బెట్టింగ్ కేసులో నెక్ట్స్ టార్గెట్ ఎవరు..? సిట్ ఎలాంటి ప్లాన్‌తో ముందుకు వెళ్తోంది..?
బెట్టింగ్ యాప్‌ల భరతం పట్టేందుకు తెలంగాణ సర్కార్ సిద్ధమైంది. సిట్‌తో దాని మూలాలను పెకలించేందుకు లోతైన ఇన్విస్టేగేషన్‌కు ఆదేశించింది. 90రోజుల్లో బెట్టింగ్ యాప్స్ అంతు చూడాలని నిర్ణయించుకుంది. మరి అంతర్జాతీయ మాఫియాతో లింకులున్న బెట్టింగ్ యాప్స్‌ను మన చట్టాలతో కొట్టాగలమా...? సిట్ ఎలాంటి ప్లాన్‌తో ముందుకు పోతోంది..?

ఆన్‌లైన్ బెట్టింగ్ యాప్ ప్రమోషన్ కేసులో త్వరలో సెలబ్రిటీలకు పోలీసులు నోటీసులు జారీ చేయబోతున్నారు. ఆన్‌లైన్ బెట్టింగ్‌కు సంబంధించి ఇప్పటికే పలు పోలీస్ స్టేషన్లలో కేసులు నమోదు అయిన విషయం తెలిసిందే. వాటిని దర్యాప్తు చేసేందుకు ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేశారు డీజీపీ. తెలంగాణలో ఆన్‌లైన్ బెట్టింగులు నిరోధించేందుకు తగిన మార్గాలను సిట్ బృందం అన్వేషిస్తోంది.
ఆన్‌లైన్ బెట్టింగ్ కేసులపై సమీక్ష కోసం త్వరలో దర్యాప్తు అధికారులను పిలువనున్నారు స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్. తెలంగాణ ప్రభుత్వం ఆధ్వర్యంలో సీఐడీ డైరెక్టర్ జనరల్ శిఖా గోయెల్ పర్యవేక్షణలో ఏర్పాటు చేసిన ప్రత్యేక దర్యాప్తు బృందం (SIT) భవిష్యత్ కార్యాచరణను రూపొందించేందుకు తొలి సమావేశాన్ని నిర్వహించింది. ఈ సమావేశంలో ఎస్ఐటీ సభ్యులైన ఇన్‌స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్, ప్రొవిజన్స్ & లాజిస్టిక్స్ ఎం. రమేష్, ఇంటెలిజెన్స్ ఎస్పీ సిందు శర్మ, ఈఓడబ్ల్యూ ఎస్పీ కె. వెంకట లక్ష్మి, అడిషనల్ ఎస్పీ ఎస్. చంద్రకాంత్, ఈఓడబ్ల్యూ, సీఐడీ డీఎస్పీ ఎం. శంకర్ పాల్గొన్నారు.
ఈ సమావేశంలో, రాష్ట్రవ్యాప్తంగా ఆన్‌లైన్ బెట్టింగ్ కేసులను పరిశీలిస్తున్న దర్యాప్తు అధికారులను హైదరాబాద్‌లోని రాష్ట్ర పోలీస్ ప్రధాన కార్యాలయానికి పిలిపించేందుకు సిద్ధమవుతున్నారు. బెట్టింగ్ యాప్ కేసులకు సంబంధించిన ఫైల్స్ తోపాటు సంబంధిత సమాచారాన్ని నిర్దేశిత ఫార్మాట్‌లో తీసుకురావాల్సిందిగా ఆదేశించారు. సిట్ ఈ కేసుల దర్యాప్తును సమీక్షించి, స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్స్ (SoPs) రూపొందించి, దర్యాప్తు అధికారులకు మార్గదర్శకాలను అందించనుంది. అనంతరం, ఇతర సంబంధిత ప్రభుత్వ సంస్థలతో సమావేశాలు నిర్వహించనుంది.
ఈ ఐదుగురు సభ్యులున్న ప్రత్యేక దర్యాప్తు బృందానికి కేటాయించిన కేసు తోపాటు బదిలీ చేసిన అన్ని ఆన్‌లైన్ బెట్టింగ్ కేసులపై సమగ్రమైన నిర్దిష్ట కాలపరిమితిలో దర్యాప్తు చేపట్టనున్నారు. అదనంగా, ఆన్‌లైన్ బెట్టింగ్ వ్యవస్థను విశ్లేషించి, దాన్ని ప్రోత్సహించే అంశాలను గుర్తించి, తగిన సంస్కరణలను సూచించనుంది. దీంతో పాటు న్యాయపరమైన నిబంధనలు, నియంత్రణలు, ఆంక్షలను పరిగణనలోకి తీసుకుని, ఆన్‌లైన్ గేమింగ్ సంస్థాపన, ప్రచారం, ప్రకటనలను నిరోధించేందుకు అవసరమైన చట్టపరమైన మార్గాలను ప్రభుత్వానికి సిఫారసు చేయనుంది. తెలంగాణలోని అన్ని ప్రభుత్వ శాఖలు, సంస్థలు ఎస్ఐటీకి పూర్తి సహాయాన్ని అందించాల్సిందిగా సిట్ అధికారులు కోరారు. 90 రోజులలోపు తుది నివేదికను తెలంగాణ ప్రభుత్వానికి, డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్‌కు సమర్పించనున్నారు.
ఇప్పటికే పంజాగుట్టతోపాటు మియాపూర్ పోలీస్ స్టేషన్లలో సెలబ్రిటీలపై కేసులు నమోదు చేసిన విషయం తెలిసిందే. ఈ వ్యవహారంపై త్వరలోనే సెలబ్రిటీలకు పోలీసులు నోటీసులు జారీ చేయబోతున్నారు. బెట్టింగ్ ఆప్‌లను ప్రమోట్ చేసిన 25 మంది సెలబ్రిటీలపై పోలీసులు కేసులు నమోదు చేశారు. ఇప్పటికే పలువురు పోలీసుల ఎదుట హాజరై, తమ స్టేట్‌మెంట్లను సైతం వచ్చారు. తాజాగా వీరికి సైతం మరోసారి నోటీసులు జారీ చేసేందుకు రంగం సిద్ధం చేస్తోంది సిట్.
మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..