AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Huzurabad: హుజురాబాద్‌‌లో వేగంగా మారుతున్న సమీకరణాలు.. కాంగ్రెస్‌లో చేరిన 13 మంది బీఆర్ఎస్ కౌన్సిలర్స్

బీఆర్ఎస్‌కు కంచుకోటగా ఉన్న ఈ ప్రాంతంపై హస్తం దృష్టి పెట్టింది. ఇప్పటికే, జమ్మికుంటకు చెందిన 13 మంది కౌన్సిలర్స్ కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకున్నారు. మరి కొంత మంది నేతలు తమతో టచ్‌లో ఉన్నారని కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు. ఏ చిన్న అవకాశం దొరికినా, దూకుడు ప్రదర్శిస్తుంది కాంగ్రెస్.

Huzurabad: హుజురాబాద్‌‌లో వేగంగా మారుతున్న సమీకరణాలు.. కాంగ్రెస్‌లో చేరిన 13 మంది బీఆర్ఎస్ కౌన్సిలర్స్
Brs Councilors Joined Congress
G Sampath Kumar
| Edited By: |

Updated on: Feb 04, 2024 | 12:35 PM

Share

బీఆర్ఎస్‌కు కంచుకోటగా ఉన్న ఈ ప్రాంతంపై హస్తం దృష్టి పెట్టింది. ఇప్పటికే, జమ్మికుంటకు చెందిన 13 మంది కౌన్సిలర్స్ కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకున్నారు. మరి కొంత మంది నేతలు తమతో టచ్‌లో ఉన్నారని కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు. ఏ చిన్న అవకాశం దొరికినా, దూకుడు ప్రదర్శిస్తుంది కాంగ్రెస్.

కరీంనగర్ జిల్లా హుజురాబాద్ నియోజకవర్గంలో రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. బీఆర్ఎస్ పార్టీకి కంచుకోటగా ఉన్న హుజురాబాద్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు నాయకులు పార్టీని వీడి కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారు. ఇటీవల జమ్మికుంట మున్సిపల్ చైర్మన్ తక్కల్లపల్లి రాజేశ్వరరావుపై అవిశ్వాస తీర్మానం పెట్టి నెగ్గింది కాంగ్రెస్. ఈ నేపథ్యంలో నెలరోజుల పాటు క్యాంపు రాజకీయాలు చేసిన 13 మంది బీఆర్ఎస్ కౌన్సిలర్లు ఆ పార్టీకి రాజీనామా చేశారు. మంత్రి పొన్నం ప్రభాకర్ సమక్షంలో హస్తం గూటికి చేరారు.

హుజురాబాద్ లో గట్టి పట్టున్న కాంగ్రెస్ పార్టీని ఉనికి లేకుండా చేసింది బీఆర్ఎస్. కానీ ఇప్పుడు సీన్ రివర్స్ అయింది. మొదటి నుండి ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డితో కొంత మంది బీఆర్ఎస్ నేతలకు విభేదాలు ఉన్నాయి. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం రావడం1తో పార్టీ మారుతున్నారు. మున్సిపల్ చైర్మన్‌పై అవిశ్వాసం నెగ్గడంతో పావులు కదిపిన పొనగంటి మల్లయ్య, నియోజకవర్గం ఇంచార్జి ఓడితల ప్రణవ్ బాబు ఆధ్వర్యంలో 13 మంది కౌన్సిలర్లను బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీలో చేరారు. దీంతో హుజురాబాద్ నియోజకవర్గంలో రాజకీయం వేడెక్కింది. గతంలో కాంగ్రెస్ పార్టీని వీడిన నాయకులకు మళ్ళీ ద్వారాలు తెరిచామన్న రేవంత్ రెడ్డి వ్యాఖ్యలతో నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీని వీడి కాంగ్రెస్ పార్టీ లో చేరుతున్నారు.

మొదటి నుంచి ఈ నియోజకవర్గం లో కాంగ్రెస్ బలహీనంగా ఉంది. ప్రస్తుత ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి గతం లో కాంగ్రెస్ పార్టీని వీడి, బీఆర్ఎస్‌లో చేరిపోయారు. హుజురాబాద్ ఉప ఎన్నికల సమయంలో గులాబీ కండువా కప్పుకున్నారు. ఆయనతో పలువురు కాంగ్రెస్ నేతలు ‘కారు’ ఎక్కేశారు. ఇప్పుడు మళ్ళీ, కాంగ్రెస్‌లో చేరేందుకు ఆసక్తి చూపుతున్నారు. అసెంబ్లీ ఎన్నికల సమయంలో కూడా పలువురు నేతలు.. కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. ఈ నియోజకవర్గంపై కాంగ్రెస్ ప్రత్యేక దృష్టి పెట్టింది. బీఆర్ఎస్‌ను బలహీన పర్చే పనిలో పడింది. పార్లమెంట్ ఎన్నికల వరకు మరిన్ని చేరికలు ఉంటాయని కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు. పార్లమెంట్ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని చేరికలను ప్రోత్సహిస్తోంది. కొంత మంది నేతలు పార్టీ వీడినంత మాత్రం ఏమి కాదని ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి అంటున్నారు. తమకు బలమైన క్యాడర్ ఉందని అంటున్నారు. ఇక జమ్మికుంటలో త్వరలోనే ఖాళీ కాబోతున్నట్లు మంత్రి పొన్నం ప్రభాకర్ జోస్యం చెప్పారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..