Presidential Elections: ఓటింగ్‌లో పొరపాటు.. ఎమ్మెల్యే సీతక్క ఓటు చెల్లుతుందా? లేదా?
Presidential Elections: దేశ వ్యాప్తంగా రాష్ట్రపతి ఎన్నికల పోలింగ్ ప్రక్రియ కొనసాగుతోంది. తెలంగాణలోనూ ఓటింగ్ ప్రక్రియ నడుస్తోంది.
Presidential Elections: దేశ వ్యాప్తంగా రాష్ట్రపతి ఎన్నికల పోలింగ్ ప్రక్రియ కొనసాగుతోంది. తెలంగాణలోనూ ఓటింగ్ ప్రక్రియ నడుస్తోంది. అయితే, ఈ ఓటింగ్‌లో ఎమ్మెల్యే సీతక్క చిన్న పొరపాటు చేశారు. దాంతో ఆమె ఓటు చెల్లుతుందా? లేదా? అన్న సందిగ్ధం నెలకొంది. అయితే, తాను ఓటు వేయడంలో కన్‌ఫ్యూజ్ అవలేదని, బ్యాలెట్ పేపర్‌పై ఇంక్ పడటంతో సందిగ్ధానికి గురయ్యానని చెప్పుకొచ్చారు ఎమ్మెల్యే సీతక్క.
ఇంతకీ ఏం జరిగిందంటే.. రాష్ట్రపతి ఎన్నికల్లో భాగంగా తన ఓటును వేయడం కోసం పొలింగ్ సెంటర్‌కు వచ్చారు ఎమ్మెల్యే సీతక్క. రిటర్నింగ్ అధికారి బ్యాలెట్ పేపర్ ఇవ్వగా.. దానిపై మార్క్ చేసేందుకు అధికారులు ఇచ్చిన పెన్‌ను ఓపెన్ చేశారు. అయితే, ఇంక్ పొరపాటున బ్యాలెట్ పేపర్‌పై పడింది. దాంతో తన ఓటు వృధా అవుతుందేమోనని భావించిన ఎమ్మెల్యే సీతక్క.. విషయాన్ని రిటర్నింగ్ అధికారికి తెలియజేశారు. మరో బ్యాలెట్ పేపర్ ఇవ్వాల్సిందిగా అధికారులను కోరారు. అయితే, అధికారులు మరో బ్యాలెట్ పేపర్ ఇచ్చేందుకు నిరాకరించారు. దాంతో ఆ బ్యాలెట్ పేపర్‌పైనే తన ఓటు వేసి, బ్యాలెట్ బాక్సులో వేశారు. ఇదే విషయాన్ని ఓటు వినియోగించుకున్న అనంతరం మీడియాతో మాట్లాడుతూ వెల్లడించారు ఎమ్మెల్యే సీతక్క.
‘‘ఓటు వేయడంలో ఎలాంటి తప్పులు దొర్లలేదు. ఎన్నికల అధికారి ఇచ్చిన పెన్ ఇంక్ బ్యాలెట్ పేపర్‌పై పడింది. దాంతో ఎన్నికల అధికారికి ఫిర్యాదు చేశాను. కొత్త బ్యాలెట్ పేపర్ ఇవ్వమంటే ఇవ్వలేదు. ఇంక్ పడిన బ్యాలెట్ పేపరే బాక్స్‌లో వేశాను. నా ఆత్మ సాక్షిగా నేను వేయాల్సిన వారికే ఓటు వేశాను. ఓటు వేయడంలో ఎలాంటి కన్ఫ్యూజన్ లేదు. ఓటు చెల్లుతుందా లేదా అనేది వాళ్ళకే తెలియాలి.’’ అని ఎమ్మెల్యే సీతక్క అన్నారు. కాగా, ఎమ్మెల్యే సీతక్క వేసిన ఓటు చెల్లుతుందా? లేదా? అనే సందిగ్ధంలో కాంగ్రెస్ శ్రేణులు ఉన్నాయి.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..