Nalgonda Election Result 2023: నల్గొండలో కాంగ్రెస్ జెండా ఎగరేసిన కోమటిరెడ్డి వెంకటరెడ్డి.. భారీ మెజార్టీతో..
Nalgonda Assembly Election Result 2023 Live Counting Updates: అది రాష్ట్రంలోనే హాట్ అండ్ హీట్ నియోజకవర్గం. నేతల హాట్ హాట్ కామెంట్స్ తో నిత్యం వార్తల్లో నిలిచే నియోజకవర్గమీది. ఇక్కడ రెండోసారి గులాబీ జెండా ఎగురుతుందా...? సీఎం కేసీఆర్ దత్తత తీసుకున్న ఈ నియోజకవర్గంలో అభివృద్ధి జరిగిందా..? ఎమ్మెల్యే పనితీరు ఎలా ఉంది..? నల్గొండ అసెంబ్లీ నియోజకవర్గంలో పొలిటికల్ స్టేటస్ ఏంటి..,?
నల్లగొండ అంటేనే విప్లవాల ఖిల్లా. ఉద్యమాల గడ్డ… పోరాటాలకు అడ్డా. అందుకే ఇక్కడ దశాబ్దాలు గడుస్తున్నా.. కామ్రేడ్ల ఛాయలు కనిపిస్తుంటాయ్. మధ్యలో కొన్నేళ్ల పాటు కాంగ్రెస్ ఏలినా… ప్రస్తుతం ఈ నియోజకవర్గమంతా గులాబీ గుబాళింపు కనిపిస్తోంది. నల్గొండ అంటే కోమటిరెడ్డి బ్రదర్స్… కోమటిరెడ్డి బ్రదర్స్ అంటే నల్గొండ… అంటుంటారు వారి అభిమానులు. ఆ రేంజ్ హవా కూడా కనిపిస్తూ ఉంటుంది. అయితే, నల్గొండలో నాలుగు దఫాలు ఎమ్మెల్యేగా గెలిచి తిరుగులేని పట్టు సాధించిన కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డిని… 2018లో ఓడించి కొత్త చరిత్ర లిఖించారు సిట్టింగ్ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్‌రెడ్డి. నల్గొండ (Nalgonda Assembly Election) కోటపై గులాబీ జెండా ఎగరేయాలన్న కారు నేతల కల… అలా కంచర్ల రూపంలో తీరిందన్నమాట.. ఈ క్రమంలో 2023 ఎన్నికల్లో మళ్లీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి కాంగ్రెస్ జెండా ఎగురేశారు. బీఆర్ఎస్ అభ్యర్థి కంచర్ల భూపాల్ రెడ్డిపై కోమటిరెడ్డి భారీ మెజార్టీతో గెలుపొందారు. 54వేలకు పైగా మెజార్టీతో కోమటిరెడ్డి గెలుపొందారు..
అధికార పార్టీ ఎమ్మెల్యేగా… మరోసారి విజయం సాధించేందుకు ఉవ్విళ్లూరారు కంచర్ల. ఉద్ధండ నేతను గత ఎన్నికల్లో ఉఫూమని ఊదేశానన్న కాన్ఫిడెంటుతో ..ఈ ఎన్నికల్లో బరిలోకి దిగారు. అయితే, ఈసారి అదంత ఈజీ కాదన్న ముచ్చట వినిపిస్తోంది లోకల్‌గా. అయితే విజయం తనదే.. అన్నారు భూపాల్ రెడ్డి. కాంగ్రెస్ నుంచి మరోసారి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి బరిలో నిలిచారు. ఇక్కడ కాంగ్రెస్ పార్టీలో తిరుగులేని నాయకుడిగా ఉన్న కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి… 1999 నుంచి 2014దాకా నాన్‌స్టాప్ విక్టరీలు కొట్టారు. అయితే, అనూహ్యంగా 2018లో ఎదురైన ఓటమి.. ఆయనకు పెద్ద షాకే ఇచ్చింది. తిరుగులేదనుకున్న చోట ప్రజలిచ్చిన సంచలన తీర్పు.. మైండ్ బ్లాంకయ్యేలా చేసింది. అయితే, ఆ తర్వాత జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో భువనగిరి ఎంపీగా గెలవడం ఆయనకు పెద్ద ఊరటనే చెప్పాలి. అయితే, ఎంపీగా గెలిచినా… సొంత ఇలాఖాను వదల్లేదు కోమటిరెడ్డి. ఇప్పుడు మరోసారి రంగంలోకి దిగారు. అటు బీజేపీ నుంచి మాదగోని శ్రీనివాస్ గౌడ్, సీపీఎం నుంచి ముదిరెడ్డి సుధాకర్ రెడ్డి బరిలో నిలిచారు. అయితే ప్రధాన పోటీ మాత్రం కోమటిరెడ్డి, కంచర్ల మధ్యేనన్న టాక్ నియోజకవర్గంలో బలంగా వినిపించింది.. ఈ క్రమంలో కోమటిరెడ్డి భారీ మెజార్టీతో గెలుపొందారు.
తెలంగాణ ఎన్నికల ఫలితాలు 2023 లైవ్
1962లో ఏర్పడిన నల్గొండ అసెంబ్లీ నియోజకవర్గంలో మొదటిసారిగా బొమ్మగాని ధర్మభిక్షం సిపిఐ నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. కొన్నాళ్ల పాటు ఎర్రన్నల హవా నడిచినా… ఆ తర్వాత ఈ స్థానం హస్తగతమైంది. అయితే, 1985లో టీడీపీ వ్యవస్థాపకుడు, దివంగత ఎన్టీరామారావు పోటీచేసిన రెండు స్థానాల్లో నల్గొండ కూడా ఒకటి. రెండు స్థానాల్లోనూ గెలిచిన ఎన్టీఆర్.. నల్గొండను వదులుకున్నారు. ఆ తర్వాత జరిగిన బైపోల్‌లోనూ టీడీపీయే గెలిచింది. ఇక 1999 నుంచి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి రూపంలో కాంగ్రెస్ హవా మళ్లీ మొదలైంది. 2లక్షల 25వేల మంది ఓటర్లున్న నల్గొండ నియోజకవర్గంలో… టౌన్‌లో ఉన్న ముస్లిం ఓట్లే గెలుపోటములను ప్రభావితం చేస్తుంటాయ్.
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల లైవ్ కవరేజ్