్స్.. వీళ్లంతా సరిపోక.. ఆస్ట్రేలియా నుంచి ఆర్నాల్డ్ డిక్స్, క్రిస్ కూపర్ లాంటి టన్నెలింగ్ ఎక్స్‌పర్ట్స్‌ను రంగంలో దింపారు. ప్రధాన సొరంగానికి సమాంతరంగా మూడు ప్రత్యామ్నాయ సొరంగాల్ని తవ్వి.. అందులోంచి మూడు పైపులు వేసి ఆహారం, ఆక్సిజన్, ఎండోస్కోపిక్ కెమెరా పంపి.. తాత్కాలికంగా కార్మికుల ప్రాణాల్ని నిలిపారు. ఎమర్జెన్సీ టైమ్‌లో ఉపయోగపడే ఎస్కేప్ పైప్ వర్కవుట్ కాకపోవడం.. ఢిల్లీ నుంచి 25 టన్నుల బరువైన హారిజాంటల్ అగర్ డ్రిల్లింగ్ మెషీన్‌ను రప్పించడం.. అదీ రెండుసార్లు చెడిపోవడం.. ఇవన్నీ చూసి యంత్రాలతో పని కాదనుకుని.. నిఖార్సయిన మానవ ప్రయత్నాన్నే నమ్ముకున్నారు. దాని పేరే ర్యాట్ హోల్ మైనింగ్. సుత్తి, ఉలి సాయంతో తవ్వుకుంటూ వెళ్లి, ఒక్క మనిషి మాత్రమే వెళ్లగలిగే గుంతలు తవ్వి.. వాటినుంచి లోపలికి ఒక పైపును చొప్పించి.. దాన్ని...




