Vastu: ఇంట్లో నిమ్మ చెట్టు పెంచుకుంటే శుభమా.. అశుభమా..? అపోహలు కాదు నిజాలు తెలుసుకోండి
Lemon Tree Vastu: చాలా మంది ఇళ్లల్లో.. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో నిమ్మ చెట్టు ఎక్కువగా కనిపిస్తుంది. కానీ, కొందరు ఇంటి ఆవరణలో నిమ్మ చెట్టు ఉండకూడదని భావిస్తుంటారు. వాస్తు ప్రకారం ఇది మంచిది కాదని కొందరు చెబుతారు. దీని గురించి ఇప్పుడు స్పష్టంగా తెలుసుకుందాం.

కావాల్సినంత స్థలం ఉన్న ప్రతీ ఇంట్లోనూ మొక్కలు సాధారణమే. కొందరు పూల మొక్కలు పెంచితే.. మరికొందరు ఆకర్షణీయమైన మొక్కలు పెంచుకుంటారు. తమ అభిరుచులకు తగినట్లుగా పూలనిచ్చేవి, ఫలాలను ఇచ్చే మొక్కలను పెంచుకుంటారు. ఈ మొక్కలు, చెట్ల వల్ల స్వచ్ఛమైన గాలి, మానసిక ప్రశాంతత కూడా లభిస్తాయి. అయితే చాలా మంది ఇళ్లల్లో.. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో నిమ్మ చెట్టు ఎక్కువగా కనిపిస్తుంది. కానీ, కొందరు ఇంటి ఆవరణలో నిమ్మ చెట్టు ఉండకూడదని భావిస్తుంటారు. వాస్తు ప్రకారం ఇది మంచిది కాదని కొందరు చెబుతారు. మరి నిజంగా వాస్తు ప్రకారం ఇంట్లో నిమ్మ చెట్టు పెంచుకోవచ్చా? లేదా ? అనే సందేహం చాలామందికి ఉంటుంది. దీని గురించి ఇప్పుడు స్పష్టంగా తెలుసుకుందాం.
నిమ్మ చెట్టు పెంచుకోవడం మంచిదేనా?
వాస్తు నిపుణుల అభిప్రాయం ప్రకారం ఇంట్లో నిమ్మ చెట్టు పెంచుకోవడం వల్ల ఎలాంటి అశుభం కలగదు. ఇతర పండ్ల చెట్లు లేదా పూల మొక్కలు పెంచినట్లే నిమ్మ చెట్టును కూడా ఇంటి ఆవరణలో పెంచుకోవచ్చని వారు చెబుతున్నారు. నిమ్మ చెట్టు వల్ల నష్టం లేదా అశుభం కలుగుతుందని చెప్పడం కేవలం అపోహ మాత్రమే అని నిపుణులు స్పష్టం చేస్తున్నారు.
ఇంట్లో నిమ్మ చెట్టు ఉంటే కలిగే ప్రయోజనాలు
వాస్తు ప్రకారం ఇంట్లో నిమ్మ చెట్టు ఉండటం వల్ల కొన్ని మంచి ఫలితాలు లభిస్తాయని నమ్మకం ఉంది. నిమ్మ చెట్టు ఇంటికి శుభాన్ని, ధనసంపదను తీసుకొస్తుందనే విశ్వాసం ఉంది. ఇది ప్రకృతి శక్తిని పెంపొందించే గుణం కలిగి ఉండటంతో ఇంట్లో సానుకూల వాతావరణం ఏర్పడుతుందని అంటారు.
దీంతో కుటుంబ సభ్యులు ఆనందంగా, ఉత్సాహంగా జీవించగలుగుతారని పెద్దలు చెబుతారు. అలాగే నిమ్మ చెట్టు ఇంట్లో శక్తి ప్రవాహాన్ని సమతుల్యం చేసేలా కూడా పనిచేస్తుందని వాస్తు నిపుణులు పేర్కొంటున్నారు.
నెగిటివ్ ఎనర్జీని దూరం
ఇంటి ముందు భాగంలో నిమ్మ చెట్టు నాటి పెంచితే ప్రతికూల శక్తులు ఇంట్లోకి రాకుండా అడ్డుకుంటుందని పెద్దల నమ్మకం. దిష్టి, చెడు దృష్టి, నర దృష్టి వంటి ప్రభావాల నుంచి కూడా రక్షణ కలుగుతుందని అంటారు. ఇంటికి వచ్చే వ్యక్తుల వెంట వచ్చే నెగిటివ్ ఎనర్జీని కూడా నిమ్మ చెట్టు తగ్గిస్తుందని విశ్వసిస్తారు.
ఏ దిశలో నాటితే మంచిది?
వాస్తు ప్రకారం నిమ్మ చెట్టును ఇంటి ఉత్తర–తూర్పు మూలలో నాటితే అత్యంత శుభప్రదంగా భావిస్తారు. అది సాధ్యం కాకపోతే దక్షిణ–తూర్పు దిశలో కూడా పెంచవచ్చు. ముఖ్యంగా ఉత్తర–తూర్పు మూలలో నాటిన నిమ్మ చెట్టు ఆ ఇంటికి సకల శుభాలను తీసుకొస్తుందని చెబుతారు. ఇది జీవితంలో ఎదుగుదల, అభివృద్ధికి కూడా సహాయపడుతుందని నమ్మకం. అలాగే సిరిసంపదలు పెరగడానికి కూడా ఇది శుభ సంకేతంగా పరిగణిస్తారు.
శని దోషం తగ్గించడంలో సహాయం?
వాస్తు నిపుణుల ప్రకారం శని దోషం కారణంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న వారికి నిమ్మ చెట్టు కొంత ఉపశమనం ఇస్తుందని చెబుతారు. శనివారాల్లో నిమ్మకాయను ఉపయోగించి చేసే పూజలు శని ప్రభావాన్ని తగ్గిస్తాయని కూడా విశ్వసిస్తారు. శని ప్రభావంతో కలిగే నీరసం, ఒత్తిడిని తగ్గించడంలో కూడా ఇది సహాయపడుతుందని అంటారు. అలాగే రాహు, కేతు ప్రభావాల వల్ల ఎదురయ్యే ఆధ్యాత్మిక లేదా వ్యక్తిగత సమస్యలను తగ్గించడంలో కూడా నిమ్మ చెట్టు ఉపయోగపడుతుందని కొందరు నమ్ముతారు.
ఈ విషయాన్ని మాత్రం తప్పక గుర్తుంచుకోండి
నిమ్మ చెట్టును ఇంట్లో పెంచేటప్పుడు ఒక విషయం తప్పనిసరిగా గుర్తుంచుకోవాలి. అది ఇంటి మెయిన్ గేట్‌కు చాలా దగ్గరగా ఉండకూడదు. గేట్‌కు కొంత దూరంగా నాటితేనే ఇంట్లోకి వచ్చే పాజిటివ్ ఎనర్జీ ప్రవాహం సమతుల్యంగా ఉంటుందని వాస్తు నిపుణులు సూచిస్తున్నారు.
(Disclaimer: ఈ వార్తలోని సమాచారం వాస్తు, మత సంబంధమైన అంశాలపై ఆధారపడి ఉంది. దీనిని టీవీ9 తెలుగు ధృవీకరించదు.)
