AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Online Marriage: వాళ్లక్కడ.. వీళ్లిక్కడ.. ఆన్‌లైన్‌ పెళ్లి సందడి! వేడుక ఎలా జరిగిందో చూడండి.

Online Marriage: కరోనా మనుషుల మధ్య దూరాన్ని పెంచేసింది. ఒకప్పుడు చిన్న చిన్న పండుగలకు కూడా అందరూ కలుసుకునే వారు కానీ ఇప్పుడు పెళ్లిళ్లకు కూడా వెళ్లాలంటే ఒకటికి రెండు సార్లు ఆలోచించుకునే పరిస్థితులు...

Online Marriage: వాళ్లక్కడ.. వీళ్లిక్కడ.. ఆన్‌లైన్‌ పెళ్లి సందడి! వేడుక ఎలా జరిగిందో చూడండి.
Online Marriage
Narender Vaitla
|

Updated on: Aug 22, 2021 | 11:16 AM

Share

Online Marriage: కరోనా మనుషుల మధ్య దూరాన్ని పెంచేసింది. ఒకప్పుడు చిన్న చిన్న పండుగలకు కూడా అందరూ కలుసుకునే వారు కానీ ఇప్పుడు పెళ్లిళ్లకు కూడా వెళ్లాలంటే ఒకటికి రెండు సార్లు ఆలోచించుకునే పరిస్థితులు వచ్చాయి. పక్కపక్క ఇళ్ల వారే కలుసుకోలేకపోతున్నారు.. అలాంటిది విదేశాల్లో ఉన్న వారి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. విమానాలు నడవకపోవడం, కరోనా కఠిన ఆంక్షలు ఉన్న నేపథ్యంలో ఇక్కడి వారు అక్కడికి వెళ్లట్లేదు, అక్కడి వారు ఇక్కడికి రావట్లేదు. ఇక కరోనా పుణ్యామాని ఆన్‌లైన్‌ మీటింగ్‌లకు ఆదరణ బాగా పెరిగింది. ఉద్యోగం, విద్య ఇలా అంతా ఆన్‌లైన్‌లోనే అవుతోన్న వేళ తాజాగా ఏకంగా వివాహ వేడుక కూడా ఆన్‌లైన్‌లోనే జరగడం అందరినీ ఆశ్చర్యాన్ని గురి చేస్తోంది. నిర్మల్‌ జిల్లా బైంసాలో జరిగిన ఈ ఆన్‌లైన్‌ పెళ్లి సందడి ఇప్పుడు హాట్‌ టాపిక్‌గా మారింది.

Marriage

వివరాల్లోకి వెళితే.. నిర్మల్ జిల్లా భైంసా పట్టణానికి చెందిన ప్రకాష్ రెడ్డి-జ్యోతిల కూతురు శ్రావణికి మహారాష్ట్రలోని కిని గ్రామానికి చెందిన నారాయణ్ రెడ్డి-లక్ష్మీల కుమారుడు నవీన్‌ల వివాహం రెండేళ్ల క్రితం కుదిరింది. వదూవరులిద్దరూ ఉద్యోగరీత్యా అమెరికాలోనే ఉంటున్నారు. అయితే కరోనా కారణంగా భారత్‌కు వచ్చే అవకాశాలు లేకపోవడంతో వీరి వివాహం వాయిదా పడుతూ వచ్చింది. ఇక తాజాగా రెండు నెలల క్రితం ఇండియాలో ఉన్న పెద్దలు వివాహ తేదీని ఖరారు చేశారు. అయితే పరిస్థితుల్లో పెద్దగా మార్పు లేకపోవడం వివాహం కోసం భారత్‌కు వచ్చే అవకాశం దొరకలేదు. దీంతో ముహుర్తం దాటిపోతే ఎలా అని ఇరు కుటుంబ సభ్యుల్లో ఆలోచన మొదలైంది.

అప్పుడే వీరికి ఓ హైటెక్‌ ఆలోచన వచ్చింది. ఎలాగైనా ముహుర్త సమయానికి వివాహ తంతును పూర్తి చేయాలని భావించిన కుటుంబసభ్యులు.. ఆన్‌లైన్‌ వివాహాన్ని జరిపించారు. బైంసాలోని ఓ ఫంక్షన్‌ హాల్‌ను బుక్‌ చేసి బంధువులను ఆహ్వానించారు. ఫంక్షన్‌ హాల్‌లో పెద్ద ప్రొజెక్టర్‌ను ఏర్పాటు చేసి అమెరికాలో జంట మూడు ముళ్ల బంధంతో ఒక్కటయ్యే క్షణాలను ఆన్‌లైన్‌ ద్వారా బైంసాలో టెలికాస్ట్‌ చేశారు. దీంతో ఈ ఆన్‌లైన్‌ వివాహ వేడుకకు హాజరైన కుటుంబసభ్యులంతా ప్రొజెక్టర్‌లో పెళ్లిని చూసి అక్షింతలు జల్లి కొత్త జంటను ఆశీర్వదించారు. అమెరికాలో పెళ్లి పూర్తి కాగానే పసందైన విందును ఆరగించి, కట్నకానుకలు జంట బంధువులకు సమర్పించుకొని వెళ్లారు. ఇక పెళ్లికి హాజరైన బంధువులంతా కరోనా పుణ్యామాని ఇలాంటి ఇంకెన్ని పరిణామాలు చూడాల్సి వస్తుందోనని ముచ్చటించుకున్నారు.

నరేష్ స్వేన

టీవి9 కరస్పాడెంట్,  ఉమ్మడి ఆదిలాబాద్