గీత కార్మికుల నిరసన దీక్షకు ఎమ్మెల్సీ కడియం సంఘీభావం.. ముఖ్యమంత్రితో మాట్లాడి సమస్యలు పరిష్కరిస్తానని హామీ

జనగామ జిల్లాలో నిరసన దీక్ష చేస్తున్న గీత కార్మికులకు టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కడియం శ్రీహరి సంఘీభావం తెలిపారు. న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి..

గీత కార్మికుల నిరసన దీక్షకు ఎమ్మెల్సీ కడియం సంఘీభావం.. ముఖ్యమంత్రితో మాట్లాడి సమస్యలు పరిష్కరిస్తానని హామీ
Follow us

|

Updated on: Mar 06, 2021 | 6:53 PM

జనగామ జిల్లాలో నిరసన దీక్ష చేస్తున్న గీత కార్మికులకు టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కడియం శ్రీహరి సంఘీభావం తెలిపారు. న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తానని ఆయన హామీ ఇచ్చారు. జనగామ జిల్లా జాఫర్గడ్ మండలం ఉప్పుగల్లు గ్రామంలో రిజర్వాయర్ లో ఉపాధి కొల్పుతున్న గీత కార్మికులు తమకు న్యాయం చేయాలని గత 6 రోజుల నుండి నిరసన కార్యక్రమాలు చేస్తున్నారు. దీక్ష వద్దకు చేరుకున్న కడియం శ్రీహరి వారికి సంఘీభావం తెలిపారు.

అనంతరం కడియం శ్రీహరి మాట్లాడుతూ.. సుమారు 300 కుటుంబాలు భూములు నష్టపోయి, ఉపాధి కోల్పోవడం నిజంగా బాధాకరమన్నారు. ప్రాజెక్టు వల్ల ఎంతో మందికి ఉపయోగపడుతుందని, కానీ మీ న్యాయమైన డిమాండ్లు నెరవేర్చందుకు మీ సమస్యలు ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రులు కేటీఆర్, శ్రీనివాస్ గౌడ్ ల దృష్టికి తీసుకెళతానన్నారు.

ఉప్పుగల్లు గ్రామంలో గ్రానైట్ లీజ్ 30 ఎకరాల భూమి 2022 లో ముగుస్తుందని, అట్టి లీజును రద్దు చేయించి, అందులో 10 ఎకరాల భూమిని ఇప్పిస్తానని, ఉపాధి కోసం గౌడ యువకులకు సబ్సిడీ రుణాలు ఇప్పిస్తానని కడియం శ్రీహరి హామీ ఇచ్చారు. ఒక్కో చెట్టుకు మీరు డిమాండ్ చేసిన డబ్బులు కాకుండా ప్రభుత్వం ఇచ్చే దానికంటే, ముఖ్యమంత్రి కెసిఆర్తో మాట్లాడి అదనంగా ఇప్పిస్తానని స్పష్టం చేశారు. ఎన్నికల కోడ్ ముగియగానే గీతకార్మికుల ను హైదరాబాద్ తీసుకెళ్లి ముఖ్యమంత్రితో కల్పిస్తానన్నారు.

గతంలో శంకుస్థాపనను అడ్డుకున్న గీత కార్మికులు

వరంగల్‌ జిల్లా జఫర్‌గఢ్‌ మండలంలో ఉప్పుగల్లు రిజర్వాయర్‌ శంకుస్థాపన తీవ్ర ఉద్రిక్తతల నడుమ సాగింది. రిజర్వాయర్‌ వల్ల ఉపాధి కోల్పోతున్న తమను ఆదుకునేందుకు స్పష్టమైన హామీ ఇచ్చేంత వరకు పనులు ప్రారంభించవద్దంటూ గతంలోనే శంకుస్థాపనకు గీత కార్మికులు అడ్డుతగిలారు. ఒకవైపు గీత కార్మికులు నిరసన వ్యక్తం చేస్తుండగానే నాటి గిరిజన సంక్షేమ శాఖ మంత్రి చందులాల్‌ రిజర్వాయర్‌ పనులకు శంకుస్థాపన చేసి వెళ్లిపోయారు.

దేవాదుల ప్రాజెక్టులో భాగంగా ఉప్పుగల్లు గ్రామాన్ని ఆనుకొని రిజర్వాయర్‌ను నిర్మించేందుకు ప్రభుత్వం రూ.300 కోట్లు మంజూరు చేసింది. ఈ రిజర్వాయర్‌ నిర్మాణ వల్ల ఉప్పుగల్లు గ్రామానికి చెందిన రైతుల వ్యవసాయ భూములతో పాటు గీత కార్మికుల తాటి చెట్లు ముంపునకు గురవుతున్నాయి. ఇప్పటికే ముంపునకు గురయ్యే భూములపై సర్వే నిర్వహించడంతో పాటు భూములు కోల్పోయే కొంతమంది రైతులకు ప్రభుత్వం నుంచి పరిహారం వచ్చింది. అయితే తాటిచెట్ల విషయంలో ప్రభుత్వం ఎలాంటి నిర్ణయమూ తీసుకోలేదు. దీంతో వీటిపైనే ఆధారపడి జీవనం సాగిస్తున్న గీత కార్మికులు ఉపాధి కోల్పోతున్నారు.

ఈ విషయం తేలకుండానే ప్రభుత్వం రిజర్వాయర్‌ నిర్మాణ పనులను ప్రారంభించింది. దీంతో గీత కార్మికులు పెద్ద సంఖ్యలో మోకు ముత్తాదులతో నిరసన చేపట్టారు. తాటి చెట్ల వల్ల ఉపాధి కోల్పోతున్న తమను ఆదుకునే విషయంలో ప్రభుత్వం నుంచి స్పష్టమైన హామీ ఇచ్చిన తరువాతనే పనులు ప్రారంభించాలని వారు డిమాండ్‌ చేస్తున్నారు.

Read More:

టీఆర్‌ఎస్‌ అభ్యర్థులకు బ్రాహ్మణ సంఘం మద్దతు.. కృతజ్ఞతలు తెలిపిన మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు

ఆ హక్కులు కాలరాసేందుకు రాజ్యాంగం సవరించే కుట్ర జరుగుతుంది. పట్టభద్రులు ఆలోచించాలన్న హరీశ్‌రావు