నిరుద్యోగులపై సైబర్ నేరగాళ్ల వల… ఉద్యోగాల పేరుతో మోసం.. గుట్టురట్టు చేసిన హైదరాబాద్ పోలీసులు
"ఉద్యోగం కావాలా... నెలకు రూ.20వేల శాలరీ... టెన్త్ పాసైనా చాలు" ఇలాంటి ప్రకటన చూడగానే సహజంగా నిరుద్యోగులు ఫ్లాట్ అవుతారు.
Job Scam : “ఉద్యోగం కావాలా… నెలకు రూ.20వేల శాలరీ… టెన్త్ పాసైనా చాలు” ఇలాంటి ప్రకటన చూడగానే సహజంగా నిరుద్యోగులు ఫ్లాట్ అవుతారు. అసలే సరైన ఉద్యోగం దొరకక నానా తిప్పలు పడుతున్న వారు… ఇలాంటి ప్రకటనలు చూసి… వెంటనే వాటిలో ఇచ్చే ఫోన్ నంబర్లకు కాల్ చేస్తారు. ఉన్న కష్టకాలంలో ఏదోక జాబులో చేరిపోవచ్చని ఆరాటపడుతుంటారు. ఇదే అదునుగా భావించిన సైబర్ నేరగాళ్లు… ఉద్యోగం ఇప్పిస్తామని కల్లబొల్లి కబుర్లు చెప్పి కమిషన్ పేరుతో, రిజిస్ట్రేషన్ పేరుతో… ఇలా ఏదో ఒక వంక పెట్టి… నిరుద్యోగుల నుంచీ వేలకు వేలు కాజేస్తున్నారు. ఇదంతా అవతలి వాళ్లను కలవకుండానే… ఫోన్ల ద్వారానే జరిగిపోతున్న తంతు.
తాజాగా ఇలాంటి ఘటననే హైదరాబాద్ మహానగరంలో సైబర్ మోసం వెలుగు చూసింది. ఉద్యోగాల పేరుతో నిరుద్యోగులకు కుచ్చుటోపి పెడుతున్న సైబర్ నేరగాడిని పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రభుత్వ, ప్రైవేట్ ఉద్యోగాలు ఇప్పిస్తామని నమ్మించి సైబర్ నేరగాళ్లు మోసాలకు పాల్పడుతున్నారు. అనేక ఉద్యోగాలు ఉన్నాయని సైబర్ నేరగాళ్లు ఆన్‌లైన్‌లో ప్రకటనలిచ్చారు. ఈ ప్రకటనను చూసి వారిని ఓ వ్యక్తి సంప్రదించాడు. అయితే ఆ ఉద్యోగం కావాలంటే ముందస్తుగా కొంత సొమ్ము చెల్లించాలంటూ హుకుం జారి చేశాడు సైబర్ కేటుగాడు. మంచి ఉద్యోగం అని చెప్పడంతో సైబర్ నేరగాళ్లు చెప్పిన ప్రకారం వారికి ఉద్యోగం కోసం రూ.50 వేలను బాధితుడి అక ట్రాన్స్‌ఫర్ చేశాడు.
అయితే డబ్బులు చెల్లించినా ఉద్యోగం రాకపోవడంతో తాను మోసపోయానని బాధితుడు గ్రహించాడు. దీంతో తనకు జరిగిన మోసంపై సైబర్ క్రైమ్ పోలీసులకు బాధితుడు ఫిర్యాదు చేశాడు. పోలీసులు ముమ్మరంగా విచారణ చేశారు. ఈ విచారణ ఆధారంగా కలకత్తాకు చెందిన హర్షవర్దన్ మిశ్రాను పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడు సుమారు 3వేల మందిని మోసం చేసినట్లు సమాచారం. నిరుద్యోగుల నుంచి కొన్ని కోట్ల రూపాయలను నిందితుడు వసూలు చేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి కేసు నమోదు చేసుకున్న హైదరాబాద్ సైబర్ క్రైం పోలీసులు విచారణ చేపట్టారు.
ఇలాంటి ఘటనల్లో ఫోన్లలో మాట్లాడిన సైబర్ నేరగాళ్లు ఎవరన్నది ఒక్కొసారి తెలుసుకోవడం పోలీసులకు కష్టమవుతోంది. నేరం జరిగిన తర్వాత… నేరగాళ్లు ఆ సిమ్‌ని వాడటం మానేస్తున్నారు. వారు ఉండే ఏరియా నుంచీ పరారవుతున్నారు. ఇలా వారానికో చోటికి వెళ్తూ… అక్కడున్న వాళ్లను ముంచేస్తున్నారు. ఇలాంటి గ్యాంగులు చాలా ఉంటున్నాయి. రోజూ వేల మంది మోసపోతున్నారు. అందుకే పోలీసులు ఇలాంటి నేరాలపై ప్రజలను అప్రమత్తంగా ఉండాలిన సూచిస్తున్నారు. కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా… నిరుద్యోగులు సైబర్ నేరగాళ్ల ఉచ్చులో చిక్కుకోకుండా జాగ్రత్త పడవచ్చని చెబుతున్నారు.
ఇదీ చదవండిః అమెరికాలో వెలుగుచూసిన దారుణం.. 14 ఏళ్ల మైనర్ బాలుడిపై మహిళ లైంగిక దాడి..