Telangana Rain Alert: తెలంగాణ ప్రజలకు అలర్ట్.. మరో మూడు రోజుల పాటు భారీ వర్షాలు..
Telangana Rain Alert: తెలంగాణలో గత ఐదురోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలు అతలాకుతలం చేస్తున్నాయి. మరో మూడు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు..
Telangana Rain Alert: తెలంగాణలో గత ఐదురోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలు అతలాకుతలం చేస్తున్నాయి. మరో మూడు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఉత్తర తెలంగాణ జిల్లాల్లో కురిసిన భారీ వర్షాలకు గోదావరి, దాని ఉప నదులు ఉప్పొంగిపోతున్నాయి. హైదరాబాద్‌తో పాటు ఆదిలాబాద్, నిర్మల్, ఆసిఫాబాద్, మంచిర్యాల, పెద్దపల్లి, జయశంకర్భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో వర్షాల ప్రభావం తీవ్రంగా ఉంది.ఎల్లంపల్లి, కాళేశ్వరం ప్రాజెక్టుల వల్ల గోదావరి వెనక్కి తన్ని మంచిర్యాల, మంథని లాంటి పట్టణాలు, అనేక గ్రామాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. భైంసా, నిజామాబాద్, కరీంనగర్, పెద్దపల్లి లాంటి పట్టణాల్లోనూ వివిధ కాలనీలు జలమయమయ్యాయి. భారీ వర్షాలు, వరదల కారణంగా రోడ్లు, బ్రిడ్జిలు తెగి వందలాది గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. జన జీవనం స్థంభించిపోయింది. ఆదిలాబాద్ జిల్లాలో 13 గ్రామాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. దాదాపు 2వేలుపైగా మదిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు అధికారులు.
ప్రమాదంలో కడెం ప్రాజెక్టు..
జోరువానల నేపథ్యంలో కడెం ప్రాజెక్టుకు ప్రమాదం పొంచివుందని అధికారుల హెచ్చరికతో ఆందోళన నెలకొంది. ముంపు గ్రామ ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. అయితే కడెం ప్రాజెక్టు తెగిపోయిందని వస్తున్న పుకార్లపై అధికారులు క్లారిటీ ఇచ్చారు. ఇందులో నిజం లేదని స్పష్టం చేశారు. వరదప్రవాహం భారీగా ఉండటంతో ప్రమాదం పొంచి ఉందన్న నేపథ్యంలో గ్రామాల ప్రజలను అప్రమత్తం చేస్తున్నాము తప్ప తెగిపోలేదని పేర్కొన్నారు. ఎగువ నుంచి భారీగా వరద వస్తున్నందున కడెం ప్రాజెక్టు ప్రమాదకరంగా మారింది. ఏ సమయంలో ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి నెలకొంది.
అర్ధరాత్రి అప్రమత్తమై..
కడెం ప్రాజెక్టు తెగిపోయే పరిస్థితి వచ్చిందన్న విషయం తెలియగానే కలెక్టర్ ముషరఫ్ అలీ, ఎస్పీ ప్రవీణ్‌కుమార్, పలు శాఖల అధికారులు అప్రమత్తమయ్యారు. ప్రాజెక్టు దిగువన ఉన్న కడెం, దస్తురాబాద్ మండలాల్లోని 12 గ్రామాలను ఖాళీ చేయించారు. మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి కడెం ప్రాజెక్టు పరిస్థితిని సమీక్షిస్తున్నారు.
మరోవైపు రుతుపవనాలు ద్రోణి జైసల్మేర్, కోట, పెండ్రా రోడ్, బలంగిర్, అల్పపీడన మధ్యభాగం మీదుగా ఆగ్నేయ దిశగా తూర్పు మధ్య బంగాళాఖాతం వరకు సగటు సముద్ర మట్టానికి 1.5 కి.మీ ఎత్తు వరకు విస్తరించి ఉందని వాతావరణ శాఖ తెలిపింది. దీంతో రానున్న మూడు రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరించింది. భారీ వర్షాల కారణంగా మరో మూడు రోజుల పాటు విద్యాసంస్థలకు సెలవు ప్రకటించింది తెలంగాణ ప్రభుత్వం.
భారీ వర్షాల కారణంగా హైదరాబాద్‌లో కూడా లోతట్టు ప్రాంతాలన్ని నీటితో నిండిపోయాయి. ఇళ్లలోకి వరద నీరు చేరడంతో ప్రజలు నానా అవస్థలకు గురవుతున్నారు. ఇంట్లోని వస్తువులన్ని తడిసిముద్దవుతున్నాయి. వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడుతోంది. భారీ వరదలతో పలు వాహనాలు కొట్టుకుపోయాయి.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి