Telangana: అతనికి బాత్రూమ్‌లోనే నివాసం…! దాతల సాయం కోసం ఎదురు చూస్తున్న వృద్దుడు..
Khammam: బాత్రూం గదిలోనే చిన్న కట్టెల పొయ్యి ఏర్పాటు చేసుకున్నాడు,ఆ పక్కనే పడక మంచంపై సేదతీరుతున్నాడు. సంతానం లేదు. ఉన్న ఒక్క వికలాంగురాలైన భార్య మరణించడంతో ఒంటరిగా, బ్రతుకుభారంగా కాలం వెళ్ళదీస్తున్నాడు. ఇంటికోసం అధికారుల వద్దకు వెళ్తే తనకి స్లాబుతో కూడిన ఇల్లు ఉందని అధికారులు సమాధానం ఇస్తున్నారని భద్రయ్య వాపోయాడు.
ఖమ్మం జిల్లా, అక్టోబర్04; పేదరికమే శాపం అయింది, ఒంటరితనం భారమైంది. దీనితో బ్రతుకు బాత్రూం పాలయ్యింది. నిరక్షరాస్యత ఓవైపు,తన సమస్యను ఎవరికి చెప్పుకోవాలో ఎలా చెప్పుకోవాలో తెలియని అమాయకత్వం మరోవైపు.ఎప్పుడో 20 ఏళ్ల కిందట నిర్మించిన చిన్నఇల్లు,ఇప్పుడు కురుస్తున్న చిన్న చిన్న వర్షాలకే పైనుండి వర్షపునీరు కురుస్తుండటంతో ఆ ఇంట్లో నివసించలేక ఓ గిరిజన వృద్ధుడు బాత్రూం గదినే నివాసగృహంగా మార్చుకొని గృహలక్ష్మి పథకం కోసం ఎదురుచూస్తున్నాడు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండలం గురువాయిగూడెం గ్రామంలో పద్ధం భద్రయ్య అనే వృద్ధుడు బాత్రూంనే తన నివాసంగా చేసుకొని బ్రతుకును సాగదీస్తున్నాడు.
గురువాయిగూడెం గ్రామంలో పద్ధం భద్రయ్య అనే వృద్ధుడు.. బాత్రూం గదిలోనే చిన్న కట్టెల పొయ్యి ఏర్పాటు చేసుకున్నాడు,ఆ పక్కనే పడక మంచంపై సేదతీరుతున్నాడు. సంతానం లేదు. ఉన్న ఒక్క వికలాంగురాలైన భార్య మరణించడంతో ఒంటరిగా, బ్రతుకుభారంగా కాలం వెళ్ళదీస్తున్నాడు.తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చెప్పిన బెడ్ రూమ్ ఇల్లు కానీ గృహలక్ష్మి పథకం గాని తనలాంటి పేదలకు వర్తించవన్న అధికారుల సమాధానం చెపుతూ దిశతో తన బాధను పంచుకున్నాడు.గృహలక్ష్మి పథకంలో ఇంటికోసం అధికారుల వద్దకు వెళ్తే తనకి స్లాబుతో కూడిన ఇల్లు ఉందని అధికారులు సమాధానం ఇస్తున్నారని భద్రయ్య వాపోయాడు.
తనకు డబుల్ బెడ్ రూమ్ ఇల్లు కానీ గృహలక్ష్మి పథకం గాని వర్తించవని అధికారులు చెప్పటంతో ఉన్న ఇంటిని కూల్చే దైర్యం చేయలేక, వర్షం కురుస్తున్న ఇంటికి మరమ్మతులు చేయించుకునే ఆర్థిక పరిస్థితి అసలే లేక. తన సమస్యను ఎవరితో పంచుకోవాలో తెలియక, అధికారులకు అర్థమయ్యేలా చెప్పలేక తనలో తనే కుమిలిపోతున్నాడు. రోజంతా కూలి,నాలి చేసుకొని ఇంటికి వచ్చిన తనకి నీడనిచ్చే ఇళ్లే,ఏ రోజు పెచ్చులూడి తన తలపై పడి ఆసుపత్రి పాలవుతాననే భయమో పక్క.ఏ అర్ధరాత్రి కురిసిన వర్షాలకు ఎటుపోవాలో కూడా తెలియని దయనీయస్థితి మరోపక్క.గిరిజన వృద్ధుడి జీవితాన్ని బాత్రూం గది పాలుచేసింది. దయచేసి అధికారులు స్పందించి తనకు నివాస గృహాన్ని ఏర్పాటు చేయగలరని స్థానిక ఎమ్మెల్యేను, అధికారులను వేడుకుంటున్నాడు.
మరిన్ని తెలంగాణ న్యూస్ కోసం క్లిక్ చేయండి..