సంక్రాంతి సెలవుల తర్వాత ఉత్సాహంగా బడికి వచ్చారు.. కానీ.. అక్కడ సీన్ చూసి అంతా షాక్..
వాళ్లంతా సంక్రాంతి పండుగ సెలవులను ఎంజాయ్ చేసి పాఠశాలకు ఉత్సాహంగా బయలుదేరారు. పాఠశాల తెరిచే సమయానికి విద్యార్థులు, ఉపాధ్యాయులు అంతా వచ్చారు. కానీ పాఠశాల గేటుకు తాళం వేసి ఉండడంతో షాక్ తిన్నారు. పాఠశాల గేటుకు ఎందుకు తాళం వేసారో తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే.

తెలంగాణలోని యాదాద్రి జిల్లా వలిగొండ మండలం సంగెంలో ప్రభుత్వ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఇది. ఇందులో ఆరో తరగతి నుండి పదవ తరగతి వరకు 185 మంది విద్యార్థులు విద్యను అభ్యసిస్తున్నారు. వారం రోజులపాటు సంక్రాంతి సెలవులను ఎంజాయ్ చేసిన విద్యార్థులు, ఉపాధ్యాయులు సోమవారం ఉదయం పాఠశాలకు ఉత్సాహంగా బయలుదేరారు. పాఠశాల తెరిచే సమయానికి పాఠశాల గేటుకు తాళం వేసి ఉండడంతో కంగుతిన్నారు. దీంతో విద్యార్థులు, ఉపాధ్యాయులు అంతా పాఠశాల ఎదుట నిరీక్షించాల్సి వచ్చింది.
మనబడి మన ఊరు పథకంలో భాగంగా గ్రామ మాజీ సర్పంచి కీసర రాంరెడ్డి పాఠశాల తరగతి గదులకు మరమ్మత్తులు పనులు చేశారు. 2023లో 28 లక్షల రూపాయలతో మరమ్మత్తు పనులు చేపట్టగా.. అప్పట్లో ఐదు లక్షల రూపాయలు మాత్రమే నిధులు విడుదల చేశారు. ఆ తర్వాత రాష్ట్రంలో ప్రభుత్వం మారడంతోపాటు తన పదవీకాలం కూడా పూర్తి అయింది. దీంతో పెండింగ్ బిల్లుల కోసం నెలల తరబడి అధికారుల చుట్టూ తిరిగిన ఫలితం లేకపోయింది. దీంతో మాజీ సర్పంచ్ రాంరెడ్డి ప్రభుత్వ పాఠశాల గేటుకు తాళం వేశారు. తనకు పెండింగ్ బిల్లులు చెల్లించేలా విద్యార్థుల తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు సహకరించాలని ఆయన కోరారు.
ఈ విషయం తెలుసుకున్న విద్యాశాఖ అధికారులు, పోలీసులు పాఠశాలకు చేరుకున్నారు. పెండింగ్ బిల్లులు చెల్లించేలా ఉన్నతాధికారులతో మాట్లాడుతామని మాజీ సర్పంచ్ కు హామీ ఇచ్చారు. దీంతో మాజీ సర్పంచ్ రాంరెడ్డి పాఠశాల గేటుకు తాళం తీశారు. దీంతో విద్యార్థులు, ఉపాధ్యాయులు పాఠశాలల్లోకి వెళ్లారు. యధావిధిగా విద్యార్థులకు తరగతులు ప్రారంభమయ్యాయి. మాజీ సర్పంచ్ రాంరెడ్డికి పెండింగ్ బిల్లులు ఉన్నమాట వాస్తవమేనని ఎంఈఓ భాస్కర్ చెబుతున్నారు. పెండింగ్ బిల్లుల విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకు వెళ్ళామని చెబుతున్నారు.
పెండింగ్ బిల్లులు ఉంటే మాజీ సర్పంచ్ రాంరెడ్డి, అధికారులు చూసుకోవాలే తప్ప, ఇలా పాఠశాల గేటుకు తాళాలు వేయడం ఏమిటని విద్యార్థుల తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేశారు. పిల్లలు, ఉపాధ్యాయులను రొడ్డు పాలు చేయడం సరికాదని పేర్కొంటున్నారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
