Sagar Election: అంతన్నారు..ఇంతన్నారు..చివరికి డిపాజిట్టూ దక్కలేదు..ఎందుకబ్బా? సాగర్ లో కమలదళానికి గట్టి దెబ్బ!

సాధారణంగా ఉప ఎన్నిక అంటే.. అధికార పార్టీకే కాస్త మొగ్గు ఉంటుంది. అందులోనూ సెంటిమెంట్ ఉన్న చోట అది మరికాస్త ఎక్కువ ఉంటుంది. ఈ లెక్కలేసుకున్నాకే.. బరిలో దిగిన పార్టీలు జబ్బలు చరుచుకోవాలి.

  • Publish Date - 7:51 am, Mon, 3 May 21
Sagar Election: అంతన్నారు..ఇంతన్నారు..చివరికి డిపాజిట్టూ దక్కలేదు..ఎందుకబ్బా? సాగర్ లో కమలదళానికి గట్టి దెబ్బ!
Sagar Elections

Sagar Election: సాధారణంగా ఉప ఎన్నిక అంటే.. అధికార పార్టీకే కాస్త మొగ్గు ఉంటుంది. అందులోనూ సెంటిమెంట్ ఉన్న చోట అది మరికాస్త ఎక్కువ ఉంటుంది. ఈ లెక్కలేసుకున్నాకే.. బరిలో దిగిన పార్టీలు జబ్బలు చరుచుకోవాలి. ఎక్కడో దొరికిన విజయాన్ని ఇక్కడ దొరకపుచ్చుకుంటాం అంటూ గుడ్డిగా ముందుకు వెళితే ఇదిగో ఇప్పుడు బీజేపీ లానే ఉన్న పరువు పోగొట్టుకోవాల్సి ఉంటుంది. ఈపాటికే అర్ధం అయివుంటుంది.. ఇవి నాగార్జున సాగర్ ఉప ఎన్నికలో భారతీయ జనతా పార్టీ గురించి చెబుతున్న మాటలని. అక్కడ పోటీకి దిగిన బీజేపీకి డిపాజిట్టూ దక్కకపోవడం తెలంగాణా వ్యాప్తంగా ఆ పార్టీ శ్రేణులను తీవ్ర నిరాశ పరిచింది.

ఎందుకంటే, ఒక పక్క కాంగ్రెస్ పరిస్థితి నానాటికీ తీసికట్టుగా మారింది. మరో పక్క దుబ్బాకలో గెలుపు.. గ్రేటర్ లో మెరుపులు కమలదళానికి ఫుల్ జోష్ ఇచ్చాయి. దీంతో తామే అధికార టీఆర్ఎస్ పార్టీకి సరైన పోటీ అనే భావనలోకి వెళ్ళిపోయారు. అదే ధోరణిలో కాలుదువ్వుతూ వస్తున్నారు. అయితే, ఎమ్మెల్సీ ఎన్నికలు మొదట ఓ షాక్ ఇచ్చాయి. సిట్టింగ్ స్థానాన్నీ గెలవలేకపోయింది.. ఇంకో స్థానంలో నాలుగో ప్లేసులో ఆగిపోయింది. వెంటనే సాగర్ ఉప ఎన్నిక హడావుడి మొదలైంది. దీంతో మళ్ళీ మేమే అంటూ దూకుడుగా అక్కడ ప్రచారం అన్ని పార్టీల కంటె ముందే మొదలెట్టేశారు. చివరికి వచ్చేసరికి ధరావత్తూ దక్కక బోర్లా పడ్డారు. ఇక్కడ బీజేపీ ఓటమి కన్నా..కనీసం డిపాజిట్ దక్కకపోవడమే విశేషం. ఆ పార్టీకి కేవలం 7,676 ఓట్లే వచ్చాయి.

ఎందుకిలా?

సాగర్ బరిలో అన్ని పార్టీల కంటె ముందే బీజేపీ దూకేసింది. కానీ, అభ్యర్ధి ఎవరనేది తేల్చడానికి నామినేషన్ల చివరి నిమిషం వరకూ కమలదళానికి అవకాశం కుదరలేదు. వర్గ పోరుతో ఎవరికీ టికెట్ ఇవ్వాలనే అంశాన్ని తెల్చుకోలేకపోయింది. బీజేపీ. దీంతో ప్రచారంలో ఊపు పోయింది. అక్కడే బీజేపీ పరిస్థితి తల్లకిందులుగా కనిపించింది. పైగా టికెట్ ఆశించి భంగపడ్డ బీసీ నేత అంజయ్యయాదవ్‌ పార్టీని వదిలేసి టీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్నారు. ఇక ఇక్కడ చెప్పుకోదగ్గ నాయకులుగా ఉన్న కంకణాల నివేదితరెడ్డి, ఇంద్రసేనారెడ్డి ప్రచారంలో మమ అనిపించారు అంతే.

ఇక సరిగ్గా ఈ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ చేతికి బ్రహ్మాస్త్రం దొరికేసింది. అదే.. గ్రేటర్ పరిధిలోని లింగోజీగూడ డివిజన్ ఉప ఎన్నిక. అక్కడ తమ పార్టీ అభ్యర్ధిని ఏకగ్రీవం చేసుకోవడం కోసం బీజేపీ నాయకులు కేటీఆర్ ను కలవడం.. కాంగ్రెస్ కు ప్రచారాస్త్రం అయిపోయింది. టీఆర్ఎస్..బీజేపీ రెండూ ఒకటే అనే సందేశాన్ని గట్టిగా కాంగ్రెస్ ప్రజల్లోకి తీసుకు వెళ్ళిపోయింది.

అదేవిధంగా ఇక్కడ ప్రచారం చేసిన కీలక నేతలనూ జనం పెద్దగా పట్టించుకోలేదు. రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌, కేంద్ర సహాయమంత్రులు కిషన్‌రెడ్డి, అర్జున్‌రామ్‌ మేఘ్వాల్‌, మాజీ ఎంపీ విజయశాంతితో పాటు పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జి తరుణ్‌ ఛుగ్‌ సహా పలువురు సాగర్‌లో ప్రచారంలో స్పీడుగా పాల్గొన్నారు. కానీ, వాళ్ళెవరూ ఓటర్లను ఆకట్టుకోలేకపోయారు. ముందే చెప్పినట్టు సెంటిమెంట్ బలంగా ఉన్న చోట బరిలోకి దిగితే.. పరిస్థితి మొదటికే మోసం తెస్తుంది. ఇప్పుడు బీజేపీ పరిస్థితి అలానే ఉంది.

Also Read: జీహెచ్‌ఎంసీ అధికారులతో సీఎస్‌ సోమేష్‌కుమార్‌ టిలికాన్ఫరెన్స్‌.. కరోనా నియంత్రణ చర్యలపై దిశానిర్దేశం

Telangana Municipal Corporations Election Results 2021 LIVE: తెలంగాణ మినీ మున్సిపల్ ఫలితాలు. ఈ పోరులో విజేతలు ఎవరు..?