Revanth Reddy: బాసర ట్రిపుల్ ఐటీ విద్యార్థుల నిరసనలు రాజకీయంగా చర్చనీయాంశంగా మారిన విషయం తెలిసిందే. తాజాగా ఈ వ్యవహరంపై టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి స్పందించారు. ప్రభుత్వం వెంటనే ట్రిపుల్ ఐటీ విద్యార్థుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఈ విషయమై రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. ‘కాంగ్రెస్ అధికారంలో ఉన్న సమయంలో వైఎస్ రాజశేజర్ రెడ్డి హయాంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో మూడు ట్రిపుల్ ఐటీ ఏర్పాటు చేశాము. బాసరతో పాటు పులివెందుల, నూజివీడులో అంతర్జాతీయ ప్రమాణాలతో ఈ విద్యా సంస్థలను ఏర్పాటు చేశాము. విద్యా వ్యవస్థ బలోపేతానికి కాంగ్రెస్ పార్టీ ఎన్నో చర్యలు చేపట్టింది. కానీ కేటీఆర్ మాత్రం యూనివర్సిటీలలో నియామకాలు చేపట్టకుండా విద్యను నిర్వీర్యం చేశారు’ అని రేవంత్ విమర్శించారు.
‘6 వేల మందితో ప్రారంభమైన ట్రిపుల్ ఐటీ క్యాంపస్‌లో ఇప్పుడు 9 వేల మంది చదువుకుంటున్నారు. కానీ సౌకర్యాలు మాత్రం పెరిగిన విద్యార్థులకు అనుగుణంగా పెంచలేదు. విద్యార్థులు సౌకర్యాల కోసం ఉద్యమిస్తుంటే, విద్యార్థుల ఉద్యమాలతో స్ఫూర్తి పొందిన ఈ కేసీఆర్ పట్టించుకుంటాడు అనుకున్నాం. కానీ గాలికి వదిలేశారు. కేటీఆర్, విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి పట్టించుకోకపోవడం శోచనీయం. విద్యార్థుల సమస్యలను సబితా ఇంద్రారెడ్డి సిల్లీ సమస్యలు అనడం దారుణం. వారిని తోడ బుట్టిన చెల్లెమ్మలగా చూసిన వైస్సార్ ఏర్పాటు చేసిన విద్యా సంస్థ సమస్యలపై సబితా ఇంద్రారెడ్డి సిల్లీ సమస్యలు అని భావ్యం కాదు. ప్రధాన ప్రతిపక్షంగా విద్యార్థుల సమస్యలు తెలుసుకొని ముఖ్యమంత్రికి, గవర్నర్ వివరించాలని ప్రయత్నం చేసాం. కానీ పోలీసులు వేలాదిగా వచ్చి అరెస్టులు చేశారు. ఈ నియంత పోకడలను విద్యార్థిలోకం గమనిస్తోంది. విద్యార్థి లోకం ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకుంటున్నారు. ఇది ఒక్క బాసర కే పరిమిత కాలేదు’ అని అన్నారు.
తమను పట్టుకోవడానికి హైవేపై వేలాది మందిగా వచ్చిన పోలీసులు, గ్యాంగ్ రేప్‌లు జరుగుతుంటే దోషులను పట్టుకోలేరని రేవంత్ విమర్శించారు. ప్రభుత్వం వెంటనే ఉన్నత స్థాయి కమిటీ వేసి ట్రిపుల్‌ఐటీ విద్యార్థుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. 1నెలల్లో కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేసిన రేవంత్.. త్వరలోనే విద్యార్థి, యువత డిక్లరేషన్ ప్రకటించి ఉద్యమిస్తామని హెచ్చరించారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి..