Omicron Variant: పంజా విసురుతున్న ఒమిక్రాన్.. ఆస్ట్రేలియాలో రికార్డు స్థాయిలో కేసులు నమోదు.. భారత్ పరిస్థితి ఏమిటి..?
Omicron Variant: కరోనా మహమ్మారి మళ్లీ పంజా విసురుతోంది. రెండు వేవ్‌ల రూపంలో ప్రపంచాన్ని అతలాకుతలం చేసిన ఈ మాయదారి రోగం మరోసారి విరుచుకుపడుతోంది...
Omicron Variant: కరోనా మహమ్మారి మళ్లీ పంజా విసురుతోంది. రెండు వేవ్‌ల రూపంలో ప్రపంచాన్ని అతలాకుతలం చేసిన ఈ మాయదారి రోగం మరోసారి విరుచుకుపడుతోంది. వైరస్ రూపాంతరం చెంది ఒమిక్రాన్ రూపంలో ప్రపంచంపై దండెత్తింది. ఈ నేపధ్యంలోనే యూకే, ఫ్రాన్స్, అమెరికా, జర్మనీ సహా పలు దేశాల్లో కేసుల సంఖ్య విపరీతంగా పెరిగిపోతోంది. ఈ క్రమంలో ఆస్ట్రేలియాలో కూడా ఒమిక్రాన్ విజృంభణ కొనసాగుతోంది. రోజురోజుకూ కొత్త కోవిడ్ కేసుల సంఖ్య పెరుగుతూపోతోంది. తాజాగా మంగళవారం ఆస్ట్రేలియాలో కొత్తగా నమోదైన కోవిడ్ కేసుల సంఖ్య రికార్డు స్థాయికి చేరుకుంది.
అక్కడి ఆసుపత్రులు, పరీక్షా కేంద్రాలపై రోగుల తాకిడి ఎక్కువైంది. ఆస్ట్రేలియాలో అత్యధిక జనాభా కలిగిన న్యూ సౌత్ వేల్స్ రాష్ట్రంలో కొత్తగా 23,131 కేసులు నమోదయ్యాయి. జనవరి 1న 22,577 కేసులు నమోదు అయ్యాయి. ఆసుపత్రుల్లో 1,344 మంది చేరారు. అంతకుముందు రోజు 140 మంది, గత ఏడాది సెప్టెంబరు చివరిలో నమోదైన కేసుల కంటే 78 మంది ఎక్కువగా చేరినట్లు తెలుస్తోంది. 83,376 కోవిడ్ టెస్టులు నిర్వహించగా.. 23,131 కొత్త కేసులను వైద్య అధికారులు గుర్తించారు. ప్రస్తుతం న్యూసౌత్ వేల్స్ లో పాజిటివిటీ రేటు 28 శాతం ఉంది.
విక్టోరియా రాష్ట్రంలో మంగళవారం 14,020 కేసులు నమోదయ్యాయి. అలాగే సోమవారం 8,577 కొత్త కేసులు నమోదైనట్లు తెలుస్తోంది. వైరస్ దెబ్బకు ఇంటెన్సివ్ కేర్‌లో 108 మందితో సహా ఆసుపత్రులలో 516 మంది ఉన్నారు. ఆస్ట్రేలియాలో మునపటి కంటే రికార్డ్ స్థాయిలో కరోనా కేసులు నమోదు కావడంతో అక్కడివారిని భయాందోళనలకు గురి చేస్తోంది. అత్యవసరమైతే తప్ప ఆసుపత్రిలో చికిత్స పొందవద్దని న్యూ సౌత్ వేల్స్ చీఫ్ మెడికల్ ఆఫీసర్ కెర్రీ చాంట్ సోమవారం ప్రజలను కోరారు. ఆరోగ్య వ్యవస్థపై అనవసరమైన భారం పడకుండా మన ఆరోగ్యాన్ని మనమే రక్షించుకునేలా ప్రతి ఒక్కరు జాగ్రత్తలు తీసుకోవాలని అన్నారు. ఒమిక్రాన్ బారినపడ్డవారిలో స్వల్ప లక్షణాలే ఉంటాయని.. ఆసుపత్రుల్లో చేరికలు తక్కువే ఉంటాయని వైద్య నిపుణులు చెబుతూ వస్తున్నప్పటికీ.. ఆస్ట్రేలియా పరిస్థితులు దీనికి పూర్తి వ్యతిరేకంగా ఉన్నాయి.
ఇదిలా ఉంటే.. ప్రస్తుతం భారతదేశంలో ఒమిక్రాన్ కేసులు రోజురోజుకూ పెరుగుతున్నాయి. అలాగే పలు రాష్ట్రాల్లో కరోనా కేసుల సంఖ్య అమాంతం పెరిగింది. ఇప్పటికే భారత్‌లో థర్డ్ వేవ్ మొదలైందని పలువురు శాస్త్రవేత్తలు చెబుతున్నారు.. ఈ క్రమంలో ఆస్ట్రేలియా లాంటి పరిస్థితులు దేశంలో రానున్న రోజుల్లో తలెత్తితే కేసుల సంఖ్య మరింతగా పెరిగే అవకాశం ఉంది. అయితే థర్డ్ వేవ్ నేపథ్యంలో ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం అన్ని రాష్ట్రాలను అప్రమత్తం చేసింది. ఎప్పటికప్పుడు వివరాలు సేకరిస్తోంది. ప్రతి ఒక్కరు మాస్క్‌లు ధరిస్తూ భౌతిక దూరం పాటించాలని అధికారులు సూచిస్తున్నారు. అలాగే వ్యాక్సినేషన్ ప్రక్రియను కూడా వేగవంతం చేసింది. ప్రతీ ఒక్కరూ వ్యాక్సిన్ తీసుకునేలా చర్యలు తీసుకుంటోంది. ఇప్పటికే టీనేజర్లకు వ్యాక్సినేషన్ మొదలు పెట్టగా.. జనవరి 10 నుంచి హెల్త్ వర్కర్స్, దీర్ఘకాలిక రోగులకు బూస్టర్ డోస్ ఇచ్చేందుకు, ఆ తర్వాత పిల్లలకు వ్యాక్సిన్ వేసేందుకు ప్రణాళికలు చేపట్టింది.
భారత్‌లో పెరుగుతోన్న ఒమిక్రాన్ కేసులు..
భారత్‌లో కూడా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ కేసుల సంఖ్య పెరిగిపోతోంది. ఇక మహారాష్ట్ర, పంజాబ్‌లో కూడా ఒమిక్రాన్ విజృంభిస్తోంది. పంజాబ్‌లోని పాటియాలా మెడికల్ కాలేజీలో 100 మంది విద్యార్థులు కోవిడ్ బారిన పడ్డారు. దీంతో అప్రమత్తమైన ఆరోగ్యశాఖ అధికారులు.. కాలేజీలో అందరికి కోవిడ్ పరీక్షలు నిర్వహిస్తున్నారు. అలాగే ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌కు కూడా కరోనా పాజిటివ్ వచ్చింది. అతి ప్రమాదకరమైన డెల్టా కంటే వేగంగా ఒమిక్రాన్ వ్యాపించడం ఆందోళన వ్యక్తం అవుతోంది. రాబోయే రోజుల్లో ఒమిక్రాన్ వేరియంట్ మరింతగా విజృంభించే అవకాశాలున్నాయని, జాగ్రత్తగా ఉండాలని ఇప్పటికే నిపుణులు సూచించారు. ఆస్ట్రేలియాలో ఉన్న పరిస్థితి భారత్‌లో వస్తే మరింత దారుణంగా ఉండే అవకాశం ఉందని నిపుణులు వెల్లడిస్తున్నారు. భారత్‌లో గడిచిన 24 గంటల్లో 37,379 కొత్త కోవిడ్ కేసులు నమోదు కాగా, ఒమిక్రాన్ కేసులు 1,892 నమోదు అయ్యాయి. ఒమిక్రాన్ బారిన పడిన కేసుల్లో 766 కేసులు రికవరీ అయ్యాయి.
డెల్టా కంటే ఒమిక్రాన్ వేగంగా..
మరోవైపు డెల్టాతో పోలిస్తే ఒమిక్రాన్ వేగంగా వ్యాపిస్తుండటంతో రోగనిరోధక శక్తిని తగ్గుతుందని నివేదికలు వస్తుండడంతో ఆందోళనకు గురవుతున్నాయి. అయితే ఇలాంటి సమయంలో ఇటీవల వచ్చిన ఓ అధ్యయనం ఊరట కలిగిస్తోంది. ఒమిక్రాన్ కరోనావైరస్ వేరియంట్‌తో ఇన్ఫెక్షన్ మునుపటి డెల్టా జాతికి వ్యతిరేకంగా రోగనిరోధక శక్తిని బలోపేతం చేస్తుందని దక్షిణాఫ్రికా శాస్త్రవేత్తలు తెలిపారు. తీవ్రమైన వ్యాధి ప్రమాదాన్ని తగ్గిస్తుందని తెలిపారు. దక్షిణాఫ్రికాలో వెలుగు చూసిన ఒమిక్రాన్ వేరియంట్ వ్యాప్తి, ప్రభావాలను అంచనా వేసేందుకు ప్రపంచ వ్యాప్తంగా అధ్యయనాలు కొనసాగుతూనే ఉన్నాయి. ఇందులో భాగంగా ఒమిక్రాన్ సోకిన ఓ 33 మందిపై దక్షిణాఫ్రికా నిపుణులు అధ్యయనం చేపట్టారు. వ్యాక్సిన్ తీసుకున్న, తీసుకోని వారిని పరిగణనలోకి తీసుకున్నారు. ఒమిక్రాన్ సోకిన వారిలో డెల్టాను తటస్థీకరించే సామర్థ్యం పెరిగినట్లు గుర్తించారు.
ఇవి కూడా చదవండి: