AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మ్యూజిక్ లవర్స్‌ని షేక్ చేస్తున్న హైబ్రిడ్ పిల్ల ‘సారంగ దరియా’.. అసలు ఈ పాట ఎవరిదో తెలుసా?..

Saranga Dariya Song: ఇక్కడా అక్కడా అని లేదు.. ఏ నోట విన్నా ఆ పాటే.. ఏ ఫోన్లో చూసినా ఆ ఊపే.. పల్లెల్లో చేను చెలకల్లో పాడుకునే...

మ్యూజిక్ లవర్స్‌ని షేక్ చేస్తున్న హైబ్రిడ్ పిల్ల ‘సారంగ దరియా’.. అసలు ఈ పాట ఎవరిదో తెలుసా?..
Shiva Prajapati
|

Updated on: Mar 06, 2021 | 8:18 PM

Share

Saranga Dariya Song: ఇక్కడా అక్కడా అని లేదు.. ఏ నోట విన్నా ఆ పాటే.. ఏ ఫోన్లో చూసినా ఆ ఊపే.. పల్లెల్లో చేను చెలకల్లో పాడుకునే ఓ సాదాసీదా పల్లెపదం అది.. కానీ ఇప్పుడు సోషల్ మీడియాని ఓ ఊపు ఊపేస్తోంది. యూట్యూబ్‌ని షేక్ చేసేస్తోంది. రికార్డ్ ల మీద రికార్డ్ లు తిరగరాస్తోంది. ఆ పాటే ‘దాని కుడిభుజం మీద కడువా’.. ‘దాని ఎజెంటురైకలు మెరియా’ అనే సాంగ్. ఇంతకీ ఈ ట్రెండిగ్ పాట పుట్టిందెక్కడ..? ఈ పాట మొదటగా పాడిందెవరు..? ఆ పాట ఇప్పుడు లవ్ స్టోరీ అంటూ బిగ్ స్క్రీన్ పై బిగ్ బ్లాస్ట్ కావడం వెనుక కారణాలేంటి.? ఒక్కసారి ఐదేళ్ల వెనక్కి వెళితేనే సారంగదరియా సంగతి తెలిసేది.

బిగ్ స్క్రీన్ పై బిగ్ ధమాకాగా మారిన పాట ‘సారంగ దరియా’. డిజిటల్ మీడియా, యూట్యూబ్, ట్విట్టర్ లో ప్రపంచమంతటా మారిమోగుతున్న ఈ పాటను పదేండ్ల క్రితమే పాడారు గాయని శిరీష. మంచిర్యాలకు చెందిన ఈ మట్టి పరిమళం పదేళ్ల క్రితం ‘రేలారే రేలా’ వేదికగా ‘సారంగ దరియా’ పాట పాడి హల్‌చల్ చేశారు. ఈ పాటే శిరీషను పాటల కోయిలమ్మగా మార్చింది. మరి కోయిల పాడిన పాట.. ఇవాళ బిగ్ స్క్రీన్‌పై సందడి చేస్తుంటే ఆమె రియాక్షన్ ఎలా ఉందో ఒకసారి చూద్దాం.

‘ఈ పాటను రేలారే రేలా వేదికపై సుద్దాల అశోక్ తేజ ఎదుట.. గజ్జె కట్టి ఆడి పాడాను. అసలు ఈ పాటనే నన్ను ఫైనల్ కి చేర్చింది. వరంగల్‌కు చెందిన తోటి కళాకారిణి కోమలను ‘ఏదన్నా ఓ మంచి పాట ఉంటే ఇవ్వవా’ అని అడిగాను. తను ‘నా దగ్గరో మంచి పాటుంది. ఇస్తాను’ అని చెప్పింది. అలా నా చేతిలోకి వచ్చిన పాటే ‘దాని కుడిభుజం మీద కడువా’ పాట. ఆ పాట ఇప్పుడిలా సినిమాల్లోకి చేరి సూపర్ హిట్ అయిందని తెలిసి చాలా సంతోషంగా ఉంది.’ అని చెప్పుకొచ్చింది మంచిర్యాల మట్టి పరిమళం శిరీష. ‘లవ్ స్టోరీ సినిమాలో మంగ్లీ ఈ పాట పడినట్టు తెలిసింది. సుద్దాల అశోక్ తేజ గారు బానీలు కడితే సాయి పల్లవి ఆ పాటకు అనుగణంగా అద్భుతంగా డ్యాన్స్ చేసింది. అయితే అసలు పాట పాడిన నాకు.. ఆ పాట ఇచ్చిన కోమలక్కకు పేరు ఇస్తే కొంచెమైనా సంబరపడేవాళ్లం. అయినాసరే మా పాట ఇలా అయినా సినిమాల్లోకి చేరినందుకు సంతోషంగానే ఉంది. ఇప్పుడు ఎవరి సెల్ ఫోన్‌లో చూసినా ఇదే పాట వినిపిస్తోంది. నీ పాట సూపర్ హిట్ అయిందని నాకు చాలా మంది ఫోన్లు చేసి చెబుతున్నారు.’ అని శిరీష సంబరపడిపోతున్నారు.

‘జానపదాలంటే నాకు పిచ్చి. ఏడేళ్ల వయసు నుంచే జానపదాలు పాడుతున్నాను. పాటలు బాగా పాడుతున్నాని టీచర్లు కూడా ప్రోత్సహించేవారు. మాది పేద కుటుంబం. అమ్మ రాజవ్వ, నాన్న యేసయ్య. నాన్న వ్యవసాయం చేస్తే.. అమ్మ కూలీ పనికి వెళ్తుండేది. నాకు పాటలంటే ఇష్టమని తెలుసుకొని నన్ను ప్రోత్సహించి తీర్చిదిద్దింది మా తాత రాజయ్యే. ఆయన పాటలు పాడటమే కాదు.. రాస్తాడు కూడా. ఎక్కడ ఏ కార్యక్రమం ఉన్నా నన్ను తన వెంట తీసుకుని వెళ్తుండేవాడు.’ అంటూ చిన్ననాటి రోజులను శిరీష గుర్తు చేసుకున్నారు.

ఇదిలాఉంటే.. ఈ గ్రామ కోయిలమ్మ ఇప్పుడు పన్నెండు రోజుల పసిబిడ్డకు తల్లి. ఆ బిడ్డ ఏడిస్తే ‘సారంగ దరియ’ పాట పాడుతూ బుజ్జగించడం విశేషం. ఎక్కెక్కి ఏడ్చిన సమయంలో సారంగదరియా పాట పాడితే చాలు చిన్నారి ప్రశాంతంగా నిద్రపోతుందని శిరీష సంతోషంగా చెప్పుకొచ్చారు. కాగా, ‘రేలాలే రేలా’ తరువాత ఎక్కడా పాడలేదని చెప్పిన శిరీష.. తన భర్త కూడా పాటలు పాడుతాడని తెలిపారు. ఆమె భర్త పేరు శ్రావణ్ అని, తెలంగాణ ఉద్యమ కాలంలో కాలికి గజ్జె కట్టుకుని ఊరూరా తిరిగి తెలంగాణపై పాటలు పాడేవాడని చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ఇద్దరూ తెలంగాణ సాంస్కృతిక సారథిలో చేస్తున్నారు. మంచిర్యాల డీపీఆర్‌వో ద్వారా ప్రభుత్వ సంక్షేమ పథకాల గురించి ఊరూరా తిరుగుతూ పాటలు పాడుతూ ప్రచారం కల్పిస్తున్నారు. మొత్తంగా తాను పాడిన పాట ఇప్పుడు మ్యూజిక్ వరల్డ్‌నే ఊపేస్తుండటంపై శిరీష తెగ సంబరపడిపోతున్నారు.

Also read:

Balayya slaps fan: ఆగ్రహంతో బాలయ్య చెంపదెబ్బ.. అభిమాని రియాక్షన్ ఇలా ఉంది..

International Women’s Day 2021: అందమైన అతివలకు… అదిరిపోయే డ్రెస్సింగ్ ఐడియాస్.. ఉమెన్స్‌ డే సందర్బంగా ఓ లుక్కేయండి!