సెంటిమెంట్ ను రిపీట్ చేసిన ఉపాధ్యాయులు.. ఎమ్మెల్సీగా గురువుల విలక్షణమైన తీర్పు!
వరంగల్ - ఖమ్మం - నల్గొండ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో గురువులు PRTU అభ్యర్థికే పట్టం కట్టారు. ఈ ఎన్నికల్లో టీచర్ ఎమ్మెల్సీగా గురువులు విలక్షణమైన తీర్పునిచ్చారు. ఈ స్థానం నుంచి ఒకసారి గెలిచిన అభ్యర్థి రెండోసారి గెలవరనే సెంటిమెంట్ మరోసారి రిపీట్ అయింది.

వరంగల్ – ఖమ్మం – నల్గొండ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో గురువులు PRTU అభ్యర్థికే పట్టం కట్టారు. ఈ ఎన్నికల్లో టీచర్ ఎమ్మెల్సీగా గురువులు విలక్షణమైన తీర్పునిచ్చారు. ఈ స్థానం నుంచి ఒకసారి గెలిచిన అభ్యర్థి రెండోసారి గెలవరనే సెంటిమెంట్ మరోసారి రిపీట్ అయింది.
వరంగల్ ఖమ్మం నల్గొండ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలు ఆసక్తికరంగా జరిగాయి. ఈ ఎమ్మెల్సీ స్థానానికి జరిగిన ఎన్నికల్లో 19 మంది అభ్యర్థులు పోటీపడ్డారు. మొత్తం 25,797 ఓట్లకు గాను 24 వేల139 ఓట్లు పోలయ్యాయి. ఇందులో 23,641 ఓట్లు చెల్లుబాటు కాగా, 494 ఓట్లు చెల్లకుండా పోయాయి. దీంతో 11,821 ఓట్లను మ్యాజిక్ ఫిగర్ గా అధికారులు నిర్ధారించారు. మొదటి ప్రాధాన్యత ఓట్లలో PRTU అభ్యర్థి శ్రీపాల్ రెడ్డికి 6,035 ఓట్లు రాగా, UTF అభ్యర్థి అలుగుబెల్లి నర్సిరెడ్డికి 4,820 ఓట్లు, ఇండిపెండెంట్ అభ్యర్థులు హర్షవర్ధన్ రెడ్డికి 4,437 ఓట్లు, పూల రవీందర్ 3,115 ఓట్లు వచ్చాయి. మ్యాజిక్ ఫిగర్ ను ఎవరు రీచ్ కాకపోవడంతో రెండో ప్రాధాన్యత ఓట్లను లెక్కిస్తూ ఎలిమినేషన్ ప్రక్రియను చేపట్టారు. దీంతో 18 మంది అభ్యర్థులను ఎలిమినేట్ చేస్తూ వచ్చిన ప్రాధాన్యత ఓట్లతో మ్యాజిక్ ఫిగర్ ను చేరుకోవడంతో PRTU అభ్యర్థి శ్రీపాల్ రెడ్డిని విజేతగా ప్రకటించారు. మొత్తం ఓట్లలో శ్రీపాల్ రెడ్డి13,969 ఓట్లు సాధించారు.
ఒకసారి గెలిస్తే రెండోసారి గెలవరు..!
ఈ ఎమ్మెల్సీ ఎన్నిక ఫలితం మరోసారి సెంటిమెంట్ రిపీట్ అయింది. టీచర్ ఎమ్మెల్సీగా ఒకసారి గెలిస్తే రెండోసారి గెలవరనే సెంటిమెంట్ ను ఉపాధ్యాయులు రిపీట్ చేశారు. ఎమ్మెల్సీగా ఒకసారి గెలిచిన అభ్యర్థి కానీ, సంఘం మరోసారి ఇక్కడ గెలిచిన దాఖలాలు లేవు. ప్రతి ఎన్నికల్లోనూ ఇక్కడ ఉపాధ్యాయులు విలక్షణమైన తీర్పును ఇస్తున్నారు. గత నాలుగు పర్యాయాయలుగా ఒకసారి గెలిచిన అభ్యర్థిని/సంఘాన్ని వరుసగా రెండోసారి ఉపాధ్యాయులు గెలిపించడం లేదు.
సెంటిమెంట్ రిపీట్..!
దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి 2007లో శాసనమండలిని పునరుద్ధరించారు. అప్పుడు మొదటిసారి నిర్వహించిన వరంగల్-ఖమ్మం-నల్లగొండ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో విద్యావేత్త చుక్కా రామయ్య యూటీఎఫ్ తరపున విజయం సాధించారు. ఆ తర్వాత 2013లో రెండోసారి ఎన్నికలు జరిగాయి. అప్పుడు పీఆర్టీయూ-టీఎస్ తరపున పోటీ చేసిన పూల రవీందర్ గెలుపొందారు. 2019లో జరిగిన ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో యూటీఎఫ్ అభ్యర్థి అలుగుబెల్లి నర్సిరెడ్డి గెలిచారు. ప్రస్తుతం నాలుగోసారి నిర్వహించిన ఎన్నికల్లో పీఆర్టీయూ- టీఎస్ బలపరిచిన అభ్యర్థి పింగిలి శ్రీపాల్ రెడ్డి విజయం సాధించారు. ఇలా నాలుగుసార్లు వేర్వేరు అభ్యర్ధులు ఇక్కడ విజయం సాధించారు. 2019లో యూటీఎఫ్ అభ్యర్థిగా గెలుపొందిన నర్సిరెడ్డి.. ఈసారి కూడా విజయం సాధించి రికార్డు సృష్టిస్తారని అందరూ భావించారు. కానీ అందరి అంచనాలను తలకిందులు చేస్తూ ఉపాధ్యాయులు విలక్షణమైన తీర్పును ఇచ్చారు. దీంతో ఈ స్థానంలో కొనసాగుతున్న సెంటిమెంట్ ను ఉపాధ్యాయులు రిపీట్ చేశారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
