Mee Seva: 10 రోజులుగా తెలంగాణలో పలుచోట్ల స్తంభించిన ‘మీ’ సేవలు.. కారణం ఇదేనట
రాష్ట్రవ్యాప్తంగా మీసేవ కేంద్రాల్లో పది రోజులుగా సేవలు స్తంభించిపోయాయి. దీంతో ఉన్నత విద్యా కోర్సుల్లో ప్రవేశాలు, ఉద్యోగాల కోసం దరఖాస్తు చేయాల్సిన వారికి సకాలంలో సర్టిఫికెట్లు లభించక తీవ్రంగా నష్టపోతున్నారు. రాష్ట్ర డాటా సెంటర్‌లో సాంకేతిక సమస్య కారణంగా ఈ పరిస్థితి తలెత్తిందని అధికారులు చెప్తున్నారు. డిజిటల్ తెలంగాణలో భాగంగా వివిధ రకాల ప్రభుత్వ సేవలను మీసేవ, ఈసేవ కేంద్రాల ద్వారా..
హైదరాబాద్, సెప్టెంబర్ 20: రాష్ట్రవ్యాప్తంగా మీసేవ కేంద్రాల్లో పది రోజులుగా సేవలు స్తంభించిపోయాయి. దీంతో ఉన్నత విద్యా కోర్సుల్లో ప్రవేశాలు, ఉద్యోగాల కోసం దరఖాస్తు చేయాల్సిన వారికి సకాలంలో సర్టిఫికెట్లు లభించక తీవ్రంగా నష్టపోతున్నారు. రాష్ట్ర డాటా సెంటర్‌లో సాంకేతిక సమస్య కారణంగా ఈ పరిస్థితి తలెత్తిందని అధికారులు చెప్తున్నారు. డిజిటల్ తెలంగాణలో భాగంగా వివిధ రకాల ప్రభుత్వ సేవలను మీసేవ, ఈసేవ కేంద్రాల ద్వారా ప్రభుత్వం అందిస్తున్నది. 38 ప్రభుత్వ శాఖలకు చెందిన 200 వరకు సేవలు 2,856 మీసేవ కేంద్రాల ద్వారా అందుబాటులో ఉన్నాయి. ఇందులో రెవెన్యూశాఖ నుంచి విద్యార్థులు, ఉద్యోగార్థులు పొందాల్సిన కులం, ఆదాయం, ఈడబ్ల్యూఎస్ తదితర సర్టిఫికెట్లు అతి ప్రధానమైనవి.
ప్రస్తుతం పీజీ కోర్సుల్లో ప్రవేశాల కోసం ఎంట్రన్స్ ఎగ్జామ్స్ జరుగుతున్నాయి. డిగ్రీ పూర్తిచేసినవారు వివిధ ప్రవేశ పరీక్షలకు హాజరు కావాలన్నా, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాలతోపాటు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునేందుకు ఇవి ఎంతో అవసరం. ఆర్‌ఆర్‌బీ, స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నుంచి వెలువడే పలు నోటిఫికేషన్లు, వివిధ కేంద్ర ప్రభుత్వ సంస్థల అప్రెంటిషిప్ గడువు కూడా ఈ మధ్యనే ముగిసింది. కులం, ఆదా యం తదితర సర్టిఫికెట్లతో దరఖాస్తు చేసుకుంటే వారికి ఫీజుల్లో రాయితీ లభించడమే కాకుండా రిజర్వేషన్ వర్తిస్తుంది. పది రోజులుగా మీసేవ కేంద్రాల్లో సేవలు నిలిచిపోవడంతో వీటికి దరఖాస్తు చేసుకున్న వేలాదిమంది అభ్యర్థులు నష్టపోతున్నారు.
నేటి నుంచి తెలంగాణ ఐసెట్ తుది విడుత కౌన్సెలింగ్
టీజీఐసెట్-2024 తుది విడుత కౌన్సెలింగ్ శుక్రవారం నుంచి ప్రారంభమైంది. ఇందుకు సంబంధించిన షెడ్యూల్‌ను టీజీఐసెట్ అడ్మిషన్ల కన్వీనర్ ఇప్పటికే విడుదల చేశారు. సెప్టెంబర్ 20, 21 తేదీల్లో రిజిస్ట్రేషన్‌తోపాటు ఆన్‌లైన్‌లో సర్టిఫికెట్ వెరిఫికేషన్ జరగనుంది. ఇక సెప్టెంబర్ 21, 22 తేదీల్లో వెబ్ ఆప్షన్లను ఎంచుకోవాలి. సెప్టెంబర్ 22వ తేదీన ఆప్షన్లను ఫ్రీజింగ్ చేసుకోవాలి. సెప్టెంబర్ 25వ తేదీన సీట్ల కేటాయింపు ఉంటుంది. సెప్టెంబర్ 25, 27 తేదీల్లో ఫీజును చెల్లించి సెప్టెంబర్ 28 తేదీ లోపు ఆయా కాలేజీల్లో రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది. ఇదంతా పూర్తైతే సెప్టెంబర్ 27న స్పాట్ అడ్మిషన్లకు సంబంధించి మార్గదర్శకాలు విడుదలవుతాయి. ఫస్ట్ ఫేజ్ కౌన్సెలింగ్‌లో మిగిలిన 4,448 సీట్లను తుది విడత కౌన్సెలింగ్‌లో భర్తీ చేయనున్నారు.