Omicron: తెలుగు రాష్ట్రాల్లో పంజా విసురుతున్న ఒమిక్రాన్.. భారీగా పెరుగుతున్న కేసులు
Omicron: కరోనా మహమ్మారి మళ్లీ పంజా విసురుతోంది. ఫస్ట్, సెకండ్ వేవ్ లు ప్రపంచ దేశాలను అతలాకుతలం చేసిన ఈ మాయదారి రోగం మరోసారి విరుచుకుపడుతోంది...
Omicron: కరోనా మహమ్మారి మళ్లీ పంజా విసురుతోంది. ఫస్ట్, సెకండ్ వేవ్ లు ప్రపంచ దేశాలను అతలాకుతలం చేసిన ఈ మాయదారి రోగం మరోసారి విరుచుకుపడుతోంది. వైరస్ రూపాంతరం చెంది ఒమిక్రాన్ రూపంలో ప్రపంచంపై దండెత్తింది. రోజురోజుకు చాపకింద నీరులా పాజిటివ్ కేసులు నమోదు అవుతుండటంతో ఆందోళనకు గురి చేస్తోంది. తెలంగాణలో కోవిడ్ థర్డ్ వేవ్ ఉదృతి మొదలైంది. కరోనా పడగ విప్పింది. ఒక్కరోజే వెయ్యికి పైగా కేసులు నమోదు.. మరోవైపు ఒమిక్రాన్ భయపెడుతోంది. కరోనా కేసుల పెరుగుదల ఆందోళన కలిగిస్తోంది. గత రెండు సంవత్సరాలుగా కరోనా నుంచి ఇబ్బందులు పడి.. ప్రస్తుతం తగ్గుముఖం పట్టి ఇప్పుడిప్పుడు ఊపిరి పీల్చుకుంటున్న తరుణంలో ఈ కొత్త వేరియంట్ వచ్చి మరింత ఆందోళనకు గురి చేస్తోంది.
తెలంగాణలో థర్డ్ వేవ్ మూడో ప్రమాద హెచ్చరిక మోగిస్తోంది. ప్రభుత్వం కోవిడ్ పరీక్షల సంఖ్య పెంచింది. ఒక్కరోజే తెలంగాణలో 1052 కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. ఇద్దరు మృతి చెందారు. వీటితో పాటు మరో 10 ఒమిక్రాన్ కేసులు కావడం అందోళన కలిగిస్తోంది. ఒమిక్రాన్ కేసుల సంఖ్య రాష్ట్రంలో అధికారికంగా 94కి చేరింది. ఇప్పటికే ఒమిక్రన్ తెలంగాణలో సామాజిక వ్యాప్తి జరిగిపోయిందని వైద్యశాఖ ఉన్నతాధికారులే హెచ్చరిస్తున్నారు. మారుతున్న వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో సీజనల్ వ్యాధులు ప్రబలుతున్నాయి. ఏదీ సీజనల్ వ్యాధి ? ఏదీ కరోనా ? ఏదీ ఒమిక్రాన్ ? తెలియక సామాన్య జనం భయాందోళనకు గురవుతున్నారు. ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం త్వరలోనే ఇంటింటికి వెళ్లి ఫీవర్ సర్వే చేయడానికి ఏర్పాట్లు చేస్తోంది. హోం ఐసోలేషన్ కిట్స్ అందించడానికి ఏర్పాట్లు చేస్తోంది.
సంక్రాంతి సంబరాలపై కరోనా పడగ
న్యూఇయర్ వేడుకలు ముగిశాయి. ఇక సంక్రాంతి సంబరాలకు సిద్దమవుతున్న వేళ…. కరోనా కేసులు పంజా విసరడం కలవర పెడుతోంది. జనాలు గుమిగూడకుండా ఇప్పటికే ప్రభుత్వం ఆంక్షలు అమలు చేస్తోంది. కేసులు పెరుగుతున్న తరుణంలో ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుందో వేచిచూడాలి.
ఏపీలో నిన్న ఒక్క రోజే 7 ఒమిక్రాన్ కేసులు..
కాగా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా ఒమిక్రాన్ భయాందోళనకు గురి చేస్తోంది. నిన్న ఒక్క రోజే 7 ఒమిక్రాన్ కేసులు నమోదు కావడం అధికారుల్లో కలవరపెడుతోంది. నిన్న కొత్తగా నమోదైన 7 కేసుల్లో తూర్పుగోదావరి జిల్లాలో 2, పశ్చిమ గోదావరిలో 2, కృష్ణా జిల్లాలో 3 కేసులు నమోదు అయ్యాయి.
రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 24 చేరిన ఒమిక్రాన్ కేసులు:
రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 24 ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయి. రోజురోజుకు కేసుల సంఖ్య పెరుగుతుండటంతో అధికారులు అప్రమత్తం అయ్యారు. సూడాన్ నుంచి విజయవాడ వచ్చిన 18 ఏళ్ల యువకుడు, అమెరికా నుంచి వచ్చిన 54 ఏళ్ల వ్యక్తికి ఒమిక్రాన్ సోకినట్లుగా నిర్ధారించారు అధికారులు. అలాగే గోవా వెళ్లి వచ్చిన కృష్ణా జిల్లా వాసి కూడా ఒమిక్రాన్ బారిన పడ్డారు. ఒమన్ నుంచి తూర్పు గోదావరి జిల్లాకు చెందిన విదేశీ ప్రయాణికురాలితో పాటు యూఏఈ నుంచి అదే జిల్లాకు వచ్చిన 66 ఏళ్ల వృద్ధుడికి ఒమిక్రాన్ సోకింది. పశ్చిమగోదావరి జిల్లాకు ఒమన్, యూఏఈ నుంచి వచ్చిన మరో మహిళ, పురుషుడు ఈ కొత్త వేరియంట్ బారిన పడ్డారు. ఇక మరికొంతమంది విదేశీ ప్రయాణికుల జీనోమ్ సీక్వెన్సీ ఫలితాలు రావాల్సి ఉంది. వారిలో ఒమిక్రాన్ ఉండవచ్చనే అనుమానం వ్యక్తం అవుతోంది.
రాష్ట్రంలో మూడో వేవ్?
నాలుగు రోజులుగా కేసులు పెరిగిపోతున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా 24 గంటల్లో 334 కరోనా కేసులు నమోదు అయ్యాయి. నిన్న ఒక్క విశాఖలోనే 80, చిత్తూరులో 55, కృష్ణాలో 50, గుంటూరులో 39 కేసులు వెలుగులోకి వచ్చాయి. 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 28,311 శాంపిల్ పరీక్షించగా 334 మందికి కొవిడ్ పాజిటివ్ తేలినట్లు ఏపీ రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ తెలిపింది. ఇక పాజిటివిటీ రేటు 1.17శాతంగా నమోదైంది. పాజిటివిటీ రేటు 1 శాతం దాటడం గత రెండు నెలల్లో ఇదే తొలిసారి. డిసెంబరు 30న యాక్టివ్ కేసులు 1,081 ఉంటే నిన్నటికి 1278కి చేరుకున్నాయి.
ఇవి కూడా చదవండి: