AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

PM Modi: తెలంగాణలో ప్రధాని మోదీ పర్యటన.. స్వాగతం పలకనున్న సీఎం రేవంత్ రెడ్డి.. ఆదిలాబాద్‌లో హై అలర్ట్..

PM Modi Adilabad Tour: పార్లమెంట్ ఎన్నికల కోసం బీజేపీ ప్రకటించిన మొదటి జాబితాలో తెలంగాణ నుంచి 9 మంది అభ్యర్థుల పేర్లను ప్రకటించింది. మూడు సిట్టింగ్‌ స్థానాలతో పాటు ఐదుస్థానాలకు అభ్యర్థులను ప్రకటించి దూకుడు మీదుంది కమలం పార్టీ. ఈ నేపథ్యంలో ఫస్ట్ లిస్టు ప్రకటించిన తర్వాత ప్రధాని మోదీ మొదటిసారి తెలంగాణలో పర్యటించబోతున్నారు. సోమవారం, మంగళవారాల్లో ఆదిలాబాద్‌, సంగారెడ్డిలో పర్యటించి 7వేల కోట్ల రూపాయల అభివృద్ది పనులను ప్రారంభించనున్నారు.

PM Modi: తెలంగాణలో ప్రధాని మోదీ పర్యటన.. స్వాగతం పలకనున్న సీఎం రేవంత్ రెడ్డి.. ఆదిలాబాద్‌లో హై అలర్ట్..
Revanth Reddy - PM Modi
Shaik Madar Saheb
|

Updated on: Mar 04, 2024 | 12:58 PM

Share

PM Modi Adilabad Tour: పార్లమెంట్ ఎన్నికల కోసం బీజేపీ ప్రకటించిన మొదటి జాబితాలో తెలంగాణ నుంచి 9 మంది అభ్యర్థుల పేర్లను ప్రకటించింది. మూడు సిట్టింగ్‌ స్థానాలతో పాటు ఐదుస్థానాలకు అభ్యర్థులను ప్రకటించి దూకుడు మీదుంది కమలం పార్టీ. ఈ నేపథ్యంలో ఫస్ట్ లిస్టు ప్రకటించిన తర్వాత ప్రధాని మోదీ మొదటిసారి తెలంగాణలో పర్యటించబోతున్నారు. సోమవారం, మంగళవారాల్లో ఆదిలాబాద్‌, సంగారెడ్డిలో పర్యటించి 7వేల కోట్ల రూపాయల అభివృద్ది పనులను ప్రారంభించనున్నారు. సంగారెడ్డిలో జరిగే సభలో పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేయనున్నారు ప్రధాని మోదీ. బీజేపీ ప్రకటించిన మొదటి జాబితాలో సిట్టింగ్‌ స్థానమైన ఆదిలాబాద్‌ను పెండింగ్‌లో ఉంచారు. సిట్టింగ్‌ ఎంపీ సోయం బాపురావు ఉన్నా.. ఆయనకి టికెట్‌ దక్కలేదు. ఈ క్రమంలో ప్రధాని మోదీ ఆదిలాబాద్ నుంచే తెలంగాణలో ఎన్నికల శంఖారావాన్ని పూరించబోతున్నారు. ఈ వేదికపైన సోయంబాపురావ్‌కి ప్రధాని మోదీ హామీ ఇస్తారా? లేక మరొకరిని ప్రకటిస్తారా..? అనేది ఉత్కంఠ నెలకొంది. మరోవైపు తనకు టికెట్‌ రాకుండా రాష్ట్ర నేతలే కొందరు అడ్డుకుంటున్నారని ఆరోపించారు సోయం బాపురావ్‌. ఒకవేళ టికెట్‌ రాకపోతే తన దారి తానూ చూసుకుంటానని తెలిపారు.

ఆదిలాబాద్‌కు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి..

సీఎం రేవంత్ రెడ్డి కూడా ప్రధాని మోదీతో కలిసి పలు అభివృద్ధి పనుల శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొననున్నారు. ముందుగా సీఎం రేవంత్ రెడ్డి, గవర్నర్ తమిళిసై ప్రధానిని అధికారికంగా స్వాగతం పలకనున్నారు. ప్రధాని వెంట ముగ్గురు కేంద్రమంత్రుల రానున్నారు. తెలంగాణలో పలు జాతీయ రహదారుల నిర్మాణానికి శంకుస్థాపన చేయనున్నారు. ఎన్టీపీసీ రామగుండం రెండో యూనిట్, అంబారి- ఆదిలాబాద్ పింపల్ కుట్టి ఎలక్ట్రిఫికేషన్ ప్రాజెక్టులను ప్రధాని మోదీ జాతికి అంకితం చేయనున్నారు.

ఆదిలాబాద్‌లో హై అలర్ట్..

పీఎం‌, సీఎంల రాకతో భారీ భద్రతను ఏర్పాటు చేశారు. ఎస్పీజీ భద్రతా వలయంలో ఏరోడ్రం, ఇందిర ప్రియదర్శిని స్డేడియం, ఎనిమిది హెలిప్యాడ్ లు, 2 వేల మంది భద్రతతో పకడ్భంధీ ఏర్పాట్లు చేశారు. అగ్ర నేతల రాకతో ఆదిలాబాద్ లో హై అలర్ట్ ప్రకటించారు. 2 వేల మంది పోలీసులతో భారీ భద్రత.. 300 ఎస్పీజీ భద్రత అదనంగా కేటాయించారు.

43 ఏళ్ల తర్వాత ఆదిలాబాద్‌కు ప్రధాని

మరోవైపు 43 ఏళ్ల తర్వాత ఆదిలాబాద్ జిల్లాకు ప్రధాని హోదాలో నరేంద్రమోదీ వస్తున్నారు. ఈ నేపథ్యంలో ఘన స్వాగతం పలికేందుకు పార్టీ శ్రేణులు సమాయత్తం అయ్యాయి. మోదీ సభ జరిగే ఇందిరా స్టేడియంలో ఏర్పాట్లను ఎంపీ సోయంబాపురావు, ఎమ్మెల్యేలు మహేశ్వర్ రెడ్డి, పాయల్‌ శంకర్‌ పర్యవేక్షించారు. సభకు దాదాపు లక్షమందికిపైగా హాజరవుతారని బీజేపీ నేతలు చెబుతున్నారు. ఆదిలాబాద్‌ సీటును గెలిచి మోదీకి గిఫ్ట్‌గా ఇస్తామంటున్నారు.

గెలుపు వ్యూహాలు..

తెలంగాణలో డబుల్ డిజిట్ టార్గెట్‌ పెట్టుకున్న బీజేపీ గెలుపు వ్యూహాలు రచిస్తోంది. ఈ క్రమంలో మోదీ సభపై భారీ ఆశలు పెట్టుకుంది. ప్రధాని ప్రసంగాలతో పార్టీ శ్రేణుల్లో ఉత్తేజం నింపడంతో పాటు, ఓటర్లను ఆకర్షించేందుకు కసరత్తు చేస్తోంది. గల్లీలో ఏ పార్టీ ప్రభుత్వం ఉన్నా.. ఢిల్లీలో మోదీ సర్కారు ఉండాలంటూ నినదిస్తోంది.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..